దుబ్బాకతో ఆగుతుందా! గోల్కొండకు పాకుతుందా?

0
318
Share this:

 

దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం తెలంగాణ సమాజం ఉలిక్కిపడేలా చేసింది. టిఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం ఎవరనే అంశంపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. అసంతృప్తితో ఉన్న తెలంగాణ ప్రజలు 2023 అసెంబ్లీ ఎన్నికలలో కేసీఆర్ కు బుద్ధి చెప్పనున్నట్లు గద్దె దింపనున్నట్లు ప్రత్యర్థులు జోస్యం చెప్పడం మొదలుపెట్టారు. తెలంగాణలో ఏదో జరుగుతున్నదనే చర్చ మాత్రం ఊపందుకుంది. ఈ మార్పు దుబ్బాక తో అగుతుందా? గోల్కొండకు పాకుతుందా? అన్నది ఈ ఫలితం ఆదారంగా విశ్లేషణ చేయవచ్చా? ప్రజలు 2023 లో ఎవరికి పట్టం కడతారు అనేదానిపై ఎవరికి అనుకూలమైన వాదన వారు వినిపిస్తున్నారు.

ఓటమిని లోతుగా విశ్లేషించుకుని అభివృద్ధి సంక్షేమ పథకాలతో ముందుకు వెళ్తామని, లోపాలను సవరించుకుంటామని టిఆర్ఎస్ నాయకులు ప్రకటించారు. దుబ్బాక ఓటమి ఓ చేదుగుళిక లాంటిదని పెద్దగా పట్టించుకోనవసరం లేదని ప్రజలు తమ వెంటే ఉన్నారని కేసీఆర్ తెరాస శ్రేణులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. పైకి అలా చెప్పినా నష్టనివారణా చర్యలను వెంటనే చేపట్టారు. ఎం.ఎల్.సీ, జీ.హెచ్.ఎం.సీ ఎన్నికలపై దుబ్బాక ప్రభావం పడకుండా చర్యలు చేపట్టారు. ఓటర్లను ఆకర్షించేలా ప్రకటనలు చేయడం ప్రారంభించారు. వివిధ జిల్లాలలో అసంత్రుప్తులు వలసలు వెళ్లకుండా ముఖ్యంగా భా.జా.పా వలకు చిక్కకుండా వ్యూహాలు పన్నడం వెంటనే ఆచరణలో పెట్టడం చేస్తున్నారు.

దుబ్బాక తో తెలంగాణ లో తమ జైత్రయాత్ర ప్రారంభమైందని 2023లో గోల్కొండ కోట పై కాషాయ జెండా ఎగరటం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. కెసిఆర్ నిరంకుశ పాలనకు ప్రజలు చరమగీతం పాడనున్నారని చెప్పారు. కెసిఆర్ కు బుద్ధిచెప్పే శక్తి భాజపాకు మాత్రమే ఉందని ప్రజలు భావిస్తున్నారన్నారు. వివిధ జిల్లాలలో అధికార టీ.ఆర్.ఎస్ తో పాటు కాంగ్రెస్ నుండి ప్రముఖులను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ప్రారంబించారు. ఖమ్మం, నల్గొండలతో పాటు గ్రేటర్ హైదరాబాద్ లోనూ మంతనాలు ముమ్మరం చేశారు. పార్టీ మారితే రాజకీయంగా కేంద్రం అండతో పాటు, ఆర్ధిక అండదండలందించడంలోనూ గట్టి హామీలనిస్తున్నట్లు తెలుస్తోంది.

భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో అంత సీన్ లేదని దుబ్బాకలో గెలుపును, “లావును చూసి బలుపు” గా అనుకుంటూ బిజెపి నేతలు కలలు కంటున్నారని కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. తమ అభ్యర్థి పై భాజపా తప్పుడు ప్రచారం చేయడం వల్లనే రఘునందన్ రావు గెలిచారన్నది ఆయన వాదన గా ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే టిఆర్ఎస్ లోకి వెళ్తాడు అని రఘునందన్ రావు చేసిన ప్రచారాన్ని దుబ్బాక ఓటర్లు నమ్మడం మూలాన్నే దుబ్బాకలో కాంగ్రెస్ మూడో స్థానానికి వెళ్ళడానికి కారణం అన్నారు. తెలంగాణలో 2023 లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుందని తెలిపారు. కనీసం పీ.సీ.సీ నేతను నిర్ణయించుకోలేని దుస్థితిలో ఆ పార్టీ ఉన్నా గ్రౌండ్ లెవల్ లో కాంగ్రెస్కు బలమైన ఓటు బ్యా౦క్ ఉండడం గమనార్హం. పీ.సీ.సీ నేతగా రేవంత్ రెడ్డిని నియమించాలనే నిర్ణయానికి కాంగ్రెస్ అధిష్టానం వచ్చిందనే వార్తలు వినపడుతున్నాయి. అదే జరిగితే పరిస్థితి మరోలా మారే అవకాశమూ ఉంది. కాంగ్రెస్ , టీ.ఆర్.ఎస్ లలో ఎవరితో జతకట్టాలనే విషయంలో వామపక్షాలు ఆలోచనలో పడగా కోదండరాం వంటి వారు ఏ వైఖరి తీసుకుంటారన్నదీ కీలకమే.

