జనవిజయంతెలంగాణఏడేళ్ల పాలన పై కెసిఆర్ ఆత్మవిమర్శ చేసుకోవాలి !

ఏడేళ్ల పాలన పై కెసిఆర్ ఆత్మవిమర్శ చేసుకోవాలి !

తెలంగాణ ఏర్పడి ఏడేళ్లు పూర్తయ్యింది. తెలంగాణ ట్యాగ్ లైన్ నీళ్లు, నిధులు, నియామకాలు ఏ మేరకు నెరవేరాయో ఆత్మపరిశీలన చేసుకునే తరుణమిది. తెలంగాణ వాదులను పక్కన పెడుతూ పోవడం ద్వారా తెలంగాణ ఆకాంక్షలను పక్కన పెడుతూ వచ్చారు. ఉద్యమకారులకు పాలనలో భాగస్వాములను లేకుండా చేశారు. ఉద్యోగరంగంలో గత ఎన్నికల ముందు చెప్పిన ప్రకటనలు తప్ప నిజంగా ఎంతమేరకు యువతను సంతృప్తి పరిచామో అన్నది కెసిఆర్ ఆత్మపరిశీలన చేసుకోవాలి. సిఎంగా కెసిఆర్ ఇప్పుడు అందరివాడు. అందరి ఆశలను తీర్చాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. తెలంగాణ ఏర్పడ్డ ఈ ఏడేళ్లలో ఇంకా అసంతృప్తులతో ముందుకు సాగడం మంచింది కాదు. ప్రగతి సాధనలో ముందుకు సాగాల్సిన తరుణ మిది. సరికొత్త తెలంగాణ ఆవిష్కరణకు శ్రీకారం చుట్టాలి. చరిత్రలో చిరస్థాయిగా నిలిచేలా సరికొత్త ఆలోచనలతో కార్యక్రమాలు సాగాల్సి ఉంది. పెండింగ్ పనులను పూర్తి చేసుకుంటూనే ప్రధానంగా నిరుద్యోగం, ఆరోగ్య రంగాలపై ప్రధాన దృష్టి సారించాల్సి ఉంది. కరోనా కష్టనమయంలో ఆరోగ్య రంగం పూర్తిగా విఫలమయ్యింది. ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ గురించి ఎంత తక్కువ చెబితే అంతమంచిది. ప్రజలను దోచుకునేందుకు అవి ఏర్పడ్డాయా? అన్న అనుమానాలు బలపడ్డాయి. మానవత్వం మరచి శవాలపై డబ్బులు ఏరుకుంటున్నారు. లక్షలకు లక్షలు వసూలు చేసి శవాలను అప్పగించారు. ఇదంతా మీడియాలో కోడై కూస్తున్న ఒక్కటంటే ఒక్క చర్య తీసుకున్న పాపాన పోలేదు. కరోనా వస్తే బ్రతుకుతామన్న గ్యారెంటీ లేకుండా పోయింది. దీనిపై ఎంతటి కఠిన చర్యలకైనా దిగాలి. తెలంగాణ ఉద్యమ నేపథ్యం…. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణలో టిఎన్ ప్రభుత్వ ఏర్పాటు.. జరిగి ఏడేళ్లు పూర్తి కావస్తున్నాయి. ఈ క్రమంలో మననం చేసుకుని ముందుకు సాగాలి. తెలంగాణ కోసం కొట్లాడిన వారిని ఏదో ఒక ముద్ర వేసి బయటకు పంపే కార్యక్రమం కూడా ప్రజల్లో నమ్మకాన్ని లేకుండా చేస్తోంది. ప్రజల ఆకాంక్షలు పక్కకు పోతున్నాయి. సమస్యలను ప్రస్తావిస్తే పక్కదారి పట్టిస్తున్నారు. ప్రచార బాకాలు ఊదుకుని బ్రహ్మాండం అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజలు కెసిఆర్ నే నమ్మారు… ఆయనను చూసే ఓటేశారు… కనుక వారికి సంక్షేమాలు అందాలంటే కొంత త్యాగం చేయక తప్పదు.

అలాగని కెసిఆర్ ఏమి చేయలేదని అంటే తప్పుచేసిన వాళ్లం అవుతాం. నిరంతర కరెంట్ కెసిఆర్ సాధించిన అతిపెద్ద విజయంగా చెప్పుకోవాలి. చెరువుల పునరుద్ధరణ, మిషన్ భగీరథ, ప్రాజెక్టుల నిర్మాణం తదితర అంశాలతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు ముందు కనిపిస్తున్న విజయాలు. అందుకే తెలంగాణ పురోభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న తెరాస ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించి దీవించారు. తెలంగాణ అభివృద్ధి, ఆదాయ ప్రగతి ఎట్టిపరిస్థితులో ఆగిపోకుండా చూడాల్సిన బాధ్యత కూడా కెసిఆర్ పైన ఉంది. సిఎం కెసిఆర్ స్వయంగా ఈ రంగాలపై ప్రకటన చేశారు కనుక నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన, స్వయం ఉపాధి పథకాలు పెద్ద ఎత్తున చేపట్టాలి. మన తెలంగాణలో ఎన్నో వనరులు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే ఇదేమంత పెద్ద కష్టమైన పని కాదు. యువతలో నిరుత్సాహం, బాధ ఉన్నాయని చెప్పిన కెసిఆర్ ఈ వైపు ప్రత్యేక దృష్టి సారిస్తే తప్ప ఈ లక్ష్యం సాధ్యంకాదు. వారికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెంచే ప్రయత్నం చేస్తామని ఇచ్చిన భరోసా మేరకు కృషి జరగాలి. ఉద్యోగ ఖాళీలను వీలైనంత త్వరగా భర్తీ చేస్తామని, అనుమానం పెట్టుకోవద్దన్నారు. ప్రభుత్వేతర రంగాల్లోనూ విరివిగా ఉపాధి లభించేలా టీఎన్ ఐపాస్.. ఐటీలలో ఉన్న అవకాశాలతో ప్రయత్నం చేసారు.

నిజానికి వ్యవసాయానుబంధ రంగాలను విస్తరించి ముందుకు సాగితే మంచి ఫలితాలు సాధించవచ్చు. అందుకు తగిన వనరులు ఉన్నాయి. దీంతో ఉపాధి పెరుగుతుంది. ఇప్పటికే 24 గంటల ఉచిత కరెంట్, రైతుబంధు, రైతు బీమా అమలు చేస్తున్నందున అనుబంధ రంగాలను అభివృద్ధి చేసుకుంటూ పోవాలి. అనుత్పాదక రంగాలకు సంబంధించి కొంత ధైర్యంగా ముందుకు పోవాలి. కిలో రూపాయి బియ్యం ప్రభుత్వ ఖజానాకు గుదిబండగా మారింది. ఇది కొందరి జేబులు నింపే కార్యక్రమంగా సాగుతోంది. మరికొందరికి ఆదాయవనరుగా ఉంది. ఇలాంటి పథకం వల్ల ప్రభుత్వ సొమ్ము వృధా అవుతోంది. దీనిని అరికట్టాల్సి ఉంది. సిఎం కెసిఆర్ ఇలాంటి గుదిబండ పథకాలను పెకిలించాలి. ఎందుకంటే ఇప్పుడు సంక్షేమానికి మరిన్ని నిధులు వెచ్చించాలి. సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ దిశగా ప్రతి వ్యక్తి రికార్డు తయారు చేస్తామన్నారు. ఈఎన్టీ, దంతాలు, అత్యుత్తమమైన ఆరోగ్య పరీక్షలను చేపట్టి ప్రజలందరి రికార్డు తయారు చేస్తామన్నారు.

ఇవన్నీ ముందుకు సాగాలంటే ప్రభుత్వ ఖజానాలో డబ్బులు ఉండాలి. ఈ విషయంలో చర్చ చేసి కిలోబియ్యం పథకాన్ని సరళీకరించాలి. ఏడేళ్లలో తీసుకున్న నిర్ణయాలు… చేసిన పనులు.. చేయబోయే పనులు నూటిగా చెప్పడం ద్వారా సిఎం కెసిఆర్ ప్రజలకు మరింత చేరువ కావాలి. ఇచ్చిన హామీలను ఆచరించి చూపడానికి ప్రయత్నం కావాలి. ప్రజల సహకారంతో అంకితభావంతో పని చేస్తామని చెప్పిన దరిమిలా ఇక ఈ మూడేళ్లు ప్రధాన సమస్యలపైనే పోరాడితే మంచిది. ప్రజలకు ఉచిత పథకాలను కొంతయినా తగ్గించుకోవాలి. తెరాస ప్రభుత్వం ఉన్నంతకాలం రైతుబంధు అమలవుతుందని స్పష్టం చేయడంతో భూమి ఉన్న వారికి మళ్లీ భరోసా నింపారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలనే కాకుండా.. ఇవ్వని హామీలనూ అమలు చేస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందని చెప్పాలి. అయితే మేధావులు, విద్యార్థులు, యువకులు కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఆశించిన ఫలితాలు రాలేదు. ఏడేళ్లుగా అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రజల ఆత్మగౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీసేలా చేశారన్న విమర్శలు ఇప్పుడు పెరిగాయి. అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తూ అధికారాన్ని కుటుంబానికి పరిమితం చేసుకున్నాడని…. కుటుంబ పాలన చేస్తున్నారని…. ఉద్యమకారుల పట్ల నిర్లక్ష్యం చూపుతున్నారని… తెలంగాణ వ్యతిరేకులను అందలమెక్కించారన్న విమర్శలు ఉన్నాయి. వీటిని సమీక్షించుకుని ముందుకు సాగితేనే కెసిఆర్ ప్రతిష్ట మరింత ఇనుమడించగలదు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి