మణిపూర్ ఘటనపై ఎర్రబోడులో నిరసన
- ప్రధాని దిష్టి బొమ్మ దహనం
- బీజేపీ మద్దతుతో మతోన్మాదుల దుశ్చర్యలు
- ఆదివాసి గిరిజన సంఘం నేత దుగ్గి కృష్ణ
కారేపల్లి, జూలై23(జనవిజయం):
మణిపూర్ లో ఆదివాసీ గిరిజనులపై జరుగుతున్న ఆకృత్యాలను నిరసిస్తూ కారేపల్లి మండలం ఎర్రబోడులో ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన, ప్రధాని, మణిపూర్ సీఎంల దిష్టి బొమ్మలను దహనం చేశారు. ఈ నిరసన నుద్దేశించి ఆదివాసి గిరిజన సంఘం ప్రధాన కార్యదర్శి దుగ్గి కృష్ణ మాట్లాడుతూ మణిపూర్ లో బీజేపీ దాని అనుబంధ సంస్ధ మతోన్మాద చర్యల మూలంగానే ప్రజల మధ్య విభజన జరిగి తెగల మధ్య దాడులు పెరిగిపోయాయన్నారు.
క్రిస్టియన్ మతం స్వీకరించిన కుకీ తెగలను లక్ష్యంగా చేసుకోని మతోన్మాదులు హెచ్చుమీరారన్నారు. కుకీ తెగ మహిళలపై ఆత్యాచారాలు, వివస్త్రలను చేయటం నిత్య కృత్యంగా మారాయన్నారు. రెండు నెలలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెంచిన కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కుకీలపై దాడులకు పరోక్షంగా మద్దతు ఇచ్చిందన్నారు. ఇటీవల మహిళలను అత్యాచారం చేసి వివస్త్రలను చేసిన ఘటనలు అనేక జరిగాయని స్వయాన మణిపూర్ ముఖ్యమంత్రి చెప్పటం ఆ రాష్ట్ర పరిస్థితిని అర్ధంపడుతుందన్నారు.
ఆదివాసీ మహిళలపై జరుగుతున్న అకృత్యాలను ప్రతి ఒక్కరు నిరసించాలని, దో షులను కఠినంగా శిక్షించాలన్నారు. మణిపూర్ ఘటనలకు బాధ్యత వహిస్తూ ప్రధాని మోడీ, మణిపూర్ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు వజ్జా రామారావు, నాయకులు కుర్సం శ్రీను, మోకాళ్ల కౌసల్య, చరప వీరస్వామి, వజ్జా శేఖర్, కుర్సం బిక్షం, పూనెం బాబు, కుంజా సర్వేష్, భూక్యా, పాప, లాలు తదితరులు పాల్గొన్నారు.