జనవిజయంసాహిత్యందృష్టి కోణం - గమ్యం చేర్చే బాణం

దృష్టి కోణం – గమ్యం చేర్చే బాణం

నా ‘మా’ట-2

మ్మంలో పెద్దదైన ఓ సాహితీసంస్థ కవి సమ్మేళనం నిర్వహిస్తోంది. మా కల్చరల్ రిపోర్టర్ హోమ్ క్వారంటైన్లో ఉండడంతో నేను వెళ్లాల్సి వచ్చింది. పనులన్నీ ముగించుకుని కార్యక్రమం వద్దకు వెళ్లాను. కవులంతా సభలో ఆసీనులై ఉన్నారు. కరోనాపై కవి సమ్మేళనం జరుగుతోంది. కవులంతా కవితలు చదివాక విజేతలను వెంటనే ఎంపిక చేసి బహుమతులు ఇవ్వనున్నామని కార్యక్రమ నిర్వాహకులు ప్రకటించారు. అందరూ కవితలు చదువుతున్నారు, జడ్జీలు రాసుకుంటున్నారు. ప్రెస్ గ్యాలరీలో ఉన్న నేను ఆయా కవితల్లోని సారాంశం, వారి పేరు రాసుకుంటున్నాను. నిర్వాహకులు నా పేరు పిలిచారు.

అయ్యో! నేనేమి కవిత రాయలేదే (అప్పుడప్పుడు కవితలు రాస్తాలేండి) ఎలా చదివేది అనుకుంటూ విషయం చెప్పాను. అదేమి లేదండి మీరు తప్పకుండా కవిత చదవాలని మైక్లో ఎనౌన్స్ చేశాడు అధ్యక్షస్థానంలో ఉన్న వ్యక్తి. గతంలో కరోనాపై చాలా పుస్తకాలు వచ్చాయి. ఖమ్మంలోనైతే తోట సుభాషిణి కవితల సంకలనాన్ని వెలవరించారు. మువ్వా శ్రీనివాసరావు కవితా సంపుటిని వేశారు. అలాగే ఎన్నో పత్రికల్లో కవితలు వచ్చాయి. వీటన్నింటనీ చదివిన జ్ఞాపకం ఉంది. సరేలే అనుకుంటూ నోట్ బుక్లో నాలుగైదు లైన్లు రాసుకుని స్టేజీపైకి వెళ్లాను. నేనైతే కవిత రాయలేదు. నాకు తెలిసినవి ఓ నాలుగు వాక్యాలు చెబుతాను. మీరు కవిత అనుకోండి. ఏదైనా అనుకోండి’ అంటూ నేను రాసుకున్నవి చదివాను.

“మేము ఒకప్పుడు
ప్రపంచానికి ఆయువు పోశాం
ఇప్పుడు
ఆయువు దక్కించుకునేందుకు నిత్యం పోరాడుతున్నాం..

వెంటిలేటర్లపై ఉన్నా
మాకు ఇగోనే..
సాయమనేదే తీసుకోం
ప్రాణాలు మాత్రం అర్పిస్తాం..

పాలకా… నీ మాట
మాకు ఊపిరి కన్నా ఎక్కువే… అది ఉన్నా లేకున్నా
నిన్ను గెలిపిస్తూనే వుంటాం..!

చప్పట్లు మారుమోగాయి. నేను జర్నలిస్టుని. వార్తలు రాయించుకోవడం కోసం నాతో అవసరం ఉంటుంది కనుక అందరూ చప్పట్లు కొట్టారా, లేక కవిత చదివారు కాబట్టి మెహమాటానికి చప్పట్లు కొట్టారా అనేది అర్థం కాలేదు. ఇక జడ్జీల వంతు వచ్చింది. అందరూ ఆతృతతో ఫలితం కోసం చూస్తున్నారు. పది నిమిషాల తర్వాత విజేతను ప్రకటించారు.

నేను మొదటి విజేతనని వినబడేసరికి ఆశ్చర్యమేసింది. నాకెందుకు వచ్చిందనేది అర్ధం కాలేదు. నేను రాసింది ఆరు లైన్లే. చాలా మంది ప్రసిద్ధ కవులు పుంఖాను పుంఖాలుగా కవితలు చదివారు. ఆ కవితల్లో అర్ధం లేదని నేననుకోవడం లేదు. మరి నాకెందుకు ఫ్రైజ్ వచ్చిందో అర్ధంగాక అలానే చూస్తుండిపోయాను. అదేదే సినిమాలో ‘వెంకటపతిరాజు సెంచరీ చేసినంత ఆనందంగా ఉందని’ బాలసుబ్రహ్మణ్యం చెప్పిన డైలాగ్ ఆ సమయంలో గుర్తుకొచ్చింది. వేదిక మీద ఉద్ధండ పండితులు ముగ్గురు విజేతల పేర్లు, వారి కవితల సారాంశాన్ని వివరించడానికి సిద్ధమయ్యారు.

సభలో నేనొచ్చినప్పుడు ఎంతమంది ఉన్నారో చివర సమయాన కూడా అంతేమంది ఉన్నారు. సాధారణంగా కవి సమ్మేళనం కార్యక్రమాల్లో కవిత చదివిన వారు వేరే వారి కవితలు వినడానికి ఇష్టపడరు. మధ్యలోనే వెళ్లిపోతుంటారు. చివర వ్యక్తి చదివే సమయానికి నిర్వహకులు, ఓ ఇద్దరు, ముగ్గురు కవులు మాత్రమే ఉంటారు. ఈ సభలో మాత్రం అందరూ ఉండడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. కవితా పఠనం అనంతరం విజేతలను ప్రకటించి బహుమతులు ఇవ్వడమనే కార్యక్రమం ఉంది కాబట్టే కవులంతా హాల్లోనే ఉండడానికి కారణం కావచ్చనిపించింది. మొదటి బహుమతికి ఎంపికైన కవిత గురించి జడ్జి వివరించడం ప్రారంభమైంది.

‘ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్య, కత్తి గుచ్చామా లేదా అన్నది పాయింటు. ఇప్పుడు మొదటి బహుమతి కవితలో ఎన్ని లైన్లు ఉన్నాయనది కాదు. ఆ లైన్లలో భావం ఎంతున్నది ముఖ్యం. వచ్చిన అన్ని కవితల్లో కరోనా అక్కడ పుట్టింది. అన్నింటా వ్యాపించింది. దీనిని పారదోలుతాము అని ఘంటాపథంగా చెప్పారు. అభినందనలు. కరోనా వల్ల మానవ సంబంధాలు దెబ్బతిన్నాయనీ చెప్పారు. అభినందనలు. కానీ పాలక ప్రభుత్వం ఏం చేస్తున్నది. దీని వల్ల కలిగే అనర్థాలేంటి అనేది ఎవ్వరూ రాయలేదు. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకున్న ప్రభుత్వం ఆ ప్రజల కోసం పని చేయాలని రాజ్యాంగంలో రాసుకున్నాం. కరోనా విషయంలో పాలక ప్రభుత్వం చేసిన నిర్వాకాలు, విఫలయత్నాలు, నిర్లక్ష్య ధోరణి మీ కవితల్లో లేదు. ప్రపంచం మొత్తంలో ఒకప్పుడు వైద్యరంగంలో మన దేశం ముందుంది. ఇప్పుడు ఎందుకు వెనుకబడింది అనేది ఆలోచిస్తే పాలకుల వైఫల్యం కనిపిస్తుంది (కరోనా వ్యాక్సిన్ను మనమే ముందుగా కనుగొన్నాములేండి). దీనిని మీరు గమనించలేదు.

