- తెలంగాణలో గిరిజన ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- ప్రపంచ గిరిజన దినోత్సవం సందర్భంగా గిరిజన నేత భూక్యా వీరభద్రం
వైరా, ఆగష్టు 10 (జనవిజయం): గిరిజన హక్కులను కాలరాస్తూ రాజ్యాంగం కల్పించిన హక్కులను, ఏజెన్సీ చట్టాలను రద్దుచేసి, కార్పొరేట్ శక్తులకు ఖనిజ సంపదపై హక్కులు కల్పిస్తూ, గిరిజనుల పైన దాడులు చేయిస్తున్న బిజెపి డబల్ ఇంజన్ ప్రభుత్వం పట్ల తెలంగాణ గిరిజన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం తెలిపారు. ప్రపంచ గిరిజన దినోత్సవం వారోత్సవాలు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేయటం వలన గిరిజన రిజర్వేషన్ నిరుపయోగంగా మారిందని, బిజెపి మరల అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు కూడా రద్దు చేస్తారని తెలిపారు. గిరిజనుల చట్టాలను కాలరాస్తూ ఉన్నత వర్గాల కోసం నూతన అటవీ చట్టాలను పార్లమెంటులో ఆమోదించి గిరిజనులకు రక్షణ లేకుండా చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. 2005 అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయకుండా నీరుగార్చిందని, ఉపాధి హామీ చట్టాన్ని ఎత్తివేసే కుట్ర చేస్తుందని విమర్శించారు. గిరిజన రక్షణ కోసం పోరాడుతున్న కమ్యూనిస్టులను బలపరచాలని, గిరిజన తెగలు ఐక్యంగా హక్కుల కోసం పోరాడాలని సూచించారు. ఆనాటి బిర్సా ముండా, కొమరం భీమ్, సేవాలాల్, ఏకలవ్య నిర్వహించిన పోరాటాలకు ఆదర్శంగా నేడు జరుగుతున్న దేశ్ కు బచావో- బిజెపి హటావో పోరాటంలో గిరిజలందరు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.