జనవిజయంతెలంగాణఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పట్టు పెంచుకుంటున్న బిజెపి

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పట్టు పెంచుకుంటున్న బిజెపి

  • ఈటెల, తుల ఉమల రాకతో పెరగనున్న ప్రాధాన్యం
  • బలమైన నేత లేకపోవడం టిఆర్ఎస్ కు మైనన్

కరీంనగర్, జూన్5(జనవిజయం): ఈటెల రాజేందర్ టిఆర్ఎన్ ను వదిలి వెళ్లడంతో ఇప్పుడు ఉమ్మడి కరీనంగర్ జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. ఈటెలతో పాటు తుల ఉమ కూడా పార్టీని వీడారు. అలాగే మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ కూడా గతంలోనే పార్టీని వీడి బిజెపిలో చేరారు. గత ఎన్నికల్లో చొప్పదండి నుంచి పోటీ చేసినా ఓటమి పాలయ్యారు. ఇకపోతే ఈటెల రాజేందర్, తుల ఉమ కూడా త్వరలోనే బిజెపిలో చేరనున్నారు. వీరితో పాటు ఇంకెవరు చేరుతారన్నది చర్చ సాగుతోంది. మొత్తంగా ఉద్యమ పార్టీలో చోటు లేకపోవడంతో ఒక్కక్కరే పార్టీని వీడి బిజెపిలో చేరుతున్నారు. వివేక్ వెంకటస్వామి ఇప్పటికే బిజెపిలో చేరి ఉన్నారు. రామగుండానికి చెందిన మాజీ ఎమ్మెల్యే నమారపు సత్యానారాయణ కూడా బిజెపిలోనే ఉన్నారు. దీంతో ఉద్యమనేతలంతా మెల్లగా బిజెపిలో చేరుతున్నారు. దీంతో ఉద్యమాలగడ్డ కరీంనగర్ లో బిజెపి మరింత బలపడే అవకాశాలు పెరిగాయి. ఈ జిల్లాకు చెందిన కరీంనగర్ ఎంపి బండి సంజయ్ ఇప్పుడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. మొత్తంగా జిల్లాలో ఇప్పుడు ఉద్యమపార్టీ అంటే బిజెపి అన్నవిధంగా రూపుదిద్దుకోబోతున్నది. జిల్లాలో గంగుల కమలాకర్ లాంటి వారు తప్ప మిగా వారి ప్రభావం తక్కువనే చెప్పాలి. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర నమితిలో ఈటల రాజేందర్ 20 ఏళ్ల ప్రస్థానం ముగిసింది. 36 రోజుల వ్యవధిలోనే ఆయన మంత్రి నుంచి మాజీ శాసనసభ్యుడిగా మారేంతవరకు పరిణామాలు చకచకా సాగిపోయాయి.

తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించిన తర్వాత ఏడాదికి ఆ పార్టీలో చేరి ఉద్యమస్ఫూర్తిని ప్రదర్శిస్తూ పార్టీ అధినేత కేసీఆర్ కు నమ్మిన బంటుగా ఎదిగారు. హైదరాబాద్, గజ్వేల్ ప్రాంతాల్లో ఉద్యమాల్లో పనిచేస్తున్న ఆయనను స్వంత నియోజకవర్గమైన కమలాపూర్‌కు వెళ్ళి పార్టీ బాధ్యతలను చేపట్టాల్సిందిగా కేసీఆర్ ఆదేశించారు. ఆ మేరకు తన సొంత నియోజకవర్గమైన కమలాపూర్‌కు వచ్చిన ఈటల రాజేందర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా 2004లో అక్కడి నుంచి పోటీచేసి మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డిని ఓడించి జిల్లాలోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారారు. ఆ తర్వాత ఉద్యమ అవసరాల కోసం 2008లో రాజీనామాచేసి ఉప ఎన్నికల్లో పోటీచేసి మరోసారి ఎమ్మెల్యేగా విజయాన్ని సాధించారు. ఆ తర్వాత 2009లో శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన జరిగి కమలాపూర్ నియోజకవర్గం రద్దయింది. కొత్తగా హుజూరాబాద్ కేంద్రంగా నియోజకవర్గం ఏర్పడింది. అప్పటి నుంచి వరుసగా నాలుగు సార్లు హుజురాబాద్ శాసనసభ్యుడిగా గెలుపొందారు. వరుసగా ఆరుసార్లు అసెంబ్లీకి ఎన్నికైన రికార్డును సాధించిన ఈటల రాజేందర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో కేసీఆర్ మంత్రివర్గంలో ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2019లో కేసీఆర్ రెండో మంత్రివర్గంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. తొలి మంత్రివర్గం పదవీకాలం సమయంలోనే కొద్దికొద్దిగా కేసీఆర్ ఈటల మధ్య అభిప్రాయ భేదాలు మొదలయ్యాయి. తనను సంప్రదించకుండానే కొన్ని అంశాల్లో నిర్ణయాలు తీసుకుంటున్నారని ఈటలపై కేసీఆర్, శాసనసభ్యులకు, మంత్రులకు సరైన విలువను ఇవ్వకుండా అవమానిస్తున్నారని ఈటల రాజేందర్ అసంతృప్తిని పెంచుకుంటూ వచ్చారు. ఈ విభేదాలే అగాధంగా మారి రెండోసారి మంత్రివర్గం ఏర్పాటు చేసిన సమయంలో కేసీఆర్ ఈటలకు చెక్ పెట్టాలనే నిర్ణయానికి వచ్చారు. చివరి నిముషం వరకు కూడా ఆయనకు మంత్రి పదవి ఇవ్వడానికి కేసీఆర్ సుముఖత వ్యక్తం చేయలేదు. కేటీఆర్ జోక్యం చేసుకొని ఈటలకు లైన్ క్లియర్ చేశారని అప్పట్లో పార్టీ వర్గాలు చర్చించుకున్నాయి. ఆర్థికశాఖనుంచి తప్పించి వైద్య ఆరోగ్యశాఖను అప్పగించడం, మంత్రి పదవి ఇవ్వడం లేదంటూ ప్రచారం చేసి చివరి నిమిషంలో అప్పగించడంతో ఈటల రాజేందర్ చిన్నబుచ్చుకున్నారు.

తర్వాత జిల్లాకే చెందిన గంగుల కమలాకర్ కు బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖలను అప్పగించి, జిల్లా ఇన్ చార్జి మంత్రిగా నియమించారు. బీసీ నాయకుడిగా ఎదుగుతున్న ఈటలకు చెక్ పెట్టేందుకే గంగులకు ఆ శాఖను అప్పగించడంతోపాటు జిల్లా ఇన్ చార్జి మంత్రిగా నియమించి రాజకీయంగా ఈటల ప్రాధాన్యాన్ని తగ్గించారు. ఈ పరిణామాలన్నిటిని ఈటల మౌనంగా భరిస్తూ వచ్చి అసంతృప్తిని పెంచుకున్నారు. పలు సందర్భాల్లో తీవ్ర భావోద్వేగానికి లోనై మాట్లాడడమే కాకుండా అధిష్టానాన్ని ప్రశ్నించే విధంగా, ఇరకాటంలో పెట్టే విధంగా మాట్లాడారు. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయంగా కొంత ఇరకాట పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చింది. అసంతృప్తితో ఉన్న ఈటల కుట్ర పన్నుతున్నారన్న అభిప్రాయానికి వచ్చిన కేసీఆర్ ఆయనపై నిఘా పెట్టి ఉంచారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన సమయంలో గన్‌మెన్లకు కూడా తెలియకుండా ఈటల ఒంటరిగా బయటకి వెళ్ళి వచ్చారని, ఆయన ఎవరిని కలిశారు, ఎందుకు వెళ్లారు అన్నది మరింత అనుమానాలకు తావిచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా శక్తులను ఈటల ప్రోత్సహించారని, బీజేపీ నేతలను కలిశారని ప్రచారం జరిగింది.దుబ్బాక, జీహెచ్ఎంసీ, సాగర్, మున్సిపల్ ఎన్నికలు జరగడంతో ఈటలపై వేటు వేసే షక్రియను కేసీఆర్ వాయిదా వేసుకుంటూ వచ్చారని సమాచారం. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన మరుక్షణమే ఈటలపై వేటువేయాలని కేసీఆర్ భావించడంతోనే పరిణామాలు చకచకా జరిగాయని అంటున్నారు. మున్సిపల్ ఎన్నికల ఘట్టం ముగియగానే టీఆర్ఎస్ అనుకూల ఛానళ్లలో ఈటల భూకబ్దాల వార్తలు ప్రసారం కావడం, ఆ వెంటనే మంత్రిత్వశాఖను తప్పించడం, మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడం చకచకా జరిగిపోయాయి. మొత్తంగా ఇప్పుడు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో బిజెపి పట్టుకు రంగం సిద్ధం అయ్యిందనే చెప్పాలి. ఇంతకాలం ఈటెలతో పాటు తుల ఉమలాంటి వారు ఉన్నారు. ఇకముందు టిఆర్ఎస్ కు అంత బలం ఉండకపోవచ్చని జిల్లాలో అప్పుడే ప్రచారం మొదలయ్యింది.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి