జనవిజయంఅధ్యయనండాక్టర్లు చేయాల్సిందేమిటి? చేస్తున్నదేమిటి?

డాక్టర్లు చేయాల్సిందేమిటి? చేస్తున్నదేమిటి?

‘వీరమాచనేని విధానం’ అవగాహన – 3

వీరమాచనేని రామకృష్ణ చెప్పే డైట్ ప్లాన్ కు శాస్త్రీయత ఉందా? ఆయనకు అలా చెప్పే అర్హత ఉందా? వంటి విషయాలపై ఇంతక్రితం వ్యాసంలో చర్చించాము. ఈ వ్యాసంలో వైద్యులు చేయాల్సింది ఏమిటి? చేస్తున్నది ఏమిటి? నేటి సమాజంలో వైద్యుల పట్ల ప్రజల అభిప్రాయం ఏమిటి? మెడికల్ మాఫియా వలన డాక్టర్లు బలి అవుతున్నారా? మెడికల్ మాఫియాను అంతమొందించాలంటే చేయాల్సిందేమిటి? ప్రజల అభిప్రాయంలో నిజాలు ఎంత? సమాజంలో రావాల్సిన మార్పు ఏమిటి? అనే విషయాలు చర్చించే ప్రయత్నం చేద్దాం.

‘డాక్టర్’ కు నాటి సమాజం ఇచ్చిన స్థానమేమిటి?

మన సమాజంలో వైద్యులకు అనాదిగా గౌరవనీయమైన స్థానం ఉన్నది. వైద్యో నారాయణో హరీ: అని వైద్యుడిని భగవంతుడితో, నారాయణుడితో సమంగా పోల్చినా, అప్పిచ్చువాడు వైద్యుడు, నెప్పుడు నెడతెగక పారు ఏరు….. అంటూ ఓ గ్రామానికి ఏవి ముఖ్యమైనవో చెప్పే క్రమంలో వైద్యుని పాత్రని శతకకారులు గొప్పగా చాటినా….. అవి నాటి సమాజంలో వైద్యులకు ఇచ్చిన విలువను, స్థానాన్ని తెలియజేస్తున్నాయి. సమాజంలో వైద్య రంగంలో, వైద్యుని పాత్రలో కూడా గణనీయ మార్పులు వచ్చాయి. నాడు వైద్యం అంటే ప్రకృతిలో ఉండే వనమూలికలతో నాడి చూసి మందులు ఇచ్చేవారు. రోగం తగ్గడమే వైద్యులు ప్రధానంగా చూసేవారు. డబ్బుని గురించి ఆలోచించేవారు కాదు. చాలా సందర్భాలలో ఉచితంగానే వైద్యం చేసేవారు. దేవాలయాలే ఆరోగ్య కేంద్రాలుగా, సంప్రదాయాలు, ఆచారవ్యవహరాలే వైద్య విధానాలుగా ఉండేవి. జీవన విధానం, వైద్య విధానం కూడా అన్నింటా ప్రకృతికి దగ్గరగా, ఒకదానితో ఒకటి ముడిపడి ఉండేది. రోగాల సంఖ్య కూడా ఇపుడున్నంతగా లేదు. ఏదైనా అంతుబట్టని రోగం చాలా తక్కువ మందికి వస్తే మాత్రం చనిపోవలసిందే. ఇపుడున్నంత వైద్య విజ్ఞానం, వైద్యులు నాడు లేకపోవడమే దీనికి కారణం.

నేడా స్థితి ఉన్నదా……?

ఖచ్చితంగా లేదు. ఎందుకు? అంటే టక్కున చెప్పే సమాధానం డాక్టర్లు రోగులను మోసం చేస్తున్నారు అని. ఇది నిజమా? డాక్టర్లు మోసం చేసేది నిజమైతే హాస్పిటల్ కు ప్రజలు వెళ్ళకుండా ఉంటున్నారా? డాక్టర్ అవసరం లేకుండా సమాజం మనుగడ సాగించగలదా? అప్పటి డాక్టర్లకిచ్చిన గౌరవం నేటి డాక్టర్లకు ఎందుకు ఇవ్వడం లేదు? అప్పటి వైద్యం గొప్పదా? ఇప్పటి వైద్యం గొప్పదా? వీటిలో నిజానిజాలను పరిశీలించాలి. నేటి వైద్య విజ్ఞానం ముఖ్యంగా అల్లోపతి విధానం అప్పటి వైద్య విధానంతో పోల్చుకుంటే ఎన్నో రెట్లు అభివృద్ధికరంగా మారింది. శరీరంలో అవయవాల మార్పిడితో సహా, ఎన్నో కొత్త విషయాలు కనుగొనబడి గతంతో పోల్చితే కొన్ని వందల రెట్లు మెరుగైన వైద్యం సమాజానికి అందుతున్నది. గతంలో ప్రాణాలు కోల్పోయిన అనేక రోగాలకు నేడు వైద్యం అవలీలగా అందుతున్నది. మనిషి ఆయుఃప్రమాణం గణనీయంగా పెరిగింది. దీనికి కారణం అభివృద్ధి చెందిన వైద్యవిధానాలే.

డాక్టర్ల పాత్ర లేకుండా సమాజం మనుగడ సాగించడం అసాధ్యం. ఇప్పటికీ డాక్టర్లు చాలా సందర్భాలలో దేవుళ్ళేనని చెప్పవచ్చు. డాక్టర్లు రోగులను మోసం చేస్తున్నారన్నది అర్ధసత్యం, అసత్యం మాత్రమే. నేటి వైద్యం డబ్బుతో కూడుకున్నది కనుక, అన్నింటితో పాటు అదీ సరుకుగా మారింది…మార్చారు… కనుక, ప్రజలు తమ ప్రాణాలమీదకు వస్తే తప్ప ఆరోగ్యం గురించి ఆలోచించరు గనుక, మొత్తం సమాజం ప్రభావం డాక్టర్ల పైనా ఉంటుంది కనుక, వాళ్ళు మనుషులే కనుక…. ఈ నేపథ్యంలో సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనల వల్ల వైద్యరంగం పట్ల కొన్ని దురభిప్రాయాలు జనరలైజ్ అవుతున్నాయి. కొందరు వైద్యులు తప్పుడు పద్ధతులు అనుసరిస్తున్నమాట కూడా వాస్తవం. అంత మాత్రాన డాక్టర్లపై నమ్మకం కోల్పోవడం సరయినది కాదు. దాని వల్ల సమస్యకు పరిష్కారమూ దొరకదు.

ఏం చేయాలి…..?

ప్రజలు, సమాజం వైద్యరంగం పైన సరయిన అవగాహన పెంచుకోవాలి. ప్రభుత్వాలు ఆ దిశగా ప్రయత్నాలు చేయాలి. ప్రజలు రోగం వస్తేనే డాక్టర్ల వద్దకు పరుగెత్తడం, అవసరం ఉన్నా, లేకున్నా విపరీతంగా మందుల వాడకం తగ్గాలి. జీవన విధానం, వైద్యవిధానంల పట్ల అవగాహన పెంచుకోవాలి. ఈ రెండింటి మధ్య ఉండే సంబంధం గురించి అవగాహన కలిగి ఉండాలి. జీవన విధానంలో విచ్చలవిడితనం పెరగడం, శారీరక శ్రమ తగ్గడం, ప్రకృతికి దూరంగా జరగడం, అనుబంధాలకు విలువలివ్వక డబ్బు జబ్బు పట్టుకోవడం, అనవసర బిజీ గజిబిజి జీవనశైలితో మనం చేస్తున్న తప్పులను సరిదిద్దుకోవాలి. ‘ఆరోగ్యమే మహా భాగ్యం’ అని నాటి పెద్దలు చెపితే నేటిజనులు మహాభాగ్యంతో ఆరోగ్యాన్ని ఓ సరుకుగా కొనుక్కోవచ్చని ‘భ్రమ’ పడుతున్నారు. ఇది చదవేస్తే ఉన్నమతి పోయిందన్న చందంగా తయారయింది. కోట్లు గుమ్మరించినా ఆరోగ్యాన్ని కొనలేరు. దానిని సహజ జీవన శైలితో, మంచి ఆరోగ్య విధానాలతో కాపాడుకోవలసిందే.

అన్నింటా సమాజానికి డబ్బు జబ్బు పట్టుకున్నది. దానిని వదిలించుకోకుండా కేవలం డాక్టర్లు మాత్రమే చెడిపోయారనడం ఎలా న్యాయం? ఆ వాదన ఎలా సరయినది? ‘రోగం ఒకచోట అయితే వైద్యం మరోచోట చేయడం’ సరికానట్లే సమాజానికి పట్టిన అతి పెద్ద ‘డబ్బుజబ్బుని’ వదిలించుకోకుండా డాక్టర్లను మాత్రమే నిందించడం, వారిని మాత్రమే తప్పుడు మనుషులుగా చిత్రించడం ‘గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకల గురించి ఆలోచించడమే’ అవుతుంది. ఉదాహరణకు రైతు పంట పండించే విధానం ఎలా ఉన్నది? పంటలను పురుగుమందులతో స్నానం చేయిస్తున్నారు. ఆ ఉత్పత్తులను తింటే రోగాలు రాక ఏమవుతుంది? మరి దీనికి రైతునే బాద్యుడిని చేయాలా? పోటీ ప్రపంచంలో తను బ్రతకాలంటే ఎక్కువ పంట పండించాలి… ఎక్కువ సంపాదించాలి… ఇలా ఒక్క రైతు మాత్రమే కాదు ప్రతి ఒక్కరు పోటీ సమస్యతో సమిష్టి తత్వాన్ని కోల్పోవడం, ఒంటరితనం పెరగడం వ్యవస్థలోనే పెద్ద లోపంగా, శాపంగా తయారయింది. దీనికి వ్యక్తులని బాధ్యులుగా చేసి నిందించడం వల్ల పరిష్కారం రాదు. జీవనవిధానం బాగుంటే నేటి రోగాలలో 95% అసలు వచ్చే అవకాశమే లేదు. మిగతా 5% కూడా రాకుండా ఉండాలంటే అనేక అంశాలలో కార్పోరేట్ల కనుసన్నలలో జరుగుతున్న ప్రకృతి విధ్వంసం ఆగాలి. అదీ సమాజం చేతిలో, ప్రభుత్వాల చేతిలో ఉన్నది. ఈ సవాల్ ని ఎదుర్కోవడమే సమస్యకు అసలు పరిష్కారం.

డాక్టర్లు తప్పులు చేయడం లేదా…..?

అనేక తప్పులు చేస్తున్నారు. కాసులకోసం కక్కుర్తి పడుతున్నారు. అక్షరం ముక్క రాని వ్యక్తి వైద్యశాల పెడితే ఎంతో కష్టపడి చదివి వైద్యవిద్య నేర్చుకున్న విజ్ఞానవంతుడైన డాక్టర్ చేతులు కట్టుకుని యజమాని చెప్పినట్లు చేయడం వ్యవస్థ చేసుకున్న దౌర్భాగ్యం. ఎంతటి దయనీయ పరిస్థితి ఇది. కార్పొరేట్లు, పొలిటికల్ లీడర్లు మెడికల్ రంగంలో పెట్టుబడులు పెట్టడం ప్రజలకోసమా? లాభాలకోసమా? వైద్యం ఎవరి చేతిలో బందీ అవుతోందన్నది ప్రజలు ఆలోచించాలి. ప్రజలలో కూడా మావాడు డాక్టరై బాగా సంపాదించాలనుకోవడం కాక మా వాడు డాక్టరై మంచి పేరు తెచ్చుకోవాలనే ఆలోచనలు పెరగాలి. అవసరం ఉన్నా లేకున్నా మందులు వ్రాయడం, టెస్టులు చేయించడం…. అర్ధం కాకుండా ప్రిస్క్రిప్షన్ ఉండడం…. ఓపికగా జబ్బు గురించి పేషంట్లకు వివరించకపోవడం…. ఆహార నియమాలను చెప్పక పోవడం…. కమీషన్ ఏజంట్లను పెట్టుకుని పేషంట్లను రాబట్టుకోవడం…. ఇలా అనేక విధాలుగా డాక్టర్లు లేదా హాస్పిటల్ యజమానులు చేస్తున్నారు. ఓ జబ్బుకు ఏ ఇద్దరు డాక్టర్లు ఒకే పరిష్కారం చెప్పని స్థితే ఎక్కువసార్లు ప్రస్పుటం అవుతన్నది. అసలు పేషంట్లు డాక్టర్ల దగ్గర ప్రశాంతంగా మనసు విప్పి మాట్లాడే వాతావరణం లేదనే చెప్పాలి. అందరు డాక్టర్లూ ఇలా లేరు. ప్రజలే ఎవరు మంచి డాక్టర్ అన్నది విచక్షణతో నిర్ణయించుకోక తప్పని పరిస్థితి నెలకొంది.

ఫార్మా కంపెనీల కుట్రకు వైద్యం బలి అవుతోన్న సంఘటనలు ఉండడం భయంకరంగా మారింది. కొలెస్టరాల్ కారణంగా గుండె జబ్బులొస్తున్నాయని, ఫ్యాట్ తినోద్దని చెప్పిన వైద్యరంగమే… తూచ్ అదంతా తప్పు అని గైడ్లైన్స్ మార్చడం సంభవించడం సైన్స్ తప్పనుకుంటే పొరపాటు. సైన్స్ ని తమ గుప్పెట్లో పెట్టుకోవాలనే కార్పోరేట్ల ధనాశ వల్ల మాత్రమే ఇలాంటి కుట్రలు జరుగుతుంటాయి. అనవసర మందులు, విదేశాలలో నిషేధించిన మందులూ ఇక్కడ అమ్మడం ఎంత దారుణం! ఇటువంటివాటిని బయట పెడుతున్నదీ సమాజం పట్ల బాధ్యత ఫీలయ్యే వైద్యులే కావడం గమనార్హం. మెడికల్ మాఫియాకు పరిష్కారం డాక్టర్లని నిందించడం కాదు. సమాజంలో రావలసిన మార్పు గురించి లోతుగా ఆలోచించాలి. మెడికల్ మాఫియాను అరికట్టాలంటే ప్రభుత్వమే వైద్యరంగం నిర్వహణ చేయాలి. విద్య, వైద్యం వంటి వ్యవస్థలలో ఎట్టి పరిస్ధితిలోనూ ప్రైవేటువారిని అనుమతించకూడదు. వ్యవసాయంలో విపరీతంగా పురుగుమందులను వాడడం కాకుండా ప్రకృతి సిద్ధమైన పద్ధతిని ప్రభుత్వం ప్రోత్సహించాలి.  వ్యవసాయం లాభసాటిగా ఉండేలా విధానాలు రూపొందించాలి. ఆహార పదార్ధాల తయారిపైనా, వాటికి సంబంధించిన ప్రకటనలపైనా నియంత్రణ  ఉండాలి. ప్రజారోగ్యం ప్రభుత్వ బాధ్యతగా ఉండాలి. ఆరోగ్యం ప్రతి పౌరుడి హక్కుగా మారాలి. ఇది ఏ ఒక్క దేశంలోనో కాక ప్రపంచవ్యాపితంగా జరగాలి. అపుడే ప్రజారోగ్యం సంభవిస్తుంది. కార్పోరేట్, ఫార్మా మెడికల్ మాఫియాకు అవకాశమే లేకుండా పోతుంది.

రామకృష్ణ డాక్టర్లకు ప్రత్యామ్నాయమా……?

ఎంతమాత్రమూ కాదు. వేలమంది వీరమాచనేని రామకృష్ణలు వచ్చినా వైద్యుని పాత్రకు సమానం కాదు. రామకృష్ణ కూడా వినమ్రంగా అదే చెప్తున్నారు. సమస్య రామకృష్ణ చెప్పేది సరిగా అర్ధం చేసుకోకపోవడమే. రామకృష్ణ వైద్యం గురించి చెప్పడం లేదు. ప్రపంచంలో ప్రముఖ వైద్యులు చెప్పిన విషయాలనే అధ్యయనం చేసి జీవన శైలిలో మార్పులు, మన ప్రాంత ఆహారంలో కొన్నింటిని ఎంపిక చేసి ఆచరణకు అనువైన ఒక మార్గం చెప్తున్నారు. ప్రకృతి సిద్ధమైన ఆహారమే అది. మందులు ఇవ్వడం కానీ, వైద్యం గురించి కానీ రామకృష్ణ క్లెయిం చేసుకోవడం లేదు. ఒక్క పైసా కూడా ఆశించకుండా తాను పొందిన మంచిని, ఫలితాన్ని వేలాదిమంది ద్వారా నిర్ధారించుకున్నాక సమాజం మొత్తానికీ చైతన్యం నింపాలని ప్రయత్నిస్తున్నారు. జీవన విధానం గురించి చెప్పడానికి నేటి సమాజానికి లక్షలాదిమంది సుశిక్షుతులైన రామకృష్ణలు కావాలి. దీనిని వైద్యులూ ఆహ్వానించాలి. జీవన విధానం, వైద్య విధానం ఎపుడూ అనుసంధానంగా ఉండాలి తప్ప వ్యతిరేక ఆలోచనలతో ఘర్షణ పడకూడదు.

డాక్టర్లకు తాను ప్రత్యామ్నాయం కాదని, మారిన లేదా అప్డేట్ అయిన మెడికల్ గైడ్లైన్స్ ప్రకారం డాక్టర్లు కొన్ని విషయాలలో అప్డేట్ కావాలని మాత్రమే రామకృష్ణ చెప్తున్నారు. దీనిని తప్పు బట్టాల్సిన అవసరం గానీ, డాక్టర్లను నిందిస్తున్నారనుకోవడం సరికాదు. తన విధానం ఆచరించాలన్నా డాక్టర్ల సలహా, లేబరేటరీ టెస్టుల ఆధారంగా మందులు వాడుతూనే జాగ్రత్తగా చేయాలని చెప్తున్నారు. చాలామంది డాక్టర్లు కూడా తాము సైతం ఇది పాటిస్తున్నామని ఓపెన్ గా చెపుతున్నారు. ఇలాంటి విధానాన్ని తనదైన శైలిలో చేస్తున్న డాక్టర్ పి.వి. సత్యనారాయణ కూడా వైద్యులు అప్డేట్ కావలసిన అవసరాన్ని చెప్తున్నారు. జీవన విధానం చెప్పడానికి డాక్టర్లే కావలసిన అవసరం లేదు. డాక్టర్లే ఓపికగా జీవన విధానం, జబ్బు లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు వివరించి ప్రజలలో నమ్మకం కలిగించగలిగితే, మెడికల్ మాఫియాకు లొంగకుండా ఉండగలిగితే…. రామకృష్ణల అవసరం తగ్గుతుంది. మరి పరిస్థితి అలా ఉన్నదా? ఖచ్చితంగా లేదన్నదే సమాధానం. ఆ పరిస్థితి లాభానికీ, డబ్బుకీ మాత్రమే విలువనిచ్చే సమాజంలో ఆశించడం అత్యాశే అవుతుంది. వైద్యం, విద్య ఎట్టి పరిస్థితిలోనూ సరుకుగా మారకుండా ఉండాలంటే ప్రపంచవ్యాపితంగా ప్రభుత్వాలే వీటి నిర్వహణను చేపట్టాలి. అదే సమస్యకు శాశ్వత పరిష్కారం ఇస్తుంది.

  • పల్లా కొండలరావు.

తదుపరి వ్యాసంలో ఎవరీ రామకృష్ణ? ఆయన చెప్తున్నదీ.. చేస్తున్నదీ… ఏమిటి? ఎవరికోసం? అనేదానిని పరిశీలిద్దాం.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

2 COMMENTS

  1. ఎంత మంది రామకృష్ణులు చెప్పినా చెవిటి వాడి ముందు శంఖం ఊదినతే. ఆచరించిన వాళ్ళు, కొన్ని రోజులకి మర్చిపోతారు రామకృష్ణ ఎవ్వరో ఏమిచెప్పారో కూడా. లాభము ఆశించ కుండా ఎవ్వరు ఏమి చెయ్యరు తోటి వారి ప్రాణానికి విలువలేదు. సులువైన మార్గమే గమ్యం చురుకుదనం ఉండదు. కష్టపడరు, మార్పుని ఆహ్వానించురు కారణం ధనార్జన ఏకైక లక్ష్యం. ఏ జాడ్యం వదిలే మందు కనొకని నీల ట్యాంక్ లో కలపండి ఇవ్వరన్న.

    • మీరు చెప్పిన పద్ధతిలోనే ప్రస్తుత సమాజం ఉన్నదన్నది 100% కరెక్టు. కానీ మార్పు మొదలవకతప్పదు. మారక తప్పదు. ఎందుకంటే మనిషి డబ్బు తిని మాత్రం ఎప్పటికీ బ్రతకలేడు కదా? ప్రక్రుతినీ, మానవ సంబంధాలనీ నాశనం చేసే, మనిషి తయారుచేసిన డబ్బుని తిరిగి మనిషే రద్దు చేసుకోవాలి ఎప్పటికైనా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి