ఖమ్మం, జూలై 18(జనవిజయం):
ఇవిఎం, ఓటింగ్ యంత్రాలపై ఓటర్లకు అవగాహన కల్పించనున్నట్లు జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. మంగళవారం జిల్లా ప్రజాపరిషత్ ఆవరణలోని ఇవిఎం గోడౌన్ నుండి రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పోలింగ్ సిబ్బందికి శిక్షణా, ఓటర్లలో అవగాహన కు 100 ఇవిఎం లను బయటకు తీసి భద్రపర్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నియోజకవర్గాల్లో ఓటర్లలో ఓటింగ్ ప్రక్రియపై చైతన్యం, ఓటు హక్కు ఎలా వినియోగించాలనే దానిపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గ కేంద్రాల్లో గోడౌన్ గుర్తించి ఇట్టి ఇవిఎం లను భద్రపరుస్తామని ఆయన అన్నారు. ఇవే కాక గ్రామాల్లో ఓటర్లలో అవగాహనకు నియోజకవర్గానికి రెండు చొప్పున జిల్లాకు 10 మొబైల్ డిమాన్స్ట్రేషన్ వాహనాలు రానున్నట్లు, ఇట్టి వాహనాలకు షెడ్యూల్ రూపొందించి అవగాహన కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఇట్టి అవగాహన కార్యక్రమాలు ఈ నెల 20 నుండి ప్రారంభం అవుతాయని కలెక్టర్ తెలిపారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, శిక్షణా సహాయ కలెక్టర్ రాధిక గుప్తా, ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ రాంబాబు, బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి ఎల్. సతీష్ బాబు, బిజెపి పార్టీ ప్రతినిధి జిఎస్ఆర్ఏ. విద్యాసాగర్, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి ఎన్. తిరుమల రావు, ఐఎన్ సి పార్టీ ప్రతినిధి హుస్సేన్, టిడిపి పార్టీ ప్రతినిధి వి. భిక్షపతి, సిపిఐ పార్టీ ప్రతినిధి తాటి వెంకటేశ్వర రావు, సిపిఎం పార్టీ ప్రతినిధి ఆర్. ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.