జనవిజయంఆంధ్రప్రదేశ్జర్నలిస్టులను ఆదుకోవాలని కోరుతూ జగన్ కు లేఖ రాసిన ఏపీయూడబ్ల్యూజే

జర్నలిస్టులను ఆదుకోవాలని కోరుతూ జగన్ కు లేఖ రాసిన ఏపీయూడబ్ల్యూజే

అమరావతి, మే 16 (జనవిజయం): ‘‘కరోనా మహమ్మారి కరాళనృత్యం చేస్తున్న ప్రస్తుత తరుణంలో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలలాగే జర్నలిస్టులు కూడా రాలిపోతున్నారు. అయితే ఇతర వర్గాల ప్రజలకూ జర్నలిస్టులకూ మధ్య భేదం ఉంది. మిగతా ఫ్రంట్‌లైన్ వారియర్స్‌తో సమానంగా జర్నలిస్టులు కరోనాపై జరిగే పోరులో ప్రాణాలు పణంగా పెడుతున్నారు. వారిలో కొందరు అసువులు బాస్తున్నారు.’’ అని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఐవీ సుబ్బారావు, చందు జనార్ధన్ పేర్కొన్నారు.

ఈ మేరకు, ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు, జాతీయ కార్యవర్గ సభ్యులు డి.సోమసుందర్, నల్లి ధర్మారావు, ఆలపాటి సురేష్‌కుమార్‌తో కలిసి ఏపీయూడబ్ల్యూజే నేతలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఓ లేఖ రాశారు. కరోనావైరస్ కష్టాల నేపథ్యంలో జర్నలిస్టులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆ లేఖలో కోరారు. ‘‘కనీవినీ ఎరుగని రీతిలో విరుచుకుపడిన కరోనా మహమ్మారిపై మానవాళి సాగిస్తున్న యుద్ధంలో మీడియా పాత్ర ఎంత కీలకమైనదో ప్రత్యేకించి వివరించనక్కర లేదు; స్వయంగా మీ కుటుంబమే ఒక మీడియా
సంస్థను నిర్వహిస్తున్నది. మీడియా పాత్ర కీలకమైనది కాబట్టే పాత్రికేయులను ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తించాల్సిందిగా భారత ప్రెస్ కౌన్సిల్ (పీసీఐ) ఇటీవల సూచించింది. తదనుగుణంగా కేంద్ర ప్రభుత్వం జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తించిన విషయం మీ దృష్టికి వచ్చిందని నమ్ముతున్నాం. ఉత్తరాఖండ్, పంజాబ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, బిహార్, ఒడిశా సహా దేశంలో పలు రాష్ట్రాలు కూడా పాత్రికేయులను ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తించాయి. గత ఏడాది ప్రారంభం నుంచి ఏపీయూడబ్ల్యూజే పాత్రికేయులను ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తించాలని కోరుతూ పలుమార్లు విన్నవించినప్పటికీ మీకు దయ లేకపోయింది.’’ అని పేర్కొన్నారు.

‘‘కరోనా కారణంగా మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల సహాయం అందించనున్నట్లు ఆరు నెలల క్రితం ప్రభుత్వం ప్రకటించడంతో పాత్రికేయలోకం కొంతవరకూ సంతోషించింది. ఆ సహాయం కూడా ఇంతవరకూ ఒక్క కుటుంబానికి కూడా అందకపోవడం శోచనీయం. త్వరగా వారికి ఆ సహాయం అందేట్లు చూసేందుకు అధికారవర్గాల వద్ద ఏపీయూడబ్ల్యూజే చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 2019లో మీరు ఆంధ్రప్రదేశ్ పాలనా పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచీ సంక్షేమం ప్రధాన ధ్యేయంగా సమాజంలోని అన్ని వర్గాలకూ వివిధ రకాల సహాయం అందిస్తున్నారు. ఆ సంక్షేమం అందుకునే అర్హత పాత్రికేయవర్గానికి లేదని మీ ప్రభుత్వం భావించడానికి కారణం ఏమిటో మాకు తెలియదు. కారణం ఏదైనా గానీ ఏ విధమైన సంక్షేమానికి పాత్రికేయులు నోచుకోకపోవడం అత్యంత దురదృష్టకరం.’’ అని ఆ లేఖలో స్పష్టంచేశారు.

‘‘మాన్య ముఖ్యమంత్రి గారూ, రాష్ట్రంలో పని చేస్తున్న వేలాది మంది గ్రామీణ పాత్రికేయుల్లో అత్యధికులు దిగువ మధ్యతరగతి, పేద వర్గాల వారు. ఎక్కువ మంది వృత్తి మీద ప్రేమతో కష్టనష్టాల కోర్చి కొనసాగుతున్న వారు. ఇలాంటి వారు ఏ కారణంగా కన్ను మూసినా వారి కుటుంబాలు ఎక్కువ సందర్భాలలో దిక్కూ మొక్కూ లేకుండాపోతాయి. పైగా, ఇప్పుడు కరోనా వైరస్ సోకి సంభవిస్తున్న మరణాలు మిగతా ఫ్రంట్ లైన్ వారియర్స్‌లాగా మహమ్మారిపై పోరాటంలో ఆహుతవుతున్న ప్రాణాలు. అయినప్పటికీ మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు రాకపోవడం ఎంతైనా విచారించదగ్గ విషయం. ఎంత సహాయం అందించినా కుటుంబానికి దిక్కయిన వ్యక్తి అదృశ్యమైపోయిన లోటును ఎవరూ పూడ్చలేరు. కనీసం ఆపన్న హస్తం అందించడానికి కూడా ప్రభుత్వానికి మనసు రాకపోవడం శోచనీయం. కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమయిన తర్వాత ఇటీవల జర్నలిస్టులు చాలామంది మరణించారు. కరోనాతో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం ప్రకటించిన నాటికి రాష్ట్రంలో 45 మంది పాత్రికేయులు మృతి చెందారు. ఏపీయూడబ్ల్యూజే అప్పట్లో ప్రభుత్వానికి సదరు జాబితాను సమర్పించింది. ఇప్పుడు ఆ సంఖ్య 109కి పెరిగింది. తాజా జాబితాను కూడా ఈ లేఖతో జత పరుస్తున్నాం. పాత్రికేయులను ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తించాలని ఏపీయూడబ్ల్యూజే మరోసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నది. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే డిమాండ్లను ఇంకోసారి మీ ముందు ఉంచుతున్నాం. పాత్రికేయులను ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తించి కరోనా సోకి మరణించిన జర్నలిస్టులకు 50 లక్షల రూపాయల బీమా వర్తింపజేయాలి. కరోనా సోకిన జర్నలిస్టులకు తాత్కాలిక సహాయంగా 20 వేల రూపాయల వన్ టైమ్ పేమెంట్ ప్రకటించాలి. రాష్ట్రంలోని పాత్రికేయులందరికీ తక్షణ ప్రాధాన్యత ప్రాతిపదికన వాక్సిన్ ఇవ్వాలి.’’ అని యూనియన్ నేతలు విజ్ఞప్తిచేశారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి