Tuesday, October 3, 2023
Homeమై వాయిస్కేసీయార్ డైరెక్షన్ - మోడీ యాక్షన్

కేసీయార్ డైరెక్షన్ – మోడీ యాక్షన్

కేసీయార్ డైరెక్షన్ – మోడీ యాక్షన్

– కాంగ్రెస్ ముక్తభారత్ కే బిజెపి మొగ్గు
– కవిత కోసం బలైన బండి సంజయ్
– తెలంగాణలో బిజెపి ఖేల్ ఖతమేనా?!

(పల్లా కొండలరావు, ఖమ్మం)

తెలంగాణలో బిజెపి ఖేల్ ఖతమేనా?! ఔననే అంటున్నారు విశ్లేషకులు. కేసీయార్ డైరెక్షన్ లో మోడీ యాక్షన్ స్టార్ట్ అయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా కవిత కోసం బండి సంజయ్ ని బలిచేశారని బిజెపీతో సహా సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడైనాకనే బిజెపి బలం గణనీయంగా పెరిగింది. బీఆర్ఎస్ ని ఓడించగలిగేది బిజెపినే అన్నంతగా ఊపు వచ్చింది. దుబ్బాక, హుజూరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ ల ఫలితాలతో పాటు తెలంగాణలో ప్రతి ఎన్నికలలోనూ కాంగ్రెస్ కంటే మిన్నగా బిజెపినే ప్రజల మద్దతు పొందింది. మారుమూల ప్రాంతాలకు సైతం బిజెపి వాణిని వినిపించడంలో, ముఖ్యంగా కేసీయార్ ను ఆయన కుటుంబ సభ్యుల అవినీతిని ఎండగట్టడంలో వీరోచితంగా సంజయ్ పోరాడారు. సంజయ్ పనితీరు పట్ల యువత బాగా ఆకర్షితులయ్యారు. బిజెపి అధినాయకత్వం, మోడీ సైతం ఆయన పనితీరుని మెచ్చుకున్నారు.

అయితే నిన్నటి దాకా బండి సంజయ్ ని మార్చేదిలేదంటూ చెప్పుకొచ్చిన అధిష్ఠానం ఒక్కసారిగా తెలంగాణ బిజెపి అధ్యక్షుడిని తొలగించారు. ఆయనపై కొందరు కోపంగా ఉండి చేసిన ఫిర్యాదులే దీనికి కారణమని పైకి చెపుతున్నారు. సంజయ్ ని కొనసాగిస్తే ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి వంటివారు పార్టీ వీడుతారని, అలా జరగకుండా ఉండడం కోసం అందరిని కలుపుకునిపోగలిగే కిషన్ రెడ్డిని అధ్యక్షుడిని చేస్తున్నట్లుగా పైకి చెపుతున్నారు. ఈటల రాజేందర్ ను ఎన్నికల మేనేజింగ్ కమిటి చైర్మన్ ని చేశారు. అసలు కారణం ఇది కాదని కర్నాటకలో బిజెపి ఓడిపోయాక రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ అమాంతంగా పెరగడం, బిజెపిలో చేరతారనుకున్నవారు కాంగ్రెస్ లో చేరడం, సర్వేలు కూడా కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండడంతో బిజెపి అప్రమత్తమైంది. ఇది అదనుగా తీసుకున్న కేసీయార్ సైతం బిజెపితో డీల్ సెట్ చేసుకున్నారంటున్నారు.

లిక్కర్ స్కామ్ లో కవితను అరెస్ట్ చేయకుండా ఉండేలా చూడడం, ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ – బిజెపి కలసి పనిచేసేలా ప్రభుత్వం ఏర్పాటు చేసేలా చూడడం, ఎట్టి పరిస్తితిలోనూ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా చూడడం అనేది కేసీయార్ కేంద్రానికి పంపిన డైరెక్షన్. దీంతో కాంగ్రెస్ ముక్తభారత్ కే కేంద్ర బిజెపి నేతలు కూడా జై కొట్టారు. కేసీయార్ డైరెక్షన్ మేరకు మోడీ యాక్షన్ స్టార్ట్ అయింది. ఇప్పటిదాకా కేసీయార్ ప్రభుత్వంపై అనేక అవినీతి ఆరోపణలు చేయడం, కేసీయార్ ని, కవితను జైలుకు పంపుతామంటూ చెప్పిన బండి సంజయ్ తెలంగాణ బిజెపి అధ్యక్ష స్థానంలో ఉంటే ఈ ఆట సాగదు. సంజయ్ దానికి అంగీకరించడు. అంగీకరించినా ప్రజలు మెచ్చరు. ఎన్నికలదాకా పైపైన కొట్లాడినట్లు కనిపించాలనీ, ఎన్నికల తరువాత కలసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఇప్పటినుండే ఏ సీట్లలో ఎలాంటి లోపాయికారీ ఒప్పందాలు చేసుకోవాలి. కాంగ్రెస్ గెలవకుండా బిజెపి, బీఆర్ఎస్ లు ఎలా లబ్ధి పొందాలన్నది మొత్తం కేసీయార్ చెప్పినమేరకు నడవాలంటే ఆయనకు అనుకూలంగా ఉండే కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా నియమించాలన్నది కేసీయార్ కోరిక అనే ఆరోపణలు వినిపించాయి. ఆ మేరకే బిజెపి అధిష్ఠానం నియామకం జరిపిందంటున్నారు.

