– మూడు సార్లు ఎమ్మెల్యేగా భద్రాచలంకు ప్రాతినిధ్యం
– అందరివాడుగా సున్నం రాజయ్య
– ఖమ్మం సిపిఎం జిల్లా ఆఫీస్ లో రాజయ్య 3వ వర్థంతి సభలో నున్నా నాగేశ్వరరావు
ఖమ్మం, ఆగస్ట్ 3 (జనవిజయం) : భద్రాచలం శాసనసభ్యుడుగా మూడు సార్లు పనిచేసి అందరి మన్ననలు పొందిన గిరిజన ఆదివాసీ ముద్దు బిడ్డ, అమరజీవి కామ్రేడ్ సున్నం రాజయ్య అని సిపియం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు కొనియాడారు. గురువారం సుందరయ్య భవన్ లో సున్నం రాజయ్య మూడవ వర్ధంతి సభ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఆర్ ప్రకాష్ అధ్యక్షతన జరిగింది. ముందుగా రాజయ్య చిత్రపటానికి పూలమాల వేసి నున్నా నాగేశ్వరరావు నివాళులు అర్పించారు. తరువాత సభలో ఆయన మాట్లాడుతూ గిరిజన సమస్యల పైన ప్రధానంగా వారు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను శాసనసలో మాట్లాడేవారని అదేవిధంగా వాటి పరిష్కారానికి ఎనలేని కృషి జరిపిన గొప్ప నేత అని తెలిపారు. భద్రాచలం నియోజకవర్గం అభివృద్ధిలో తనదైన ముద్ర వేసుకున్న రాజయ్య చేసిన అభివృద్ధి చిరస్థాయిగా నిలుస్తుందని, మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినప్పటికీ సున్నం రాజయ్య నిరాడంబరంగా, సామాన్య జీవితం గడుపుతూ అందరికీ ఆదర్శంగా నిలిచారని అన్నారు. 1985లో మావోయిస్టులు అప్పటి నాయకులు బండారు చందర్రావును, బత్తుల భీష్మారావును హతమార్చిన సందర్భంలో రాజయ్యపైనా మావోయిస్టులు దాడి చేశారని తెలిపారు. సున్నం రాజయ్య మృతి పార్టీకి తీరనిలోటని ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు తీవ్రలోటని అన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా రాజయ్య అనేక బాధ్యతల్లో పనిచేశారని గుర్తు చేశారు, ప్రజా ఉద్యమాల్లో శాసనసభలో ప్రజా గళం విప్పిన సున్నం రాజయ్య ఆశయాల సాధనకై ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఆయన చూపిన బాటలో నడవాలని ఇదే మనం ఆయనకు నివాళి అన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, ఎం.సుబ్బారావు, జిల్లా నాయకులు వై. శ్రీనివాస్‌రావు, పగడాల నాగేశ్వరరావు, నందిగామ కృష్ణ, యస్.కె.అప్జల్, కళ్యాణం నాగేశ్వరరావు, తుడుం ప్రవీణ్, పుల్లారావు తదితరులు పాల్గొన్నారు