గ్రామపంచాయతీ కార్మికులకు అభినందనలు
- సీపిఐ పట్టణ కార్యదర్శి సునీల్
భద్రాచలం, జూలై 22 (జనవిజయం):
గ్రామపంచాయతీ కార్మికులు సమ్మెలో భాగంగానే ప్రజల పట్ల బాధ్యతతో వ్యవహరించడాన్ని సీపీఐ అభినందించింది. భద్రాద్రి ప్రాంత ప్రజల మీద ప్రేమతో, ప్రస్తుతం ఉన్న వరద విపత్కర పరిస్థితుల రీత్యా కార్మికులు వొక పక్క తమ నిరసనను తెలియజేస్తూనే మరో పక్క విధుల నిర్వహణకు ముందుకు రావడం కార్మికుల గొప్ప మనసుకు నిదర్శనం అని సీపీఐ పట్టణ కార్యదర్శి అకోజు సునీల్ అన్నారు. ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కార్మికులు ఈ నిర్ణయం తీసుకోవడాన్ని తాము స్వాగతిస్తున్నామని సునీల్ అన్నారు. న్యాయమైన డిమాండ్ల కోసం సమ్మె కొనసాగిస్తూనే, నల్ల బ్యాడ్జీలు, నల్ల జెండాలతో ప్రభుత్వానికి సమస్య తెలిసే విధంగా సేవా కార్యక్రమానికి కార్మికులు ముందుకు వచ్చారని ఆయన పేర్కొన్నారు. ముందుకు వచ్చిన పంచాయతీ కార్మిక సిబ్బందికి పట్టణ ప్రజలు సంఘీభావంగా నిలవాలని ఆయన కోరారు. ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సునీల్ డిమాండ్ చేశారు.