మేము ఇసుకాసురులం !
మాకు ప్రభుత్వ నిబంధనలు వర్తించవ్ !!
పర్యవేక్షణాధికారులపై రాజకీయ ఒత్తిళ్ళు!?
జనవిజయం, 29 మే(ఖమ్మం): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దుమ్ముగూడెం మండలం తూరుపాక గ్రామం లో గిరిజన ఇసుక సొసైటీలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధముగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రేసింగ్ కాంట్రాక్టర్లు తెగబడి ఇసుక అక్రమాలకు పాల్పడుతూ.. గిరిజనులకు ఉపాధి లేకుండా చేస్తున్నారని గిరిజనులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాలలోని గిరిజన ప్రజల జీవనోపాధి కల్పించుట కొరకు ప్రభుత్వం గిరిజనులకు ఇసుక సొసైటీలను మంజూరు చేసింది. ఇసుక రీచ్ ల ద్వారా గోదావరి నుండి ప్రజలు ట్రాక్టర్లు ద్వారా ఇసుకను వడ్డు పైకి డంపింగ్ చేస్తె కలిగే ఉపాధి ద్వారా వచ్చే ఆదాయంతో తమ కుటుంబాలను పోషించు కోవచ్చునని, తమ పిల్లలకు మూడు పూటలా అన్నం పెట్టుకోవచ్చు నని గంపెడు ఆశతో ఎదురు చూస్తుంటే గద్దల్లా.. రేసింగ్ కాంట్రాక్టర్లు రంగంలో దిగి కార్మికులకు ఉపాధి లేకుండా చేస్తూ..ప్రభుత్వ లక్ష్యాలకు తూట్లు పొడుస్తున్నారని గిరిజనులు విమర్శిస్తున్నారు.
టి ఎస్ ఎం డి సి అధికారులు సూచించిన సరిహద్దు ప్రాంతాలలో కాకుండా వాళ్ళ ఇష్టాను సారముగా గోదావరిలో ఎక్కడపడితే అక్కడ భారీ యంత్రాలతో పరిధికి మించిన లోతులో ఇసుకను తోడేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పరిధికి మించిన లోతు లో ఇసుకను తొడటం వలన భూగర్భ జలాలు ఇంకిపోయి తాగునీటికి ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల కోడ్ కి సమయం ఆసన్నం అవడం వలన పర్యవేక్షణ అధికారులపై రాజకీయ ఒత్తిళ్ల పెరిగాయని, అందుకే అధికారులు కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనె విమర్శలు వెళ్ళివెతున్నాయి.ఇకనైనా జిల్లా కలెక్టర్ స్థాయి అధికారులు స్పందించి గిరిజన ఇసుక రీచ్ లలో అక్రమాలకు జరగకుండా చూడాలని, గిరిజన ప్రజలకు జీవనోపాధి కల్పించాలని ప్రభుత్వ లక్ష్యాలను నెరవేరేలా చూడాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.