భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్ట్ 02 (జనవిజయం): ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలు వల్ల జరిగిన నష్టం ను అంచనా వేసేందుకు కేంద్ర అధికారిక బృందం జిల్లాకు రానున్నట్లు కలెక్టర్ ప్రియాంక అలా తెలిపారు. ఈ విషయమై కలెక్టర్ బుధవారం ఐడిఓసి కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర కమిటి పర్యటనపై రెవిన్యూ, పంచాయతీ రాజ్, ఇరిగేషన్, వ్యవసాయ, ఉద్యాన, ఆర్ అండ్ బి, మిషన్ భగీరధ తదితర శాఖల అధికారులతో కలెక్టర్ చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కమిటి పర్యటన నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండాలని చెప్పారు. మండలం, క్లస్టర్ వారిగా జరిగిన నష్టాలపై వ్యవసాయ, ఉద్యాన, ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్, విద్యుత్, మిషన్ బగీరథ తదితర అధికారులు సమగ్ర నివేదికలతో హాజరు కావాలని చెప్పారు. జరిగిన నష్టాలు గణన సందర్భంగా అధికారులు తప్పక ప్రభుత్వ మార్గ దర్శకాలు, నిబంధనలననుసరించి ఎలాంటి పక్షపాతాలకు తావులేకుండా నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఎంతో పకడ్బందిగా నివేదికలు తయారు చేయాలని చెప్పారు. దెబ్బ తిన్న పంటలపై విస్తీర్ణం, సర్వే నంబర్ వారిగా సమగ్రమైన నివేదికలు తయారు చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఐటిడిఏ పిఓ ప్రతీకై జైన్, అదనపు కలెక్టర్ రాంబాబు, డిఆర్డిఓ మధుసూదన్ జు, ఇరిగేషన్ ఎస్ఈ వెంకటేశ్వరరెడ్డి, డిపిఓ రమాకాంత్, పశుసంవర్థక శాఖ డిడి పురందర్, వ్యయసాయ శాఖ అధికారి అభిమన్యుడు, ఉద్యాన అధికారి మరియన్న, ఆర్ అండ్ బి భీమ్లా, పిఆర్ ఈఈ మంగ్యా, గిరిజన సంక్షేమ శాఖ ఈ ఈ తానాజి, మిషన్ బగీరథ ఈ ఈ తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు.