Tuesday, October 3, 2023
Homeవార్తలుజర్నలిస్టుల జాగాపై జాప్యం ఎందుకు?

జర్నలిస్టుల జాగాపై జాప్యం ఎందుకు?

జర్నలిస్టుల జాగాపై జాప్యం ఎందుకు?

  • ఎన్నికల కోడ్ పడ్డాక ఎర్రి మొహాలు వేద్దామా?
  • దేవుడు వరమిచ్చాడు, పూజారి దరువేంటి?

ఖమ్మం నగరంలో బి ఆర్ ఎస్ ఆవిర్భావ సభ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ జర్నస్టులపై వరాల జల్లు కురిపించిండు. ఆ మేరకు జీఓ పాస్ చేసి, స్థలాన్ని కేటాయించారు. అది చాలదు అంటే ఇంకా ఎక్కువ స్థలాన్ని కేటాయించారు.

అయితే సదరు స్థలం ప్లాట్స్ గా విడగొట్టి, జర్నలిస్టులకు కేటాయించడానికి మాత్రం ఎందుకు జాప్యం జరుగుతుంది అనేది భేతాళ ప్రశ్నగా మిగిలింది. ఇప్పటికే దాదాపు 15 ఏళ్లకు పైగా జర్నలిస్టులు ఇళ్ళ స్థలాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇన్నేళ్ల కోరిక నెరవేరే క్రమంలో కొందరు తెరవెనుక చేస్తున్న మంత్రాంగం మధ్యతరగతి పాత్రికేయుడికి ఆశనిపాతంలా మారింది.

ఇప్పటికే రెండు దఫాలుగా మంజూరైన అక్రిడిటేషన్ లలో చాలా మంది కార్డులు తీసుకున్నారు. కాగా రెండవ జాబితాలో ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కార్డులు పదికి మించి అర్హులు లేరు అన్న డిపిఆర్వో, ఎన్ని కార్డులు ఇష్యూ చేశారో, ఎన్ని చేయబోతున్నారో వారి కంప్యూటర్ కే తెలియాలి. విడవమంటే పాముకు, కరవమంటే కప్పకు కోపాలు. ఈ విషయంలో సీనియర్ పాత్రికేయుల సలహా అవసరమే.

పది, వందకు ఎలా చేరువ అయ్యాయి అనేది చిదంబర రహస్యం. G.O No. 239 కు భయపడి, కడుపు కాల్చుకొని, అటుకులు బుక్కి, అక్రిడిటేషన్ కమిటీ మీటింగ్ ముందు అగమాగమయ్యి, పడిగాపులు బడి, ఎగ్జాం రిజల్ట్ చూసుకున్నట్టు వర్కింగ్ జర్నలిస్టులు ఇబ్బంది పడ్డ సందర్భం మర్చిపోలేనిది. అదే క్రమంలో వేలాది రూపాయలు, డిపాజిట్ ల రూపంలో, యాడ్ పేరుతో యాజమాన్యాలకు ధారబోసిన పరిస్థితి ఈ కార్డు కోసమే. అయితే ఇన్ని చేసి కార్డ్ తీసుకున్న వాళ్లకు, ఇప్పుడు కొత్తగా ఇండిపెండెన్స్ వచ్చిన వాళ్లకు కొత్తగా ఇండిపెండెన్స్ పొందబోయే వాళ్లకు ఒకే న్యాయమా?! అసలు అడ్డగోలుగా కార్డులు నియమ నిబంధనలకు విరుద్ధంగా జారీ చేసి, ఈ వృత్తిని నమ్ముకొని వున్న వ్యక్తుల పొట్ట కొట్టడం సమంజసమేనా?

ఇండిపెండెంట్ పేరుతో జారీ అయిన కార్డులను దృష్టిలో పెట్టుకొని ఇళ్ళ స్థలాలు ఆగుతున్నాయని ఒకరు, లేదు థర్డ్ లిస్టులో కొందరు అనుయాయులకు కార్డులు ఇప్పించుకునే ప్రయత్నం జరుగుతోంది కాబట్టి మోకాలు అడ్డుతున్నారని కొందరు, సొసైటీ ఏర్పాటు చేశాం, పూర్తి రూపం దాల్చలేదు అని కొందరు… రకరకాల పుకార్లే తప్ప ఏది నిజం? అనేది ఎవరికీ అంతుపట్టని పరిస్థితి.

ఒకటి మాత్రం నిజం. ఈరోజు ఇళ్ళ ప్లాట్స్ పంపిణీ జరిగితే రేపు అక్రిడిటేషన్ కు అంత డిమాండ్ వుండదు. ఇప్పించమని తిరుగుడు అవసరం లేదు. ప్లాట్ వచ్చాక ఏ అండ అవసరం లేదు. అందుకే, ఆ ఇళ్ళ ప్లాట్స్ అలా పంచని పంచదార లా చీమల పాలు అవుతుంది.

మిత్రులారా !
ఎన్నికల తేదీ వచ్చింది. కోడ్ కూడా కొక్కురోకో అనడానికి ఎక్కువ రోజులు లేదు. కోడ్ కూసిందా నోళ్ళు వెళ్ళబెట్టుడే. కొత్త ప్రభుత్వం దిగేదాక మన గోడు పట్టించుకోదు. మరో పదేళ్లు కార్డుల కోసం తిరగాల్సిన పరిస్థితి తెచ్చుకోవద్దు.. ఇది కేవలం ఒక మేలుకొలుపు మాత్రమే.

అయితగాని జనార్ధన్
Advocate,
Freelance Journalist, Khammam.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments