(సినిమా డెస్క్ , జనవిజయం)
NTR…. ఈ పేరు తెలుగు సినిమా పరిశ్రమలో ఓ ట్రెండ్ సెట్టర్. ఆయనకు ఆయనే సాటి. ఎన్టీయార్ కు భారీ సంతానమే ఉన్నా ఆయన వారసత్వం సినిమా, రాజకీయాలలో ఎవరూ అంతగా కొనసాగించడం లేదనే చెప్పాలి. రాజకీయాలలో చంద్రబాబు తెలుగుదేశం అధినేతగా ఉన్నారు. కూతురు పురంధేశ్వరి బిజెపి ఏపీ అధ్యక్షురాలిగా ఉన్నారు. బాలకృష్ణ కేవలం హిందూపూర్ ఎంఎల్ఏ గా మాత్రమే పనిచేస్తున్నారు. అయితే జూనియర్ ఎన్టీయార్ లో ఎన్టీయార్ లక్షణాలు చాలావరకు ఉన్నట్లుగా ప్రజలు భావిస్తుంటారు. తెలుగుదేశం పార్టీలో జూనియర్ కు స్థానం లేకుండా చేయాలనే కుట్ర జరుగుతుందనే ఆరోపణలున్నాయి.
ఇదిలా ఉండగా తాజాగా పురంధేశ్వరి వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. పురంధేశ్వరి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హరికృష్ణ, బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ లలో ఎవరి యాక్టింగ్ స్టైల్ వారికి ఉందని అయితే నాన్నగారిని కావాలని ఇమిటేట్ చేయకపోయినా కొన్ని సందర్భాల్లో ఆ ఎక్స్ ప్రెషన్లు నందమూరి హీరోలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తాయని పురంధేశ్వరి చెప్పారు.
నాన్నగారి యాక్టింగ్ స్కిల్స్ హరికృష్ణ, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లో కొంతమేరకు కనిపిస్తాయని పురంధేశ్వరి తెలిపారు.కొన్ని సినిమాలలో హరికృష్ణను చూస్తే నాన్నను చూసినట్టు అనిపించేదని పురంధేశ్వరి వెల్లడించారు.శ్రీరామరాజ్యం సినిమాలో రాముడి పాత్రను చూసిన సమయంలో బాలయ్య నాన్నగారిని గుర్తు చేశారన్నారు. చాలా సందర్భాల్లో జూనియర్ ఎన్టీఆర్ ను చూసినా నాన్నగారు గుర్తుకొస్తారని పురంధేశ్వరి పేర్కొన్నారు. పురంధేశ్వరి అభిప్రాయం సరైనదే అయినా రాజకీయంగా ఎన్టీయార్ కుటుంబం చెల్లాచెదురు కావడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.