- బిఎస్పీ జిల్లా అధ్యక్షులు బుర్ర ఉపేంద్ర సాహు
ఖమ్మం, ఆగస్టు 10 (జనవిజయం): ముఖ్యమంత్రి కేసీఆర్ కు మద్యం టెండర్ మీదున్న ప్రేమ.. పాఠశాలల మీదలేదని బిఎస్పీ జిల్లా అధ్యక్షులు బుర్ర ఉపేంద్ర సాహు విమర్శించారు. ఖమ్మం జిల్లా, బోనకల్ గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి అరవింద్, మరో 7 గురు విద్యార్థులను ఉపాధ్యాయులు పాఠశాల ఆవరణలో ఉన్నటువంటి ఒక పాత ఇంటిలో విరిగి పడివున్న ఇటుకలు తీయించే పని చేయిస్తున్న క్రమంలో ఒక్కసారిగా గోడ విరిగిపడి అక్కడ పనిచేస్తున్న అరవింద్ పై పడడంతో ముఖం లోపలి ఎముకలు విరగడంతో పాటు, కుడి కాలు కూడా 2 చోట్ల విరిగి తీవ్ర గాయాల పాలయ్యాడని అన్నారు. బాలుడిని స్థానిక కిమ్స్ హాస్పిటల్ నందు అడ్మిట్ చేశారన్నారు.
విషయం తెలుసుకున్న బిఎస్పి టీమ్ గురువారం హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న బాలుడిని కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడం జరిగిందన్నారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు వారి కుటుంబ సభ్యులకు బిఎస్పి అండగా ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఉపేంద్ర సాహు మాట్లాడుతూ జిల్లాలో నవోదయ ఘటన మరువక ముందే మరో ఘటన జరిగడం అధికారుల నిర్లక్ష్యమేనన్నారు. విద్యావ్యవస్థకు ప్రభుత్వం సక్రమంగా నిధులు కేటాయించకపోవడం, ప్రమాదకర పనులను విద్యార్థులతో బలవంతంగా చేయించడం వల్లనే ఈ సంఘటనలు పునరావృతం అవుతున్నాయని విమర్శించారు.
ముఖ్యమంత్రికి మద్యం దుకాణాల మీద ఉన్న శ్రద్ద, భూములు అమ్ముకోవడంలో ఉన్న శ్రద్ద, విద్యాలయాల నిర్వహణమీద లేదని దుయ్యబట్టారు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా లక్షల కోట్ల బడ్జెట్ అని ఊదరగొట్టే ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యారంగానికి ఎందుకు నిధులు కేటాయింపులు జరపడంలేదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యా వ్యవస్థ మీద దృష్టి పెట్టకపోతే బహుజన్ సమాజ్ పార్టీ తరపున పోరాటం చేస్తామన్నారు. విద్యార్థుల చేత ఇటువంటి పనులు చేయిస్తున్న ఉపాధ్యాయులపైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మిరియాల నాగరాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం. సుభాష్ చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు.