ఖమ్మంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సీజ్
ఉద్రిక్తంగా మారిన విద్యార్థి ప్రజా సంఘాల ఆందోళన
జనవిజయం, 13 జులై(ఖమ్మం): నిబంధనలు పాటించకుండా ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా ఖమ్మం జిల్లా ప్రజలను మోసం చేస్తూన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పైన చర్యలు తీసుకోవాలని పి డి ఎస్ యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నామాల ఆజాద్, ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షుడు తుడుం ప్రవీణ్, ఏఐఎస్ఎఫ్, పి డి ఎస్ యు జిల్లా కార్యదర్శిలు ఇటికల రామకృష్ణ, మస్తాన్ వెంకటేష్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
స్థానిక ఖమ్మం నగరంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదుట వామపక్ష విద్యార్థి,యువజన, మహిళ సంఘాల ఆధ్వర్యంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ రద్దు చేయాలని ఆందోళన చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ., ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పేరుతో ప్రభుత్వ అనుమతి లేకుండా పాఠశాల కొనసాగిస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న యాజమాన్యంపై తక్షణమే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లక్షలాది రూపాయలు ఫీజులు దండుకుంటూ విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్య అందించకుండా విద్యార్థులను మోసం చేస్తున్నారని వారు దుయ్యబట్టారు. ప్రభుత్వ గుర్తింపు లేకుండానే గుర్తింపు ఉన్నట్లు ప్రజలను, అధికారులను మోసం చేయడమే కాకుండా మభ్యపెడుతూ గత మూడు సంవత్సరాల నుండి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నడుపుతున్నా అధికారులు చోద్యం చూడటం ఎంతవరకు సమంజసం అన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు కనీస సౌకర్యాలు లేకుండా ప్లే గ్రౌండ్, ఫైర్ సేఫ్టీ, ఫీజుల బోర్డు కూడా ఏర్పాటు చేయకుండా కమర్షియల్ బిల్డింగ్ లో విద్యా సంస్థను ఎలా నడుపుతారని వారు ప్రశ్నించారు. తక్షణమే ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి విద్యార్థులు రోడ్డున పడకుండా ప్రభుత్వం చర్యలకు పూనుకోవాలన్నారు. జిల్లాలో అనేక పాఠశాలలో ప్రభుత్వ నిబంధనల మేరకు నడుచుకోవడం లేదని అలాంటి విద్యాసంస్థల అన్నిటి పైన ప్రభుత్వం చర్యలకు పూలుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో వామపక్ష మహిళ, యువజన, విద్యార్థి సంఘాల నాయకులు సిహెచ్ శిరోమణి, ఝాన్సీ, మంగతాయి, తేలే రాకేష్ నాన్న బాల రామకృష్ణ బషిరుద్దీన్ చందు ప్రేమ్ సింగ్, రమేష్, నాగరాజు, దీపిక, లక్ష్మణ్, వినయ్, కార్తీక్, యువరాజ్, భాను ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు..
ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ను సీజ్ చేసిన విద్యాధికారులు
సంఘటన స్థలానికి జిల్లా విద్యాశాఖ అధికారి సోమేశ్వర్ శర్మ, ఖమ్మం మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు చేరుకుని ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పైన చర్యలు తీసుకుంటున్నామని వారు తెలిపారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ను సీజ్ చేస్తున్నామని మా అనుమతి లేకుండా ఈ పాఠశాల ఎవరు తెరవడం కుదరదు, అని విద్యాశాఖ అధికారులు ప్రకటించడం జరిగింది.