తన చుట్టూ జరుగుతున్న వాటిని కవి పరిశీలించాలి. ముఖ్యంగా సామాజిక, రాజకీయ పరిణామాలతో కవులకు సన్నిహిత సంబంధాలు ఉండాలి. అప్పుడే ‘చిత్తం’ అనే కవిత్వం బదులు ‘ప్రశ్నించే’ కవిత్వం వస్తుందంటూ జడ్జి తన ప్రసంగాన్ని ముగించాడు. నేను రాసిన ఆరు లైన్లలో ఇంత అర్ధముందా అన్నట్లు అందరి మొఖాలు ప్రశ్నార్థకంగా ఉండడం గమనించాను. కార్యక్రమం ముగిశాక ఎవరి దారిన వారు వెళ్లిపోయాము.

రెండు రోజుల తర్వాత ఓ మిత్రుడు ఫోన్ చేసి ఓ సందేహాన్ని వెలిబుచ్చాడు. ఆ సందేహం ఇప్పుడున్న కవుల్లో నూటికి 90 మంది దాకా వుంటుందనేది నిరభ్యంతరంగా చెప్పవచ్చు. ఇంతకీ ఆ మిత్రుడు అడిగిన సందేహమంటనేది మీకు తట్టవచ్చు.

కరోనా మహమ్మారిని అంతమొందించడానికి ప్రభుత్వం అన్ని చర్యలూ చేపట్టింది. జనమే ప్రభుత్వ నిబందనలు అనుసరించకుండా రోగాన్ని కొని తెచ్చుకుంటున్నారు. జన ప్రవర్తనలో మార్పు రాకుండా మనం ప్రభుత్వాన్ని బదనాం చేయడం సరికాదు కదా అన్నాడు. ఇదే సందేహం చాలా మందికి ఉంటుంది. వాస్తవమే. కాదనలేము. నేనేదో విజ్ఞుడినని, తన సందేహాన్ని నివృత్తి చేస్తాడనే నమ్మకంతో నన్ను అడిగి వుంటాడనుకుని.. సమాధానమివ్వడానికి ప్రయత్నించాను.

ఓ పండితుడు తన శిష్యుల్ని వెంటపెట్టుకుని రోడ్డు పక్కనే ఉన్న పొలం వద్దకు వెళ్లాడు. అందరూ పొలం పని చేస్తున్నారు. అటుగా రోడ్డుపై వెళ్తున్న వ్యక్తి అక్కడ ఆగి ఆ పండితుడిని అడిగాడు ‘ఈ వూరు మంచిదేనా అని’. అర్ధంకాని పండితుడు ‘మీరెక్కడ నుండి వస్తున్నారని’ ప్రశ్నించాడు. పక్కనే ఉన్న వూరి నుండి వస్తున్నట్లు బాటసారి సమాధానమిచ్చాడు. మీ ఊరు మంచిది కాదా ” అని మళ్లీ పండితుడు అడిగాడు. ‘మా ఊరు మంచిది కాదు. అక్కడ కుట్రలు, కుతంత్రాలు అన్నీ ఉన్నాయ్. మనిషి బతుకుతుంటే ఒర్వరు. ఎవ్వరూ మంచి వారు కాదు’ అని సమాధానమిచ్చాడు బాటసారి. “అవునా..మా ఊరు కూడా మంచిది కాదు. మీ ఊరిలో ఉన్నవన్నీ మా ఊరిలో ఉన్నాయి’ అని పండితుడు చెప్పగానే మరోమారు ఆలోచించకుండా బాటసారి వెనుకకి తిరిగి తన వూరికే వెళ్లిపోయాడు. కొంత సమయం అయ్యాక మరో బాటసారి వచ్చాడు. “పండితుల వారు. మీ ఊరు మంచిదేనా’ అని అడిగాడు. “మీ ఊరు మంచిది కాదా” అని పండితుడు అడిగాడు. ‘చాలా మంచిదండి. అక్కడున్న పనులన్నీ అయిపోయాయి. ఇంకా పనులేమైనా దొరుకుతాయేమోనని వస్తున్నాను. మీ ఊరు మంచిదేనా’ అని అడిగాడు. అందుకు పండితుడు ‘మా ఊరు చాలా మంచిది. మీరు నిరభ్యంతరంగా వెళ్లవచ్చు’ అని సమాధానమిచ్చాడు. సంతోసంగా ఆ బాటసారి ముందుకు సాగాడు. ఇదంతూ చూస్తున్న పండితుడి శిష్యులకి అర్ధంగాక అనుమానంతో దగ్గరకొచ్చారు. ‘గురువుగారూ… మొదటి వ్యక్తి అడిగితే మన ఊరు మంచిది కాదన్నారు. రెండో వ్యక్తి అడిగితే మంచిది అని చెప్పారు. ఎందుకని?.. అంటూ తమ ధర్మసందేహాన్ని నివృత్తి చేసుకోవడం కోసం శిష్యులు అడిగారు. అప్పుడా ఆ పండితుడు ఇలా చెప్పసాగాడు.

మొదటి వ్యక్తి ఆలోచనా తీరు సరిగా లేదు. అందుకే అతను తన వూరిలో వుండ లేక బయటకు వెళ్లాలను కున్నాడు. సొంత వూరిలోనే ఉండలేని వ్యక్తి ఇతర ఊరిలోనూ ఇమడలేడు. అలాంటి వాళ్లు అవసరం లేదు. అందుకే అలా చెప్పాను. ఇక రెండో వ్యక్తి ఆలోచనా విధానం బాగుంది. తన ఊరిలో ఉన్న మంచిని చెప్పాడు. అలాగే ఇతర ఊరిలోనూ మంచి ఉంటుందనే నమ్మకంతోనూ ఉన్నాడు. అందుకే అతనికి అలా చెప్పాను అంటూ పండితుడు ముగించాడు.

కాబట్టి కరోనా అంతమొందించడానికి వ్యక్తిగా మన పనులన్ని మనం చేశాం. అది సరిపోదు. వ్యవస్థగా, పాలిస్తున్న ప్రభుత్వంగా ఇంకా చేయాలి. అది ఎందుకు చేయడం లేదనే ప్రశ్న మనలో కలిగితే పైన పండితుడు చెప్పింది మనకు నచ్చుతుంది. ఏది మంచీ, ఏది చెడూ అనేది మనం చూసే దృక్కోణం బట్టి ఉంటుంది. వాస్తవ దృష్టితో చూడాలి. మనం వాస్తవం అనుకున్న దృష్టితో చూస్తే మన నడక తీరు మారొచ్చు. అదేమీ లేదు. పాలకులు చెప్పినట్లు చప్పట్లు కొట్టాం. దీపాలు వెలిగించాం. కరోనా పుట్టిన ప్రదేశాన్ని జనులకు వివరించాం. వాస్తవాలే చెప్పాం కదా అని అనుకుంటే.. పొరపాటే.

ఆకాశంలో ఎగేరి గాలిపటానికి ఆధారం దారం. దానిని పట్టించుకోకపోతే గాలిపటం తప్పకుండా ఎక్కడో ఓ చోట చిక్కుకుంటుంది. అదే విధంగా కవిత్వం లక్ష్యం మనం నిర్దేశించుకోకపోతే అలక్ష్యమనే అక్షరం దానిని దారి మళ్లిస్తుంది, మరో ప్రస్థానంలో శ్రీశ్రీ ఇలా అంటాడు.

కలవారల కొమ్ముకాసి
పడుచుకునే వృత్తిరోసి
కర్షక కార్మిక జన సం
ఘాతంతో కలియండి
బూర్జువాల రాజ్యాంగపు బూజంతా దులపండి
భూతలాన స్వర్గపు
నిర్మాతులుగా నిలవండి
అందరిదీ ఒక లక్ష్యం
ఒక గమ్యం ఒక ధ్యేయం
అదే మనకు విధేయం..

తోచినది ఏదో నా’మా’టగా చెప్పేశాను. మళ్లీ వచ్చేవారం కలుద్దాం.

  • నామాపురుషోత్తం
    98666 45218
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి