జనవిజయంఎడిట్ఎడిటర్ వాయిస్ఈటెల కాదు.... అసలు టార్గెట్ హరీష్!

ఈటెల కాదు…. అసలు టార్గెట్ హరీష్!

ప్రస్తుత తెలంగాణ రాజకీయాలు ఈటెల రాజేందర్ చుట్టూ తిరుగుతున్నాయి. అయితే ఇది పైకి కనిపించే, వినిపించే వార్తలలో మాత్రమే. అసలు రాజకీయం వేరుగా ఉంది. కే.సీ.ఆర్ ముందు ధిక్కార స్వరం వినిపిస్తే వారెంతటి వారలయినా సరే రాజకీయాలలో సామాన్యులుగా మారడమో, దాదాపు రాజకీయ సన్యాసం చేయడమో చేయాల్సిందేనని తెలంగాణ ఉద్యమం కాలంనుండి నేటి వరకూ విశ్లేషకులకు కనిపించే చిత్రం. ఈ చిత్రంలో మినహాయింపు కేవలం ప్రస్తుత కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మాత్రమే. అయితే రేవంత్ లక్ష్యానికి ఆయన వెంట ఉన్నవారే తూట్లు పొడుస్తుండడం, ఆయనను జనం కేవలం ఫైటర్ గా చూస్తున్నారే తప్ప లీడర్ గా ఎదగలేకపోవచ్చనేది ఒక అంచనా. అయితే రాజశేఖర రెడ్డిలా తనను తాను మార్చుకుని లీడర్ గా ఎదుగుతారా? కేవలం పైటర్ గా మిగులుతారా? అన్నది కాలం చెప్పాల్సిన సమాధానమే తప్ప ఇప్పటికిపుడు కేసీఆర్ కు సర్వవిధాలా రేవంత్ రెడ్డి ప్రత్యామ్నయం అనేంత సీన్ మాత్రం లేదనే చెప్పాలి. మరి కే.సి.ఆర్ కు రేవంత్ రెడ్డి ప్రత్యామ్నయం కానపుడు అంతకు మించి ప్రజలు నమ్మగలిగే ప్రత్యామ్నయం ఎవరు? అన్నది ప్రశ్న. దీనిని అంచనా వేయడమే ఇపుడు తెలంగాణలో మేధావుల ముందున్న పజిల్.

పార్టీలుగా చూస్తే కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు కే.సీ.ఆర్ కు ప్రత్యామ్నయంగా ఎదిగే అవకాశాలుండాలి. కానీ కనుచూపు మేరలో కాంగ్రెస్ కు ఆ అవకాశాలు కనపడడం లేదు. ఒక వేళ వచ్చినా వాళ్లు చచ్చినా వినియోగించుకునే స్థితిలో లేరు. తెలంగాణ పి.సి.సి చీఫ్ ని తేల్చగలిగితే ఆ పార్టీ కనీసం ప్రత్యామ్నయంగానైనా వాయిస్ వినిపించగలుగుతుంది. ప్రభుత్వంపై తీవ్రంగా వ్యతిరేకత వచ్చి కే.సి.ఆర్ కు ఇక ఎవరూ ప్రత్యామ్నయం లేరన్న గత్యంతరం లేని పరిస్థితిలో ప్రజలు గతిలేక గెలిపిస్తే కాంగ్రెస్ పుంజుకునే అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ఎప్పటికీ బ్రతికుండే పార్టీగానే ప్రజలు చూస్తున్నారన్నది నిజం. ఇప్పటికిపుడు కాంగ్రెస్ కేసీఆర్ కు ప్రత్యామ్నయం కాకున్నా భారతీయ జనతా పార్టీ ఆ స్థానాన్ని బర్తీ చేస్తుందా? అంటే ఔను అని గట్టిగా జవాబు ఇవ్వగలిగే పరిస్థితి కూడా లేదు. దుబ్బాకలో లేచి, గ్రేటర్ లో ఎగసి, నాగార్జున సాగర్ లో మునిగి, మనిసిపోల్స్ లో చతికిల బడ్డ బిజెపి రాష్ట్ర వ్యాపితంగా కేడర్, లీడర్లు ఉన్న పార్టీ కాదు. పక్క పార్టీలలోని నేతలకు గాలం వేసి ఎదగాలనే తాపత్రయంతోనే ఉంది. బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడయ్యాక కొంత ఊపు కనపడ్డా, కేంద్ర నాయకత్వం కే.సీ.ఆర్ తో మెతకవైఖరిని ప్రదర్శించడం మూలాన ప్రజలు బిజెపి ని కూడా తె.రా.సకు నమ్మకమైన ప్రత్యామ్నయంగా చూడడం లేదు. గల్లీలో కుస్తీ… ఢిల్లీలో దోస్తీలాగా ఉంది బిజెపి పరిస్థతి. ఈ విషయంపై రాష్ట్ర బిజెపిలో కూడా భిన్నాభిప్రాయాలున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కాబట్టి పార్టీలుగా కేసీఆర్ కు ప్రత్యామ్నయం ప్రస్తుతానికి లేనట్లే. కాంగ్రెస్, బిజిపెిలు తనకు ప్రత్యామ్నయం అవుతాయనే వెరపు ఆలోచనలు కే.సీ.ఆర్ లో ఇసుమంతైనా కనిపించడం లేదు.

కే.సీ.ఆర్ భయపడేది తన వ్యతిరేక శక్తుల ఐక్యతకు మాత్రమేనని చెప్పాలి. వ్యతిరేక శక్తులను ఐక్యం చేస్తే వారిలో చీలిక తెచ్చి తనకు అవసరమైనవారిని కొనేయగలడు. అందుకే ఆయన పాలనకు ఎంత ప్రాధాన్యతనిస్తారో రాజకీయంగా తనకు నష్టం కలిగించబోతున్నది ఎవరు? అనేది కూడా చూస్కంటుంటారు. ఆ నేపథ్యంలోనే ఈటెల బర్త్ రఫ్ అన్నది తెలిసిందే. అయితే ఈటెల ఏం చేశారు? పార్టీని చీల్చడానికి లేదా తనకు వ్యతిరేకంగా ఏం కార్యక్రమాలు చేశాడో తెలుసుకుని వారిలో భయంతోనో, సర్దుబాటుతోనో కొందరిని తమవైపు తిప్పుకుని ఈటెలను ముందు ఏరిపారేయాలన్నది కే.సీ.ఆర్ ప్లాన్. ఎందుకంటే ఈటెల అనే వ్యక్తి తనకు వ్యతిరేకంగా సింగిల్ గా శక్తి కాగలిగినవాడు కాదని కే.సి.ఆర్ కు తెలుసు. ఇపుడు ఈటెలను దెబ్బకొట్టడానకి ఉపయోగిస్తున్న పావులలో రేపు మొదటిగా దెబ్బకొట్టేేధానికి కూడా ఇదే వ్యూహం అనుసరిస్తారనడం అతిశయోక్తి కాదని తెలిసినా, అదే జరిగి తీరుతుందని తెలిసినా…… ఆ… ఆ పావుని నేను కాదులే అని ప్రతి పావూ భావిస్తుండడమే కే.సి.ఆర్ కు బలంగా మారింది. కే.సి.ఆర్ అలా తన బలంగా మార్చుకోగల దిట్ట కూడా. ఇపుడు సరిగ్గా తెలంగాణలో అదే జరుగబోతోంది.

తన ఆలోచనలు అమలు కాకుండా అడ్డుపడే వారెవరు? వారిలో బలవంతులెవరు? ఆ బలం వారికెలా వచ్చింది? వారిని బలహీన పరచేటపుడు ఇంకెవరూ అతనితో జమకాకుండా చూడడమెలా? అన్న దానిలో కే.సి.ఆర్ వ్యూహాలు అత్యంత భయంకరంగా ఉంటాయి. ఆ భయంలో ఎదుటివాడు మైండ్ దిమ్మ తిరిగి పోద్ది. వాడి మైండ్ బ్లాంక్ అయిపోవడం ఖాయం. కానీ తన శిష్యుడే అయిన రాజేందర్ కాస్త తెలివిగా ప్రవర్తిస్తున్నాడు. తాను భావించినట్లు వెంటనే ఎమోషనల్ అయి ఎం.ఎల్.ఏ పదవికి రాజీనామా చేయడం లేదు. ఎందుకు? ఇలా తన ప్లాన్ అమలులో ఆలస్యం జరుగుతోంది? ఇదే ఇపుడు కే.సి.ఆర్ మెదడులో తొలుస్తున్న ప్రశ్న. కేవలం ఈటెల మాత్రమే ఈ ప్లాన్ లో భాగం కాదు…. ఇంకా కొందరున్నారన్నది కే.సి.ఆర్ కి తెలుసు. ఆయా పథకాల అమలులో ఈ పావులు చేసే తప్పిదాలను ఇంటలిజెన్స్ వ్యవస్థను ఉపయోగించుకోవడం ద్వారా తెలుసుకోవడంలో ఆయన అప్రమత్తంగానే ఉంటారు. దానిలో భాగంగానే తనకు మిగిలిన ప్రమాదంలో అత్యంత శక్తివంతమైన పావు హరీష్ రావు. కేవలం మంత్రిగానో, ట్రబుల్ షూటర్ గానో, పనిమంతుడు గానో కేసీఆర్ హరీష్ రావును లెక్కకట్టి వాడుకోవడం లేదు. తనకు ప్రత్యామ్నయంగా…. తనంత బలంగా జనంలో పేరు తెచ్చుకున్న వ్యక్తి హరీష్ రావు. హరీష్ రావు కూడా అంత సంత్రుప్తిగా లేరన్నది జగమెరిగిన సత్యం. అయితే ఎక్కడా హరీష్ తొందరపడడం లేదు. మంత్రి పదవి ఇవ్వడంలో ఆలన్యం చేసినా తొణకలేదు. కే.టి.ఆర్ ను సి.ఎం చేస్తారని ప్రచారం చేయించి చూసినా బెణకలేదు. ఆఖరుకు కే.టి.ఆర్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ను చేసినా ఎక్కడా తన అసంత్రుప్తిని బయట పడనీయలేదు. పనిలో ఏ మాత్రం స్పీడు తగ్గలేదు. ఒక వేళ నిజంగానే హరీష్ రావు పద్ధతిగా నడచుకుంటూ బయటకు చెపుతున్నట్లుగానే లోపల కూడా మామ పట్ల హుందాగానే వ్యవహరించాల్సి వచ్చి సర్దుకుని పని చేయాలనుకున్నా హరీష్ రావుని మాత్రం ఇక కే.సి.ఆర్ నమ్మే పరిస్థితి లేదు.