ఎంత కాదన్నా, ఏ ఇతర కారణాలు చెప్పినా ఇదే నిజమని రాజకీయ పరిశీలకులు నమ్ముతున్నారు. సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర బిజెపి పగ్గాలు చేపట్టడం కిషన్ రెడ్డికి, కేంద్ర మంత్రి పదవి పొందడం బండి సంజయ్ కు ఇష్టం లేదన్నది బహిరంగ రహస్యం. ఇప్పటిదాకా చేరికల కమిటీ చైర్మన్ గా ఏమీ చేయని ఈటల రాజేందర్ వల్ల హఠాత్తుగా ఏమీ ఒరగదు. ఈటలను బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటిస్తారని అమిత్ షా ఆమేరకు ఈటలకు హామీ ఇచ్చారని వినికిడి. 25 సీట్లు గెలిపించండి. తెలంగాణలో ఎలా అధికారం చేజిక్కించుకోవాలో నేను చూస్తానని అమిత్ షా ఈటలకు నచ్చజెప్పి ఆశలు కల్పించారని అంటున్నారు. ఈ మేరకు ఈటల, కేటీయార్ ల మధ్య రాజీ కుదిర్చాన్నది ఓ వార్త. కేవలం కాంగ్రెస్ ని అధికారంలోకి రాకుండా చేయడానికి కేసీయార్ తో లోపాయికారీ ఒప్పందం చేసుకున్న బిజెపి నేతల ప్లాన్ ఖచ్చితంగా బెడిసికొడుతుందనేది సర్వత్రా వినిపిస్తున్నమాట. ఆర్.ఎస్.ఎస్ కూ, మోడీకి భక్తుడైన బండి సంజయ్ ని తప్పించినా ఇప్పటిదాకా కేసీయార్ కుటుంబంపై బిజెపి చేసిన సవాళ్లను తెలంగాణ ప్రజలు అంత తేలికగా మరచిపోతారని భావించలేం.

ఇప్పటికే తెలంగాణలో బిజెపి పోటీనుండి తప్పుకున్నట్లేననే భావన సర్వత్రా నెలకొంది. ప్రధానపోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే అని తేలిపోయింది. బిజెపి అధిష్ఠానం కూడా చేతులెత్తేయడంతో బిజెపిలో అసంతృప్తిగా ఉన్న నేతలు కూడా కాంగ్రెస్ లోకి చేరే అవకాశం ఉంది. అయితే ఈటలను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా చూపి ఆ వలసలను ఆపాలన్నది బిజెపి తాజా ఎత్తుగడగా ఉంది. దీనిని వారు నమ్ముతారా అన్నది ప్రశ్నార్ధకమే. కవిత అరెస్ట్ కాకుండా ఉండడం కోసం కేసీయార్ పన్నిన వ్యూహానికి బిజెపి అధిష్ఠానం బండి సంజయ్ ను బలిచేశారన్నది తెలంగాణా రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న ఘాటు విమర్శగా ఉంది. అయితే మోడీ హామీ ఇచ్చారని కవిత అరెస్ట్ అయి తీరుతుందని, ఆమెతో పాటు తండ్రినీ, అన్నను, బావను కూడా తీసుకుని వెళుతుందని కేసు మరింత బలంగా తయారవుతుందంటూ ఎం.పీ ధర్మపురి అరవింద్ తాజాగా వ్యాఖ్యానించడం కొసమెరుపుగా ఉంది. అదే జరిగితే ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ విమర్శల సుడిగుండం నుండి బిజెపి తేరుకోవచ్చేమోగానీ…. బండి సంజయ్ ని అవమానకరంగా తొలగించిందన్న మచ్చ మాత్రం బిజెపిని వెంటాడుతూనే ఉంటుంది. బిజెపి గ్రాఫ్ పడిపోతున్న ప్రతి సందర్భంలో కవిత అరెస్ట్ అవుతుందంటూ బిజెపి నేతలు చెప్పిన డైలాగులు వినీ వినీ విసుగు తెచ్చుకున్న తెలంగాణ ప్రజలు తాజాగా ఎం.పీ అరవింద్ వ్యాఖ్యలనూ అదేకోవలో చూస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments