— తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన గళం చిరస్మరణీయం
— తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జిల్లా ప్రధాన కార్యదర్శి చిర్రా రవి
ఖమ్మం, ఆగస్టు 7(జనవిజయం ): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తొలి, మలి దశ ఉద్యమాల్లో ప్రజా యుద్ధనౌక గద్దర్ వినిపించిన గళం భవిష్యత్తు తరాలకు మార్గదర్శకమని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టీజేఎఫ్) జిల్లా ప్రధాన కార్యదర్శి చిర్రా రవి అన్నారు.
ప్రజా యుద్ధనౌక గద్దర్ మృతి పట్ల టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఖమ్మం ప్రెస్ క్లబ్ లో సంతాపసభ ఏర్పాటుచేసి గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి జర్నలిస్టులు ఘన నివాళులర్పించారు.
ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు అధ్యక్షతన జరిగిన గద్దర్ సంతాప సభలో యూనియన్ జిల్లా నాయకులు చిర్రా రవి మాట్లాడుతూ… ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గద్దర్ ఆడి, పాడి జాతిని మేల్కొల్పి ఉద్యమానికి ఆయు పట్టు అయ్యాడని, రాష్ట్ర సాధన కోసం ఆయన కృషి చిరస్మరణీయమని కొనియాడారు.
గద్దర్ విద్యార్థి దశ నుండి ఆయన రాసిన పాటలు ఆడిన ఆటలు సబ్బండ వర్గాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాయన్నారు. రాజకీయాలకతీతంగా గద్దర్ దేశవ్యాప్త ప్రజాభిమానాన్ని చూరగొన్నాడని అన్నారు. అటువంటి మహానీయుడికి జర్నలిస్టులు ఘన నివాళులు అర్పిస్తున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ విజేత, ఎలక్ట్రానిక్ మీడియా నగర అధ్యక్షులు యలమందల జగదీష్, నగర ప్రధాన కార్యదర్శి అమరవరపు కోటేశ్వరావు, ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కొరకొప్పుల రాంబాబు, కోశాధికారి బిక్కి గోపి, జిల్లా ఉపాధ్యక్షులు టీఎస్ చక్రవర్తి, జిల్లా నాయకులు అడపాల నాగేందర్, రాజేంద్రప్రసాద్, ఎస్కే జానీపాషా, కాపర్తి నరేంద్ర, నాయకులు వల్లూరి సంతోష్, కరీష అశోక్, హుస్సేన్, మోహన్, పానకాలరావు, మందుల ఉపేందర్, సాయి, పులి శ్రీను, ఉపేందర్, వెంకట కృష్ణారావు, ఖాసీం, రోషిరెడ్డి, నరేష్, ఆంతోటి శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, మధు, యాదగిరి, రామచంద్రరావు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.