ఇవిఎంల శిక్షణ, అవగాహన కార్యక్రమాలను పకడ్బందీగా చేపట్టాలి
ఖమ్మం, జూలై 24(జనవిజయం):
ఇవిఎం ల శిక్షణ, అవగాహన కార్యక్రమాలను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. సోమవారం ఐడిఓసి లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి రిటర్నింగ్ అధికారులు, తహసిల్దార్లతో ఇవిఎంల శిక్షణ, అవగాహన, ఫారం-6, 7, 8 ల పరిష్కారం, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధత తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో నియోజకవర్గ కేంద్రాలలో ఇవిఎం లపై శిక్షణ, అవగాహన కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు, అదేవిధంగా నియోజకవర్గానికి రెండు చొప్పున సంచార ప్రదర్శన రధాల ద్వారా అవగాహన చేపడుతున్నట్లు తెలిపారు.
శిక్షణ, అవగాహన కొరకు వినియోగిస్తున్న ఇవిఎం లకు ఎన్నికల ఇవిఎం ప్రోటోకాల్ ఉంటుందని, భద్రత, రవాణా విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అవగాహన కేంద్రాల వద్ద ఆర్మ్ గార్డ్, సంచార రథాలకు ఎస్కార్ట్ ఉండాలన్నారు. అవగాహనకు ఏర్పాటు చేసిన ఈ ఓటింగ్ యంత్రాలలో వివిప్యాట్ స్లిప్పులు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు చేపట్టాలని ఆయన తెలిపారు. సంచార రథాలకు ఎల్ఇడి స్క్రీన్లు ఏర్పాటుచేసినట్లు, వీటి ద్వారా వీడియోల ప్రదర్శన చేసి, ఓటరుగా నమోదు, ఓటింగ్ ప్రక్రియ తదితర అన్ని విషయాలపై అవగాహన కల్పించాలన్నారు.
ఓటరు జాబితాలో నమోదు ఉన్నది లేనిది చూడాలని, లేనిచో వెంటనే ఓటరుగా నమోదుకు చర్యలకై సూచించాలని ఆయన తెలిపారు. కొత్త ఓటరు నమోదు, షిఫ్టింగ్, మరణించిన వారి ఓట్ల తొలగింపు, మార్పులకు సంబంధించి వచ్చిన దరఖాస్తుల విచారణ వేగవంతం చేసి త్వరితగతిన పరిష్కారించాలని ఆయన అన్నారు. అన్ని విధాలుగా పరిశీలనలు చేసి, క్రొత్త పోలింగ్ కేంద్రాల ఆవశ్యకత, పోలింగ్ కేంద్రాల పేరు, ప్రదేశం మార్పులకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటుచేసి, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధత పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, శిక్షణ సహాయ కలెక్టర్ రాధిక గుప్తా, జిల్లా రెవిన్యూ అధికారిణి ఆర్. శిరీష, కలెక్టరేట్ ఏవో అరుణ, ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ రాంబాబు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు.