మద్యం షాపుల నిర్వహణపై పిసా చట్టం ప్రకారం ఆ గ్రామసభ చెల్లదు
: మాజీ ఎంపీపీ గొంది బాలయ్య:
భద్రాచలం, 3 ఆగస్టు (జనవిజయం) : గిరిజన ప్రజల కోసం రూపొందించిన 1996 పిసా చట్టం ప్రకారం బుధవారం నిర్వహించిన గ్రామసభ చెల్లదని ఆదివాసి సీనియర్ నేత భద్రాచలం మాజీ ఎంపీపీ గొంది బాలయ్య అన్నారు.
గురువారం నాడు భద్రాచలంలోని అల్లూరి సీతారామరాజు నగర్ లో జరిగిన ఆదివాసుల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ., పిసా చట్టం ప్రకారం గ్రామసభ నిర్వహణకు ఆదివాసి పెద్దలను ఆహ్వానించాలని, పేపర్లో ప్రకటన ఇవ్వాలని, మైకు ప్రచారం నిర్వహించాలని ఇవి ఏమైనా చేశారా అని ప్రశ్నించారు. అక్రమ పద్ధతుల్లో గ్రామ సభ నిర్వహించిన అధికారులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. భద్రాచలంలో ఎన్ని షాపులు ఉండాలో, అసలు మద్యం దుకాణాలు ఉండాలా వద్దా అనే విషయంలో ఆదివాసులదే తుది తీర్పు అని, దీనికి వ్యతిరేకంగా జరిగే ఏ చర్యలైన అడ్డుకుంటామన్నారు. ఈ విషయమై కలిసి వచ్చే అన్ని ఆదివాసి సంఘాల నేతలతో ఉద్యమాన్ని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో ఆదివాసీ నాయకులు మాజీ జెడ్పిటిసి గుండు శరత్, భద్రాచలం డెవలప్మెంట్ ఫోరం బాధ్యులు వంగలపూడి శివ, సనప ప్రశాంత్, వై. వెంకట్రావు, కనితి రాధా, కే శివ, కే ఎన్ రావు, దేవి తదితరులు పాల్గొన్నారు.