భద్రాద్రి కొత్తగూడెం, జూలై 28(జనవిజయం): వరదల్లో చిక్కుకున్న ప్రజల్ని కాపాడిన గజ ఈతగాళ్లు ను మల్టీ జోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి అభినందించారు. ఆయన శుక్రవారం జిల్లా లోని మారుమూల గుండాల, కోమరారం, ఇల్లందు పోలీస్ స్టేషన్లను ఎస్పీ డా.వినీత్.జి తో కలిసి సందర్శించారు. మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల గురించి స్థానిక పోలీసు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వరద ముంపు ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని ఆయన సూచించారు. అన్ని శాఖల అధికారులతో సమన్వయం పాటిస్తూ వరద ముంపుకు గురైన బాధితులకు సహాయక చర్యలు చేపట్టాలని ఐ జి ఆదేశించారు. ఈ సందర్భం గా గుండాల మండలం ముత్తాపురంలో వరదల్లో చిక్కుకున్న 12 మందిని కాపాడిన 05గురు గజ ఈతగాళ్ల కు ఐజీ నగదు రివార్డులను అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు డిఎస్పి రమణమూర్తి,ఇల్లందు సిఐ కరుణాకర్,గుండాల సిఐ రవీందర్,గుండాల ఎస్సై రాజశేఖర్,కొమరారం ఎస్సై గిరిధర్ రెడ్డి మరియ సిబ్బంది పాల్గొన్నారు.