హైదరాబాద్, ఆగష్టు 3 (జనవిజయం): సీఎల్పీ నాయకులు శ్రీ భట్టి విక్రమార్క నేతృత్వంలో రాష్ట్రంలో వరదలు, భారీ వర్షాలతో నష్టపోయిన పరిస్థితులను టిపిసిసి బృందం రాజ్ భవన్ లో గవర్నర్ తమిళ సై సౌందర్య రాజన్ కు వివరించింది. వరద బాధితులకు నష్టపరిహారం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ గవర్నర్ కు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎఐసిసి కార్యదర్శి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, పిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి తదితరులు వినతిపత్రం అందజేశారు.
రాష్ట్రంలో భారీ వర్షాల బీభత్సం వల్ల సృష్టించిన వరదలతో జరిగిన ప్రాణ నష్టం, పంట నష్టం, ఆస్తి నష్టం గురించి సమాచారం సేకరించి గవర్నర్ కి వివరించినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల జరిగిన విపత్తు నుంచి ప్రజలను కాపాడుకోవడానికి ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన చర్యల్లో ప్రభుత్వం విఫలమైంది. ఈ వాస్తవ విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్ళాం. భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అప్రమత్తం చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగాన్ని సమయాత్తం చేయకుండా సమీక్షలు నిర్వహించకుండా నిర్లిప్తంగా ఉన్నందునే ఇంత పెద్ద నష్టం జరిగిందన్నారు. తొమ్మిదిన్నర సంవత్సరాలుగా బిఆర్ఎస్ ప్రభుత్వం మేజర్, మీడియం, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల వార్షిక మెయింటెన్సు కు నిధులు విడుదల చేయకుండా చేసిన నిర్లక్ష్య ఫలితంగానే వరదలు ముంచెత్తి ప్రజలు అల్లాడిపోయారు.
కాలేశ్వరం, సీతారామ ప్రాజెక్టులు నిర్మాణం ఆశాస్త్రీయంగా జరగడం వల్ల అనేక ప్రాంతాలు గిరిజన గూడేలు ముంపునకు గురయ్యాయి. మున్నేరు, కెన్నెరసాని నదులపై నిర్మించిన చెక్ డ్యాములు ఇంజనీరింగ్ అధికారులతో శాస్త్రీయంగా డిజైన్ చేసి నిర్మాణం చేసి ఉంటే నష్టం జరిగి ఉండేది కాదన్నారు. ప్రజల అవసరాల కోసం కాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ అవసరాల కోసం అధికార యంత్రాంగాన్ని వాడటం వల్ల ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సహాయక చర్యలు చేపట్టడంలో యంత్రాంగం వైఫల్యం చెందిందన్నారు. భద్రాచలం నుంచి ఆదిలాబాద్ వరకు ఏజెన్సీ గిరిజన గూడేలు, పరిసర ప్రాంతాలు గోదావరి వరదలతో నీట మునిగే ముప్పు పొంచి ఉందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సీతక్క, పోదేం వీరయ్య, దుద్దిల్ల శ్రీధర్ బాబులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి రెస్క్యూ టీమ్లను పంపించాలని కోరగా సీఎం కేసీఆర్ పెడచెవిన పెట్టారని తెలిపారు.
మహారాష్ట్రకు ప్రత్యేక విమానాలు పంపించి అక్కడి నాయకులను ప్రగతిభవన్ కు పిలిపించుకొని గులాబీ కండువాలు కప్పే దానిపై ఉన్న శ్రద్ధ వరద బాధితులను ఆదుకోవడంలో సీఎం కేసీఆర్ ప్రదర్శించలేదు. మహారాష్ట్రకు విమానాలు పంపించిన సీఎం కేసీఆర్ గోదావరి వరదలతో మునిగిపోయిన ఏజెన్సీ ఏరియాలో గిరిజన ప్రజలను ఆదుకోవడానికి హెలికాప్టర్లు పంపించ లేకపోయారు. రాష్ట్రంలో వరదలతో ప్రజలు అల్లాడిపోతున్న బాధితులను ఏజెన్సీ ప్రాంతాలను సందర్శించకుండా సీఎం కేసీఆర్ మహారాష్ట్ర టూర్ కి వెళ్లడం ఏంటి? రాజకీయాల కోసం వెంపర్లాడుతున్న సీఎం కెసిఆర్ ప్రభుత్వాన్ని ఎంత త్వరగా దించితే ప్రజలకు అంత మంచిదన్నారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కాంగ్రెస్ పార్టీ విజయం
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరినప్పుడు సీఎం కేసీఆర్ వ్యక్తిగతంగా దుర్భషలాడుతూ నీతిమాలిన, పనికిమాలిన, ఆలోచన లేని నాయకులంటూ తప్పు పట్టిన కేసీఆర్ వైఖరిని గుర్తు చేస్తూ… 2023 -24 లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఆ భయంతోనే కేసీఆర్ విలీన నిర్ణయం తీసుకున్నారన్నారు. ఆర్టీసీకి ఆస్తులు కూడా పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం అని కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలో కూడపెట్టిన ఆర్టీసీ ఆస్తులను బిఆర్ఎస్ ప్రభుత్వం కొల్లగొట్టడానికి చూస్తే రోడ్లపైకి వస్తామని హెచ్చరించారు. ఆర్టీసీ ఆస్తుల సంరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఆర్టీసీ ఆస్తులు రాష్ట్ర ప్రజల ఆస్తులు. 1978 సంవత్సరంలో ఇందిరా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సమయంలో ఇంటికో దీపం- ఊరికో బస్సు నినాదంతో ఊరూరికి బస్సు వేయించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని తెలిపారు.