- ఖమ్మం డిపో ఉద్యోగుల ఆర్థిక సహకారం స్ఫూర్తిదాయకం
- ఖమ్మం డిపో మేనేజర్ బి.శ్రీనివాసరావు ప్రశంస
ఖమ్మం, జులై 16(జనవిజయం):
అమ్మానాన్నలను కోల్పోయి అనాధలుగా మిగిలిన ఆర్టీసీ ఖమ్మం డిపో ఉద్యోగి దేవమణి పిల్లల కోసం ఖమ్మం డిపో ఉద్యోగులు ఆదర్శవంతమైన,స్ఫూర్తిదాయకమైన ఆర్థిక సహకారం చేశారని అందుకు కారకులైన వారందరినీ ఖమ్మం డిపో మేనేజర్ బి.శ్రీనివాసరావు అభినందించారు.
ఆదివారం మధ్యాహ్నం ఖమ్మం బస్ డిపో ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఖమ్మం డిపో ఉద్యోగులందరి సహకారంతో జమ చేసిన రు.1,00,000/- (ఒక లక్ష) లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో దేవమణి కుమార్తె పేరు మీద పిక్సుడ్ చేసి అందుకు సంబంధించిన డిపాజిట్ బాండ్ ను దివంగత దేవమణి కుమారుడు ప్రణవ తేజ్,కుమార్తె అశ్విత లకు ఖమ్మం డిపో మేనేజర్ బి.శ్రీనివాసరావు ఉద్యోగుల అందరి సమక్షంలో అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,మనలో ఒకరిగా ఉండి చనిపోయిన ఉద్యోగిని పిల్లల కోసం మంచి ఆలోచన చేసి స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం నిర్వహించారని అందుకు కారకులైన మహిళా ఉద్యోగులు మల్లికాంబ మరియు సలోమి లను ప్రశంసించారు.చనిపోయిన తోటి ఉద్యోగి పిల్లలను ఆదుకోవాలనే మంచి కార్యక్రమానికి సహకరించిన ఖమ్మం డిపో ఉద్యోగులందరినీ ఆయన అభినందించారు.భవిష్యత్తులో కూడా మన తోటి కార్మికులను ఆదుకోవడానికి ఇదే రకమైన స్ఫూర్తితో అందరూ ముందుకు రావాలని ఆయన ఆకాంక్షించారు.దేవమణి పిల్లలు ప్రణవ తేజ్,అశ్వితలకు ఆర్టీసీ ఉద్యోగుల అందరి అండ,ఆశీస్సులు ఉంటాయన్నారు.పిల్లల చదువులను అడిగి తెలుసుకున్నారు.పిల్లలు బాగా చదివి భవిష్యత్తులో మంచిగా రాణించాలని ఆకాంక్షించారు.పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని వారి తాతయ్య కోటయ్య,అమ్మమ్మ నాగరత్నం,బాబాయి శ్రీనివాసరావు,పిన్ని రమ లకు సూచించారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ (ట్రాఫిక్) రామిశెట్టి రామయ్య,డిప్యూటీ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు,డ్యూటీ చార్ట్ కంట్రోలర్ ఆకుతోట శ్రీనివాసరావు,కండక్టర్ డ్యూటీ బుకింగ్ ఎడిసి జేవిలు, డ్రైవర్స్ డ్యూటీ బుకింగ్ ఎడిసి మూర్తి,ఆర్టీసీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ కానిస్టేబుల్ ఉషా,ఉద్యోగుల వెల్ఫేర్ బోర్డు సభ్యుడు దమ్మాలపాటి శ్రీనివాసరావు,ఆర్టీసి కార్మిక నాయకులు పిట్టల సుధాకర్, గుడిబోయిన శ్రీనివాస్,గుండు మాధవరావు,పగిళ్లపల్లి నర్సింహారావు,కిరణ్,రామకృష్ణ మహిళా ఉద్యోగులు అనిత,సరిత,భాగ్యలక్ష్మి,బేబీ,లక్ష్మి,కిరణ్మయి,ఆదిలక్ష్మి,శైలజ తదితరులు పాల్గొన్నారు.