… అర్హులందరికీ గృహలక్ష్మి పథకాన్ని వర్తింప చేయాలి
….ఐద్వా జిల్లా కార్యదర్శి మాచర్ల భారతి
వైరా, ఆగష్టు 9 (జనవిజయం) : వైన్స్ షాపుల టెండర్లకు 15 రోజులు గడువు ఇచ్చి గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు గడువు 3 రోజులు ఇవ్వడం సమంజసం కాదని, గృహలక్ష్మి దరఖాస్తు గడువును ఆగస్ట్ 31 దాకా పెంచాలని ఐద్వా జిల్లా కార్యదర్శి మాచర్ల భారతి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఐద్వా వైరా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వైరా మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లి(ఎజి) నందు గృహలక్ష్మి గడువు పెంచాలని, నిబంధనలను మార్చాలని కోరుతూ మహిళలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి మాచర్ల భారతి మాట్లాడుతూ కేవలం మూడు రోజులు గడువు ఇవ్వడం వలన చాలా మంది పేదలు అవకాశాన్ని కోల్పోతారని, దరఖాస్తుకు కావాల్సిన అన్ని సర్టిఫికెట్స్ తీసుకోవడం సాధ్యం కాదని, మహిళ పేరుతో స్థలం ఉండాలనే నిబంధన కూడా సరైనది కాదని అన్నారు. దరఖాస్తు గడువు పెంచాలని, స్థలం ఎవరి పేరుతో వున్న పథకాన్ని వర్తింపజేయాలని, దరఖాస్తుల స స్వీకరణకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు మెరుగు రమణ, వైరా పట్టణ కార్యదర్శి గుడిమెట్ల రజిత, ఉప్పెర్ల రాణి, భత్తుల ప్రమీల, చావా కళావతి, బందెల అమృతమ్మ, తాటి కృష్ణకుమారి, కోటమ్మ, సరస్వతి, లక్ష్మీ, సుజాత, అమరావతి, దుర్గ, సునీత, కోటేశ్వరి, రాంబాయి, అమృత, ధనమ్మ, మంగతాయారు తదితరులు పాల్గొన్నారు.