కాళ్లబేరం సరే! తుమ్మల కరుణిస్తారా?!

0
1012
Share this:

 

దుబ్బాకలో దెబ్బ ఖమ్మంలో అబ్బా అనిపించింది. మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు తిరిగి టీ.ఆర్.ఎస్ లో కీలకంగా వ్యవహనించనున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటిదాకా తుమ్మలను అణగదొక్కడానికి ప్రయత్నించిన ప్రస్తుత మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్వయంగా తుమ్మల ఇంటికి వెళ్ళి కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకోవడం జిల్లావాసులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. అనూహ్యంగా ఆకస్మికంగా జరిగిన ఈ పరిణామం గురించి రాజకీయ వర్గాలలో ఊహాగానాలకు తెరలేపింది. ఇదంతా కే.సీ.ఆర్ డైరెక్షన్లో ఆయన చెప్పిన మాట ప్రకారమే జరిగిందని తెలుస్తోంది.

నిజంగా సంస్కారం కోసం చిన్నవాడైన అజయ్ తుమ్మల ఆశీర్వచనం తీసుకున్నారా?…… నిజం అనుకోవడానికి ఇటీవల సోషల్ మీడియా సాక్షిగా తుమ్మలపై అజయ్ వర్గం చేసిన ఆరోపణలు అడ్డం వస్తున్నాయి. తుమ్మలకు కే.సీ.ఆర్ స్వయంగా ఫోన్ చేసి ఈ విషయం చెప్పారని, అజయ్ కు కూడా ఎలా వ్యవహరించాలన్నది వివరించారని తెలుస్తోంది.

నిజానికి తుమ్మలకు కాళ్లు మొక్కాల్సిన అవసరం పువ్వాడకు ఎంత మాత్రమూ లేదు. తుమ్మల టీ.డీ.పీలో ఉన్నపుడు ఖమ్మంలో స్వయంగా ఆయనను పువ్వాడ అజయ్ ఓడించారు. అప్పుడు అజయ్ కాంగ్రెస్ లో ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశంలో కీలక నేతగా అన్ని విధాలుగా బలమైన ప్రత్యర్ధిగా ఉన్న నామా నాగేశ్వరరావుపై పువ్వాడ అజయ్ తిరిగి ఖమ్మం అసెంబ్లీ స్థానంలో గెలిచారు. ఈ ఎన్నికలలో అజయ్ అధికార పార్టీ అభ్యర్ధి అయినా ఖమ్మం జిల్లాలో ఐదు నియోజక వర్గాలలో టీ.ఆర్.ఎస్ తరపున ఆయన ఒక్కరే గెలిచారు. అది కూడా బలమైన నేత నామా నాగేశ్వరరావుపై గెలవడం ఆయనకు ఖమ్మం నియోజకవర్గంపై ఉన్న పట్టు ఏంటన్నది చెపుతోంది.

ఖమ్మం నగరంలో పువ్వాడకు తనకంటూ గట్టి అనుచరగణం ఉన్నది. ఏ పార్టీలో ఉన్నా ఖమ్మం నియోజకవర్గం వరకు పువ్వాడదే పైచేయిగా ఉంటోంది. పాలేరులో మంత్రిగా ఉన్న తుమ్మల ఓటమి పాలవడం, జిల్లాలో టీ.ఆర్.ఎస్ ఖమ్మంలో మాత్రమే గెలుపొందడంతో కాస్త ఆలస్యంగానైనా పువ్వాడకు మంత్రిపదవి వరించింది. పువ్వాడ కే.టీ.ఆర్ కు సన్నిహితుడు కావడంతో ఆయనకు కలసి వచ్చింది. తుమ్మల మంత్రిగా ఉన్నపుడు కూడా ఖమ్మం నియోజకవర్గంలో మాత్రం మంత్రి జోక్యం లేకుండా తన పనులు కొనసాగించగలిగారు.

టీ.డీ.పీలో ఉన్నపుడు ప్రస్తుత మంత్రి పువ్వాడ చేతిలో ఓడిన తుమ్మలను కే.సీ.ఆర్ మంత్రిని చేయడం, జిల్లాలో టీ.ఆర్.ఎస్ బలం పెంచుకోవడం, ఆనక జరిగిన పరిణామాలలో ఖమ్మం ఎం.ఎల్.ఏ పువ్వాడ, ఎం.పీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు టీ.ఆర్.ఎస్ తీర్ధం పుచ్చుకోక తప్పలేదు. అయితే తుమ్మలకు ముఖ్యమంత్రి కే.సీ.ఆర్ అధిక ప్రాధాన్యం ఇచ్చారు. తుమ్మల కూడా రెట్టింపు ఉత్సాహంతో అభివృద్ధి పనులు వేగవంతం చేసారు.

కానీ వర్గపోరు కారణంగా పాలేరులో ఓడిన తుమ్మల మంత్రి కాలేకపోవడం, సిట్టింగ్ ఎం.పీ అయి ఉండి సమర్ధుడిగా పేరుండీ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అనేక నియోజక వర్గాలపై ప్రభావం చూపగలిగిన శ్రీనివాసరెడ్డికి ఖమ్మం ఎం.పీ టికెట్ దక్కకపోవడం…. ఇలా ప్రత్యర్ధులైన తుమ్మల, పొంగులేటిలకు పార్టీలో ప్రాధాన్యం దక్కకపోవడంతో పాటు అధికారిక, అనధికారిక కార్యక్రమాలకు ఆహ్వానం రాకపోవడంతో వీరి భవిష్యత్తుపై ఊహాగానాలు వెలువడుతున్నా పైకి మాత్రం గుంభనంగానే ఇరువురు నేతలు ఉంటున్నారు. మాజీ మంత్రి తుమ్మల బీ.జే.పీలోకి, మాజీ ఎం.పీ శ్రినివాస రెడ్డి కాంగ్రెస్ లోకి వెళతారనే అంచనాలు సాగుతున్నాయి. శీనన్నకు ఏకంగా పీ.సీ.సీ ఇస్తారనే ప్రచారమూ సాగుతోంది.

తాజాగా దుబ్బాక ఫలితం అనంతరం ఇందులో ఏది జరిగినా టీ.ఆర్.ఎస్ కు జరిగే నష్టం ఏమిటో అంచనా వేసిన ముఖ్యమంత్రి కే.సీ.ఆర్ తుమ్మలను తిరిగి క్రియాశీలకం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తుమ్మలకు తిరిగి మంత్రి పదవీ ఇస్తారని వార్తలు వినపడుతున్నాయి. ఖమ్మం కార్పోరేషన్, ఎం.ఎల్.సీ ఎన్నికలు ఉండడం, భా.జా.పా వలసల భయం ఉండడంతో ఖమ్మంలో కఠిన నిర్ణయాలు తప్పనిసరి. తుమ్మల, పొంగులేటిలలో ఒక్కరిని ఎంచుకోవల్సి వస్తే కే.సీ.ఆర్ తుమ్మలవైపే మొగ్గుతారని భావిస్తున్నారు.

ఈ నేపధ్యంలో తుమ్మలకు ముఖ్యమంత్రి నుండి హామీ లభించిందా? ఆయన నిజంగానే ఏక్టివ్ అయి పార్టీ గెలుపుకు సహకరిస్తారా? దీనిని ఓటర్లు ఆదరిస్తారా? అన్నది అనుమానమే. రైతులు, నిరుద్యోగులు, పించన్లు రానివారి నుండి జర్నలిస్టులదాకా ప్రభుత్వం పై వ్యతిరేకతతో ఉన్నారు. తుమ్మల చాలెంజ్ గా తీసుకుని ఖమ్మంలో పార్టీ దెబ్బతినకుండా చేస్తే తిరిగి తుమ్మల ప్రాభవం పెరగడం ఖాయం.

అదే జరిగితే ప్రస్తుత మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, శీనన్నగా పేరు పొందిన మాజీ ఎం.పీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రస్తుత ఖమ్మం ఎం.పీ నామా నాగేశ్వరరావుల వ్యూహం ఏమిటన్నది ప్రశ్నగా మిగిలింది. ఏమి జరిగినా ఎవరి వ్యూహాలు వారికున్న నేపథ్యంలో ఖమ్మం రాజకీయాన్ని హేండిల్ చేయాలంటే ప్రస్తుతానికి జిల్లాలో కే.టీ.ఆర్ జోక్యం తగ్గించి స్వయంగా కే.సీ.ఆరే రంగంలోకి దిగారన్నది నిజం. అందుకే తుమ్మలతో కే.సీ.ఆర్ కాళ్ల బేరం అన్నట్లుగా విశ్లేషకుల అభిప్రాయంగా ఉన్నది. తనకు ప్రాముఖ్యత లేకుండా వాడుకోవాలని చూస్తే తుమ్మల కూడా భా.జా.పాలోకి జంప్ అయ్యే అవకశాలూ ఉన్నాయంటున్నారు. తుమ్మల పార్టీ మారతారనీ భా.జా.పాలోకి వెళుతున్నారన్న ప్రచారాన్ని అయన గానీ అనుచరులు గానీ ఎక్కడా ఖండించకపోవడం ఈ అనుమానానికి కారణంగా చెప్పాలి. నామా నాగేశ్వరారావు, శ్రీనివాసరెడ్డిలను పార్టీ వీడకుండా చూస్తూ…. తుమ్మల, అజయ్ లను సంత్రుప్తి పరచేలా కే.సీ.అర్ ఎలా? ఏమి సర్దుబాట్లు చేస్తారు? ఎవరు టీ.ఆర్.ఎస్ ను వీడతారన్నది జిల్లా ప్రజలు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న అంశం.

పల్లా కొండలరావు,
15-11-2020.

 

 

గమనిక:

  • WhatsApp లో జనవిజయం అప్డేట్స్ పొందేందుకు https://bit.ly/3jqXNLp గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
  • Telegram లో జనవిజయం అప్డేట్స్ పొందేందుకు https://t.me/janavijayam ఛానల్ లో జాయిన్ అవ్వండి.