అందుకే హూజూరాబాద్ లో ఈటెలను ఓడించే బాధ్యత హరీష్ రావుకే అప్పగించాలని కే.సి.ఆర్ నిర్ణయించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ మేరకు హరీష్ ఏక్షన్ లోకి దిగినట్లుగా కనిపిస్తోంది. ఇది కనిపెట్టిన ఈటెల కూడా హైదరాబాద్ నుండి హుజూరాబాద్ కు మకాం మార్చి ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. కే.సి.ఆర్ ఆశించినట్లుగా ఆయన ఆవేశపడడం లేదు. ఎమోషనల్ గా నిర్ణయాలు తీసుకోవడం లేదు. తొందరపడి రాజీనామా చేయడం వంటి ఆలోచనలు చేయడం లేదు. మొదట్లో కాస్త ఆవేశపడి రాజీనామా చేసి ఇండిపెండెంట్ గానే పోటీ చేసి గెలిచి…. స్వంత పార్టీ పెట్టి కే.సి.ఆర్ కు తన బలం ఏమిటో చూపించాలన్నంత ఆవేశం కొందరికైనా పైకి కనపడినా ఇపుడు ఈటెల వ్యూహం ఏమిటో అంతుచిక్కకుండా పరిణితి చెందిన నేతలా అడుగులు వేస్తున్నారు. దీని వెనుక ఈటెల వ్యూహమేమిటా? అన్నది కే.సి.ఆర్ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. కేవలం ఈటెల ఒక్కడే కాదు…. తన చుట్టూనే ఉంటూ తనకు వ్యతిరేకంగా కొన్ని శక్తులు పని చేస్తున్నాయని కే.సి.ఆర్ అంచనా వేస్తున్నారు.

ఈ శక్తులకు హరీష్ ను తోడు కాకుండా చేయాలన్నది ప్రస్తుతానికి ఆయన ఆలోచనగా ఉన్నది. అందుకే హరీష్ కు పాలనలోనూ, పార్టీలోనూ ప్రాధాన్యత పెంచారు. ఆరోగ్య శాఖకు సంబంధించిన రివ్యూలు, పార్టీకి సంబంధించిన ముఖ్యమైన పనులు, ముఖ్యంగా ఈటెల గ్రూపుతో పార్టీకి ఇబ్బంది రాకుండా చూడాల్సిన బాధ్యతలన్నీ ప్రస్తుతానికి హరీష్ పైనే పెట్టినట్లు తెలుస్తోంది. ఇదంతా హరీష్ రావుపై ప్రేమతో కాదని ప్రస్తుతం కే.సి.ఆర్ భయపడేది పైకి అందరూ చెప్పుకుంటున్నట్లుగా ఈటెల రాజేందర్ గురించి కాదు. ఆయన భయపడుతున్నది హరీష్ రావు గురించే. అందుకే కే.సి.ఆర్ టార్గెట్ హరీష్ రావు పైనే. హరీష్ ని ఎలా బలి చేయాలన్నదే కే.సి.ఆర్ వ్యూహం. మామ చతురత, మనసు, వ్యూహాలు హరీష్ రావుకు కూడా తెలియనివి కావు. మామ అప్పజెప్పిన పనులను చేసుకుంటూనే తను బలి కాకుండా జాగ్రత్తగా హరీష్ రావు తెరవెనుక, తెర ముందు చాలా హుందాగా నడుచుకుంటున్నారు. ఆయన ట్రబుల్ షూటర్ కదా? అంత తేలికగా కే.సి.ఎర్ విషవలయంలో చిక్కుతాడా? హరీష్ ప్లాన్ హరీష్ కు ఉంటుంది కదా?

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
  • పల్లా కొండలరావు, ఎడిటర్. జనవిజయం
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి