– ఆలస్యంగా చేసిన న్యాయమైనా అన్యాయంతో సమానమే
– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
ఖమ్మం, ఆగస్ట్ 4 (జనవిజయం) : రైతులకు రుణమాఫీ చేయాలని అనేక దఫాలుగా వామపక్ష పార్టీలు ఆందోళన, పోరాట కార్యక్రమాలు నిర్వహించాయని, వామపక్ష పార్టీల పోరాట ఫలితంగానే రైతు రుణమాఫీ జరిగిందని సిపిఐ(ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరావు అన్నారు. శుక్రవారం నాడు ఖమ్మం అసెంబ్లీ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, సిపిఎం పార్టీ మరియు ఇతర వామపక్ష పార్టీలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులకు రుణమాఫీ చేయాలని పోరాటాలు నిర్వహించామని తెలియజేశారు. ఈ నెలలో కూడా రైతుల రుణమాఫీ కోసం పోరాట కార్యక్రమాన్ని రూపొందించామని అన్నారు. రైతు రుణమాఫీని ఆహ్వానిస్తున్నామన్నారు. కానీ ఈ రుణమాఫీ వల్ల పూర్తి స్థాయిలో రైతులకు న్యాయం జరగడం లేదని అన్నారు. రుణమాఫీ ఆలస్యం చేయడం వల్ల రైతులకు అసలుతో సమానంగా వడ్డీ కూడా పెరిగిందని అన్నారు. సకాలంలో రుణమాఫీ జరగకపోవడం వల్ల రైతులు కొత్త రుణాలు తీసుకోవడానికి అవకాశం కూడా లేకుండా పోయిందని, దానివల్ల ప్రైవేటు వడ్డి వ్యాపారుల వద్ద నుండి అధిక వడ్డీలకు రైతులు అప్పులు తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు. దీనివల్ల రైతులు అప్పుల భారం మరింత పెరిగిందని తెలిపారు. ఆలస్యంగా చేసిన న్యాయమైనా అన్యాయంతో సమానమేనని వారు పేర్కొన్నారు. వ్యవసాయ అవసరాల కోసం బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలు కూడా మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్, జిల్లా కమిటీ సభ్యులు యర్రా శ్రీనివాస్, ఎస్. నవీన్ రెడ్డి, దొంగల తిరుపతిరావు, ఆర్.ప్రకాష్, పిన్నిటి రమ్య, 3 టౌన్ కార్యదర్శి భూక్య శ్రీనివాస్, కార్పొరేటర్ ఎల్లంపల్లి వెంకట్రావు, నాయకులు గౌస్, పత్తిపాక నాగసులోచన, భాగం ఆజిత, గుగులోత్ కుమార్, కారుమంచి పవన్ తదితరులు పాల్గొన్నారు.