దుబ్బాక ఫలితం తదుపరి పరిణామాల గురించి ఎవరి అంచనాలు వారికున్నా 2023 అసెంబ్లీ ఎన్నికలపై ఇది ప్రభావితం చేస్తుందా? లేదా? అన్నది ఇప్పటికిప్పుడు చెప్పడం తొందరపాటు అవుతుంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో అడ్రస్ లేని బిజెపి దుబ్బాకలో విజయం సాధించడానికి కారణం ఏమిటి? ఈ కొద్ది కాలంలోనే తెరాస ప్రభుత్వంపై ప్రజలలో  అంత అసంతృప్తి పెరిగిందా? ఖచ్చితంగా అవును అని చెప్పే స్థితి లేదు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్న మాట నిజమే అయినా హుజూర్ నగర్ ఉప ఎన్నిక నాటినుండి దుబ్బాక ఎన్నికల నాటికి పరిస్థితులలో రాష్ట్రప్రభుత్వాన్ని కూల్చేయాలన్నంత పెనుమార్పు వచ్చిందని చెప్పలేం. అక్కడ అభ్యర్థుల ఎంపికతో పాటు నిరుద్యోగులు, రైతులు మల్లన్న సాగర్ నిర్వాసితులు వంటి వర్గాల ద్వారా ప్రభుత్వంపై వ్యతిరేకత సూచనలు స్పష్టమయ్యాయి. దీనిని సరిజేస్కోవడాన్కి, అధిగమించడానికి కూడా తె.రా.సకు తగినంత సమయం ఉన్నది. కాంగ్రెస్, బా.జా.పాలు రెండూ బలపడితే అదీ తనకు అనుకూలంగా మార్చుకునే వ్యూహాలేమిటో తెలియని అమాయకుడు కే.సీ.ఆర్ అనుకుంటే అత్యుత్సాహమే అవుతుంది.

దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంతో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ పరిణామాలు వెంట వెంటనే మారిపోతాయని చెప్పలేము. ఒక ఎన్నిక ఫలితం ఆధారంగా మరో ఎన్నికలపై ప్రభావం ఉంటుందని చెప్పటానికి ఆస్కారం లేదు. 2014లో హైదరాబాదులో 5 స్థానాలలో గెలుపొందిన భారతీయ జనతా పార్టీ 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయం పాలైంది. ప్రముఖులైన కిషన్ రెడ్డి, రాజాసింగ్, చింతల రామచంద్ర రావు, కే.లక్ష్మణ్, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ వంటి ప్రముఖ బిజెపి నాయకులు ఓటమి పాలయ్యారు. కేవలం ఒక్కచోట మాత్రమే బిజెపి గెలిచింది. ఆ తర్వాత 2019 ఏప్రిల్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో అనూహ్యంగా సికింద్రాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్లలో బిజెపి…. భువనగిరి, మల్కాజ్గిరి, నల్గొండలలో కాంగ్రెస్ గెలిచింది. అసెంబ్లీలో కొడంగల్ లో ‘ఓడింపబడ్డ’ రేవంత్ రెడ్డి దేశంలోనే పెద్దదైన పార్లమె౦ట్ స్థానం మల్కాజ్గిరిలో ఘనవిజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో హుజూర్ నగర్ లో కాంగ్రెస్ కంచుకోటలో టిఆర్ఎస్ పాగా వేయడం తెలిసిందే. ఇలా మన రాష్ట్రంలోనే కాదు దేశ వ్యాప్తంగా వివిధ ఎన్నికల ఫలితాలు చూసిన ఒక ఎన్నికకు మరో ఎన్నికకూ ముడిపెట్టి చూడటం వాటి ఆధారంగా ఎన్నికల ఫలితాలు అన్ని ఇలాగే ఉంటాయని చెప్పటం సరైనది కాదు.

అయితే దుబ్బాక ఫలితం కొన్ని౦టిని స్పష్టం చేసి౦ది. ఎన్నిక ఏదైనా గెలుపు టీ.ఆర్.ఎస్ దే, వార్ వన్ సైడే, హరీష్ వంటి ట్రబుల్ షూటర్లూ, అదికార బలం, అంగబలం, ఆర్ధిక బలం, ప్రతిపక్షాలు ముఖ్య౦గా కాంగ్రెస్ వంటి వాటిని అతిగా నిస్సిగ్గుగా ఎం.ఎల్.ఎలను అవసరం లేకున్నా కొని బలహీనపరచడం, ముఖ్యమంత్రి ఎవరికీ అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం, అన్నింటా కుటుంబ నేతల జోక్యం….. వంటి ప్రజా వ్యతిరేక పోకడలు గతంలో జరిగినట్లుగా జరగవు….. జరగకూడదని కే.సి.ఆర్ కు ఓసారి జలక్ ఇచ్చి చూపాలని ప్రజలు భావిస్తున్నారని తేలింది. టీ.అర్.ఎస్ లో భయపడుతూ బ్రతుకీడుస్తున్న అసంత్రుప్త నేతలకు కూడా ఇతర పార్టీలలోకి వెళ్లడానికి లేదా పార్టీలోనే వాయిస్ పెంచడానికి ధైర్యం నింపింది. భా.జా.పాతో కేంద్రంలో గతంలో మాదిరిగా లోపాయికారీతనంతో కాకుండా రాష్ట్ర ప్రరయోజనాల  కోసం పోరాడాల్సిన విషయంలో కె.సీ.అర్ కు అనివార్యతను తెచ్చిపెట్టింది. ఇది తెలంగాణ ప్రజలకు మంచి చేస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. భా.జా.పా, కాంగ్రెస్ లకు తెలంగాణాలో 2023 లో అధికారంలోకి రావడానికి అవకాశాలను, ఆశలను పెంచింది.

పల్లా కొండలరావు,
16-11-2020.

గమనిక:

  • WhatsApp లో జనవిజయం అప్డేట్స్ పొందేందుకు https://bit.ly/3jqXNLp గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
  • Telegram లో జనవిజయం అప్డేట్స్ పొందేందుకు https://t.me/janavijayam ఛానల్ లో జాయిన్ అవ్వండి.