ఖమ్మం, జూలై 14(జనవిజయం): గ్రామ స్థాయిలో విభిన్న రంగాల్లో నూతన ఆవిష్కరణలు జరిగివుంటే వాటిని ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమంలో నమోదు చేయించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. శుక్రవారం ఐడిఓసి లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఇంటింటా ఇన్నోవేటర్ కు సంబంధించి పోస్టర్ ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనే సమస్యలను చిట్కాలతో సులువుగా చేయగలిగే ప్రతీది ఆవిష్కరణ నే అని తెలిపారు. ఇలాంటి నూతన ఆవిష్కరణలు వ్యవసాయ రంగంలో గ్రామ స్థాయిలో అనేకం వుంటాయని, అట్టి వాటిని వెలికితీసి వినూత్న ఆవిష్కరణ లకు ప్రోత్సాహం ఇవ్వడమే ఇంటింటా ఇన్నోవేటర్ లక్ష్యమని ఆయన అన్నారు. వివిధ రంగాల్లో చేపట్టిన నూతన ఆవిష్కరణలు ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమంలో పంపించేందుకు వాట్సాప్ నెంబర్ +91 9100678543 కు పంపించాలని ఆయన తెలిపారు. ఆగస్టు 15న పరేడ్ గ్రౌండ్ లో జరిగే వేడుకల్లో ఒక స్టాల్ ఏర్పాటు చేసి, ఇట్టి ఆవిష్కరణలు ప్రదర్శించడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు స్నేహాలత మొగిలి, ఎన్. మధుసూదన్, శిక్షణా సహాయ కలెక్టర్ రాధిక గుప్తా, జిల్లా రెవిన్యూ అధికారిణి ఆర్. శిరీష, కల్లూరు ఆర్డీవో సిహెచ్. సూర్యనారాయణ, ఇడిఎం దుర్గాప్రసాద్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.