ఇకనైనా మేలుకోండి..!

0
196
Share this:

మార్చి 21 నుండి ఇప్పటివరకు భారతదేశంలో కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య దాదాపు లక్షమంది. ఎన్నో విపత్కర పరిస్థితులు సామాన్య జనజీవన స్రవంతి అతలాకుతలం చేసిన ఈ మహమ్మారి వైరస్ కన్నా ప్రమాదకరమైన వైరస్ భయాందోళనలు. మానసిక స్థైర్యంతో కరోనాకు ఎదురొడ్డి ప్రాణాలను నిలబెట్టుకున్న వారి సంఖ్య ప్రపంచం మొత్తం మీద భారతదేశంలోనే ఎక్కువ. 135 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో వైరస్ ఎంత విలయతాండవం చేస్తుందో అని భయపడినప్పటికీ, కోలుకున్న వారు దాదాపు 85% గా ఉండటం కొంత ఊరట కలిగిస్తున్నప్పటికీ, ఇలాంటి వైరస్ల పుట్టుకకు అసలైన కారణం మనం ప్రకృతి పట్ల చేసిన విధ్వంసం. నాగరికత పేరుతో ఆకాశాన్ని అంటే సౌధాల నిర్మాణం, వాతావరణాన్ని పర్యావరణాన్ని జలావరణాన్ని సమతుల్యతతో ఉండే ప్రకృతిని తీవ్ర కాలుష్యం తో నింపిన మన స్వార్థం ఇంతటి వైపరీత్యాలకు కారణమైందని నిజాన్ని మనం ఒప్పుకోవాలి.

ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు తమ జీవన విధానంతో ప్రకృతిని ఈ స్థితికి తీసుకువచ్చారు. అందుకే ప్రాణాలను నిలిపే జీవవాయువును విషపూరితం చేసుకుని ఆక్సిజన్ సిలిండర్ లను పెట్టుకొని తిరిగే భయంకరమైన పరిస్థితికి మనం వెళ్ళబోతున్న మేమో అనే తీవ్ర భయం ఏర్పడుతోంది. ప్రకృతి సౌందర్యానికి నిలయమైన అడవులను నరికివేసి మనం మన జీవితాలకు మన పిల్లల భవిష్యత్తుకు తీరని అన్యాయం చేసుకుంటున్నామని తెలుసుకోవాలి. ఏదైనా ఇది అత్యంత అనర్ధదాయకం. మానవాళి తాను సృష్టించిన విలయతాండవానికి  చెల్లించుకుంటున్న భారీమూల్యం తమ ప్రాణాలకు సమానమైన తమవారిని కోల్పోవడం. కనీసం చివరి చూపుకు నోచుకోలేక కర్మకాండలు జరిపించలేక అనాధ శవాలుగా ఖననం చేస్తుంటే నిస్సహాయ స్థితిలో మౌనంగా రోదించడం.

వైరస్ ఎవరో సృష్టించారని, భగవంతుడు భూభారం తగ్గించటానికి ఇటువంటి స్థితిని కల్పించాడని మనం మన తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయటం అవివేకం. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ప్రకృతిని ఇంకెంతో రమణీయంగా తీర్చిదిద్దడానికి ఉపయోగించుకోవాలికానీ ఇలా వ్యక్తిగత సౌఖ్యాల కోసం ఉపయోగించుకుంటే వైపరీత్యాలు మనల్ని నిరంతరం పలకరిస్తూనే ఉంటాయి. ఇప్పటికే మనం భారత జాతిని ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన ప్రణబ్ ముఖర్జీ, జస్వంత్ సింగ్ మరియు కేంద్ర రాష్ట్ర మంత్రులతో పాటుగా తన గానంతో తెలుగు జాతిని ఓలలాడించిన బాలు వంటి దిగ్గజ గాయకున్ని కూడా అనూహ్యంగా కోల్పోయాం. అన్నింటికన్నా మన ఇళ్ళల్లో కుటుంబసభ్యులను, బంధువులను ఈ కరోనా మహమ్మారి చుట్టుముట్టి వారి వారి ఆరోగ్యాలను తీవ్రస్థాయిలో ఇబ్బంది పెడుతున్న పరిస్థితులను చూస్తూనే ఉన్నాం.
దీనంతటికీ కారణం అజాగ్రత్త, నిర్లక్ష్యం.

ప్రభుత్వాలు నిరంతరం అనేక సామాజిక మాధ్యమాల ద్వారా స్వీయ నియంత్రణ, దూరం పాటించటం, తగిన ఆరోగ్య సూత్రాలను పాటించాలని చెబుతున్నప్పటికీ వాటిని పెడచెవిన పెట్టడం వల్ల ఈ దుస్థితి ఏర్పడింది. ఇలాంటి ఒక వాతావరణాన్ని మనం సృష్టించుకుని మనలో మనమే ఒకరిమీద ఒకరు నిందారోపణలు చేసుకోవడం మూర్ఖత్వం. ఎందుకంటే ఈ పరిస్థితికి ప్రతి ఒక్కరు బాధ్యులమే..

ప్రతి ఒక్కరం ప్రకృతి ఆరోగ్యకరంగా ఉండేటట్లు చేయటంలో ఖచ్చితమైన భాగస్వామ్యాన్ని కలిగి ఉండాలి. మొక్కలు నాటడం, అడవుల పెంచటం, సాంప్రదాయ పద్ధతిలో పంటలను పండించడం,మన ఆరోగ్యాన్ని సంరక్షించే ఆహారాన్ని తీసుకోవడం, సరైన వ్యాయామాలను చేస్తూ పరిశుభ్రత పాటించటం వల్ల రేపటి తరానికి ఆహ్లాదకరమైన ప్రపంచాన్ని అందించే బృహత్తర కార్యాచరణకు మనం నడుం బిగించాలి.అప్పుడే ఎటువంటి వైరస్ లనైనా మనం ఎదుర్కోగలం. భారతదేశాన్ని ప్రపంచమంతా అబ్బురంగా చూసే ప్రాంతంగా మార్చుకుందాం… అందరి చేత ప్రశంసలు అందుకుందాం…. ఇకనైనా మేలుకొందాం…

– అట్లూరి వెంకటరమణ,
కవి రచయిత ఖమ్మం
9550776152

గమనిక:

  • WhatsApp లో జనవిజయం అప్డేట్స్ పొందేందుకు https://bit.ly/3jqXNLp గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
  • Telegram లో జనవిజయం అప్డేట్స్ పొందేందుకు https://t.me/janavijayam ఛానల్ లో జాయిన్ అవ్వండి.