Thursday, October 5, 2023
Homeవార్తలుదొరల పాలనకు స్వస్తి పలకాల్సిందే - టి కాంగ్రెస్ ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి...

దొరల పాలనకు స్వస్తి పలకాల్సిందే – టి కాంగ్రెస్ ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి

భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్ట్ 09 (జనవిజయం): రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో దొరల పాలనకు స్వస్తి చెప్పాల్సిందే అని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటి కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాబోవు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం లో ఏర్పడేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన పేర్కొన్నారు. పొంగులేటి శ్రీనివాస రెడ్డి బుధవారం కొత్తగూడెంలో విస్తృతం గా పర్యటించారు. పలు వార్డుల్లో నిర్మించిన కాంగ్రెస్ దిమ్మెల వద్ద పార్టీ జెండాను ఎగురవేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ దొరల పాలనకు స్వస్తి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు. మరో మూడు నెలలు ప్రజలు ఓపిక పట్టాలని కోరారు. ఎందరో ప్రాణాలర్పించి సాధించుకున్న తెలంగాణలో, కెసిఆర్ కుటుంబం తప్ప ఎవరూ బాగుపడలేదని పొంగులేటి విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో, రైతులు, శ్రామికులు, కార్మికులు, నిరుద్యోగులు, ఉద్యోగులు ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేరనేది నగ్నసత్యమని పొంగులేటి ఘాటుగా విమర్శించారు. రాష్ట్రంలో బెదిరింపులతో పాలన కొనసాగుతోందని, నియంతృత్వ పోకడలతో నడిచే పాలనను ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించారని పొంగులేటి పేర్కొన్నారు. ప్రపంచ చరిత్ర చూసినట్లయితే నియంతృత్వ ధోరణలు అవలంబిస్తూ పాలించిన రాజ్యాలు ఎలా తుడిచిపెట్టుకుపోయాయో చరిత్ర చెబుతుందని పొంగులేటి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎంత తొందరగా ఎన్నికలు వస్తాయో, అంత తొందరగా బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని ప్రజలు వేచి చూస్తున్నారని పొంగులేటి జోస్యం చెప్పారు. రాష్ట్రంలో సుభిక్షంగా పాలన కొనసాగాలనుకుంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ప్రజలు నూటికి నూరు శాతం విశ్వసిస్తున్నారని పొంగులేటి పేర్కొన్నారు. రాబోయేది ఇందిరమ్మ రాజ్యమేనని పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది సీట్లు గెలుపే ధ్యేయంగా ప్రతి కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో పొంగులేటితో పాటు ఊకంటి గోపాల రావు, ఆళ్ల మురళి, తూము చౌదరి, నాగేంద్ర త్రివేది, తూము చౌదరి, నాగ సీతారాములు,తాండ్ర నాగబాబు, చీకటి కార్తీక్, సుందర్లాల్ కోరి, మాధవ్, హేమలత, వనమా రాము, పాల సత్యనారాయణ రెడ్డి, పాసి బాల ప్రసాద్, పల్లపు వెంకటేశ్వర్లు, ఉమా, ముద్దంగుల శేఖర్, ముద్దంగుల రామకృష్ణ తదితరులున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments