- కలెక్టర్ కార్యాలయానికి తరలి వెళ్లిన ముంపు బాధితులు
- న్యాయం చేస్తామని కలెక్టర్ హామీ
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్ట్ 28 (జనవిజయం): చర్ల మండలం గోదావరి పరివాహక ప్రాంత గ్రామాలైన గుంపున గూడెం, కేశవాపురం, కొత్తపల్లి, ఆనంద కాలనీ, లింగాపురం గ్రామాల ప్రజలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తరలి వచ్చారు. గోదావరి వచ్చిన ప్రతి సంవత్సరం అనేక సందర్భాలలో ముంపు బాధితులు అందరికీ ఎత్తైన ప్రదేశాలలో ఇంటి స్థలాలు నిర్మిస్తామని, ప్రభుత్వం, అధికారులు హామీలు ఇచ్చినారు. ఇచ్చిన హామీలను జరపని కారణంగా నేడు కలెక్టర్ కార్యాలయానికి సుమారు 300 మంది తరలి వెళ్ళినారు. ప్రదర్శన నిర్వహించి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్ కు మెమోరాండం ఇచ్చినారు. ఈ సందర్భంగా గత అనేక సంవత్సరాలుగా వరద ముంపు బాధితులకు ఎత్తైన ప్రదేశాలలో ఇళ్ల స్థలాలు ఇస్తామని, ఇల్లు నిర్మిస్తామని ప్రభుత్వం, అధికారులు ఇచ్చిన హామీ అమలు చేయడం లేదని ప్రస్తుతం చర్ల మండల కేంద్రంలో ఉన్న 117 సర్వేనెంబర్ లో గల ప్రభుత్వ భూమిలో పై గ్రామాలకు చెందిన ప్రజలు చిన్నచిన్న తుప్పలు తొలగించి నిర్మించు కున్నామని అట్టి ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించి, సర్వే చేసి వరద ముంపుకు గురవుతున్న వాస్తవ బాధితులకు ప్రతి కుటుంబానికి 5 సెంట్లు చొప్పున ఇంటి స్థలము కేటాయించి, గృహలక్ష్మి పథకం ద్వారా మంజూరు చేయాలని, ఇండ్లు మంజూరు చేయాలని బాధితులు కోరారు. ఈ సందర్భంగా స్పందించిన కలెక్టర్ అధికారులతో సర్వే చేయించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం పొడుపుగంట సమ్మక్క అధ్యక్షతన జరిగిన సభలో వరద ముంపు బాధితుల గ్రామ ప్రజలను ఉద్దేశించి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు మాట్లాడినారు. చర్ల మండల కేంద్రంలో ఇప్పటికే నివాసం ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ స్థలంలో ఉంటున్న పేదలందరికీ ప్రభుత్వం సర్వే చేసి, స్థలాలు కేటాయించాలని గ్రుహాలక్ష్మి పథకం ద్వారా ఇండ్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అనేక సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నటువంటి పేదలకు నిరాశ మిగులుతుందని ఇప్పటికైనా ప్రభుత్వ స్పందించి తగిన న్యాయం చేయాలని కోరారు. పేదలకు న్యాయం జరగకపోతే వారి తరఫున సిపిఎం పోరాడుతుందని తెలిపారు. ఇంటి స్థలాలు లేక వరదలు వచ్చిన ప్రతి సందర్భంలో పేదల ఇబ్బందులకు గురవుతున్నారని ఇందులో ప్రధానంగా గిరిజనులు, దళితులు, బలహీన వర్గాలకు చెందిన పేదలు ఉన్నారని, వారందరికీ న్యాయం చేయాలని వారు కోరారు.
సిపిఎం మండల నాయకులు మచ్చా రామారావు శ్యామల వెంకట్ ఆర్ శ్రీనివాస్ అంటారా పాల్గొన్నారు గ్రామస్తులు పాల్గొన్నారు.