ఖమ్మం, జులై 14 (జనవిజయం) : శుక్రవారం డ్రై డే ను పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ఖమ్మం నగరం ఖానాపురం హవేలిలో పర్యటించి పారిశుద్ధ్య తనిఖీలు చేశారు. కలెక్టర్ సైడ్ డ్రైనేజీలు పరిశీలించి, నిల్వ నీటిలో లార్వా ఉన్నది, లేనిది పరిశీలించారు. నీటి తొట్టిలు, కూలర్లలో ఉన్న నీటిని గమనించి గృహనివాసులతో తొలగింపచేశారు. తొట్టిలు, కూలర్లు, వాడని డ్రమ్ములు, టైర్లు వంటి వాటిలో నీరు నిల్వకుండా చూడాలన్నారు. డెంగ్యూ దోమల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని, దోమలు రాకుండా నియంత్రించవచ్చని, ఒకసారి దోమలు కుట్టి డెంగ్యూ వస్తే తీవ్ర అనారోగ్యంపాలవడం, ఆర్థికంగా నష్టపోవడంతో పాటు, ప్రాణహాని ఉంటుందని ఆయన తెలిపారు. ఇంటింటికి తిరిగి ఇంట్లో, పరిసరాలను పరిశీలిస్తూ, నీటి నిల్వలను తొలగిస్తూ, జాగ్రత్తల విషయమై ప్రజలకు కలెక్టర్ అవగాహన కల్పించారు. డెంగ్యూ పాజిటివ్ వచ్చిన వారి ఇంటిలోని అందరికి, చుట్టుపక్కల వారికి పరీక్షలు చేయాలని ఆయన అన్నారు. ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టి, లార్వాలను గుర్తించి నిర్మూలించాలని ఆయన తెలిపారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని, జాగ్రత్తలు పాటిస్తూ కాపాడుకోవాలని ఆయన సూచించారు. కలెక్టర్ పర్యటన సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్యాధికారి డా. బి.మాలతి, జిల్లా మలేరియా అధికారి లక్ష్మినారాయణ, మంచుకొండ పి.హెచ్.సి వైద్యులు సంధ్యారాణి, నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమీషనర్ మల్లీశ్వరీ అధికారులు తదితరులు ఉన్నారు.