గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు కొనసాగిస్తాం
- కెవిపిఎస్ జిల్లా కార్యవర్గ సమావేశం డిమాండ్
ఖమ్మం, జులై 27 (జనవిజయం):
గ్రామపంచాయతీ కార్మికుల వేతనాల పెంపు కోసం వచ్చిన జీవో నెంబర్ 60ని పకడ్బందీగా అమలు చేసి కార్మికులపై పని భారం పెంచే జీవో నెంబర్ 51 మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని కనీస వేతనం ఇవ్వాలని గ్రామపంచాయతీ జేఏసీని చర్చలకు పిలిచి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించి సమ్మెను విరమింపజేయాలని కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షురాలు మాచర్ల భారతి, సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నందిపాటి మనోహర్ లు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గురువారం నాడు కెవిపిఎస్ జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బొట్ల సాగర్ అధ్యక్షతన స్థానిక ఎన్నేస్పి క్యాంప్ లోని సంఘం జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ ఇరవై రోజులుగా కార్మికులను పర్మినెంట్ చేయాలని వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గతంలో అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఎండా వాన చలిలో ఆరుగాలం కష్టపడి పల్లెల్లో ప్రజలకు ప్రత్యక్ష సేవలందిస్తున్న పంచాయతీ కార్మికుల అత్యధికులు దళితులు కావడం వల్లే ప్రభుత్వం వివక్ష పాటిస్తుందన్నారు.
జీవో నెంబర్ 51 ద్వారా మల్టీపర్పస్ విధానాన్ని తీసుకొచ్చి కార్మికులకు పని భారాన్ని పెంచడం సరైంది కాదన్నారు వేతనాలు పెంచమంటే పని భారం పెంచుతారా..అని వారు ప్రశ్నించారు. ప్రమాదవశాత్తు కార్మికులు మరణించిన కూడా కనీస ఎక్స్ గ్రేషియా ప్రభుత్వం ఇవ్వలేకపోవడం సిగ్గుచేటు అన్నారు. కనీస ప్రాథమిక హక్కుగా పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం లేకపోవడం అన్యాయమన్నారు. కరోనా వంటి కష్టకాలాల్లో తమ ప్రాణాల్ని ఫణంగా పెట్టి ప్రజలను ఆదుకున్న పంచాయతీ కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించడం సరైనది కాదన్నారు.
కేంద్ర బిజెపి సర్కార్ కార్మికుల ప్రాథమిక హక్కులను కాలరాసి కార్పొరేట్లకు ఉపయోగపడే నాలుగు లేబర్ కోడ్ లను తెచ్చి కార్మికుల పొట్టలు కొట్టి కార్పొరేట్లకు మేలు చేస్తుందన్నారు 8 గంటల పని విధానాన్ని 12 గంటలకు పెంచిన ఘనత బిజెపి సర్కార్ దేనని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జిపి జేఏసీ ని చర్చలకు ఆహ్వానించి సమస్యలు పరిష్కరించి సమ్మెను విరమింప చేయాలని వారు డిమాండ్ చేశారు. మణిపూర్ హింసకు బాధ్యత వహించి ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే భర్తరఫ్ చేసి, హింసాకాండకు కారకులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో కెవిపిఎస్ జిల్లా నాయకులు పాపిట్ల సత్యనారాయణ, నకరికంటి చిరంజీవి, కుక్కల సైదులు తదితరులు పాల్గొన్నారు