జనవిజయంఆంధ్రప్రదేశ్కరోనా సంక్షోభంలోనూ రాజకీయాలే ముఖ్యమా !

కరోనా సంక్షోభంలోనూ రాజకీయాలే ముఖ్యమా !

దేశంలో కొవిడ్‌ కేసుల సంఖ్య తగ్గుతుండగా, మరణాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. అధికారిక లెక్కలు ఒకలా ఉంటే వాస్తవ గణాంకాలు వేరుగా ఉన్నాయి. వాక్సిన్‌లు అందరికీ అందుబాటులోకి రాలేదు. వ్యాక్సిన్‌ల కోసం ప్రజలు ఎగబడాల్సిన దుస్థితి ఏర్పడింది. వ్యాక్సిన్‌ అందరికీ అందుబాటులో ఉంచేందుకు కేందప్రభుత్వం తీసుకున్న చర్యలు కార్యరూపం దాల్చలేదు. ఆక్సిజన్‌ సిలిండర్లు, వెంటిలేటర్లు, పడకల విషయంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఆక్సిజన్‌ అందక వందలాది మంది మృత్యువాత పడ్డారు. అయితే ఆగమేఘాలపై తీసుకుంటున్న చర్యలను సైతం తక్కువ అంచనా వేయలేము.

కేంద్రాన్ని తప్పుపడుతున్న రాష్ట్రాల పరిస్థితి కూడా నిజాయితీగా లేదు. నిత్యం లక్షల కేసులతో..వేలాది మంది మరణాలతో వాస్తవ పరిస్థితులు భయోత్పాతంగా ఉన్నాయి. వీటిని లెక్కచేయని ప్రభుత్వాలు కోవిడ్‌ నివారణకు మెరుగైన విధానం అమలు చేస్తున్నామని నిత్యం నిర్లజ్జగా ప్రకటిస్తున్నాయి. సుప్రీంకోర్టు, హైకోర్టు జోక్యం చేసుకుని రోజూ కొరడా ఝుళిపిస్తున్నాయి. టీకా విధానంలో అత్యుత్సాహంతో కోర్టులు జోక్యం చేసుకుంటే ఊహించని పరిణామాలు ఎదురు కావచ్చని నేరుగా సర్వోన్నత న్యాయస్థానాన్నే బెదిరించే దుస్థితికి కేంద్ర ప్రభుత్వం దిగజారిపోయింది. మేమంతా చూసుకుంటాం.. విూకేం పని అన్న రీతిలో కేంద్రం వ్యవహారంగా ఉంది. దేశవ్యాప్తంగా వైద్యం పడకేసి పడకలు దొరకక, ఆక్సిజన్‌ అందక, టీకాలకూ గతిలేక కనీస వైద్య సాయానికి దిక్కులేక అనునిత్యం లక్షలాది మంది కోవిడ్‌ బారిన పడుతున్నారు. వేలాదిమంది బలైపోతున్నారు. గాలిలో ప్రాణాలు గాల్లోనే కలుస్తున్నాయి. శ్మశానాల్లోనూ చోటు దక్కక గంగానదీ జలాల్లో కలిసిపోతున్న బతుకులెన్నో! ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న చోటే పరిస్థితి ఇంత దయనీయంగా ఉంటే ఇక దేశంలోని ఇతర ప్రాంతాల్లో దుస్థితి ఇంకెంతటి దారుణంగా ఉంటుందో ఊహించవచ్చు.

మరోవైపు థర్డ్‌వేవ్‌ అంటున్నారు. ఈ సారి పిల్లలపై ప్రభావం తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర రాష్ట్రాలు కలసి కట్టుగా సమర్థవంతమైన వ్యూహంతో ముందుకు సాగాలి. కరోనా వేవ్‌ను కట్టడి చేయాలి. ఇకపోతే మే నెలాఖరు నాటికి కూడా తమ కోటా ప్రకారం అందాల్సిన టీకాలు అందే పరిస్థితి లేదు. ఊహించనిరీతిలో దేశంలో సంక్షోభం నెలకొందని సుప్రీంకోర్టు ధర్మాసనం ఇదివరకే తీవ్రంగా వ్యాఖ్యానించింది. వ్యాక్సినేషన్‌, ఆక్సిజన్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వ విధానపర వైఫల్యాలను వివిధ హైకోర్టులు కూడా తీవ్రస్థాయిలో ఎండగట్టాయి. కోవిడ్‌ రెండో దశలో భారత్‌ అంతులేని సంక్షోభంలో కూరుకుపోయిందని అంతర్జాతీయ విూడియా సంస్థలు ఆగ్రహంతో సంపాదకీయాలు రాశాయి. ఈ సంక్షోభానికి చలించి ప్రపంచ దేశాలు అభయహస్తం అందించాయి. ఇంత జరుగుతున్నా మోడీ సర్కార్‌ మాత్రం తన మొద్దు నిద్ర వీడట్లేదు.

ఈ పరిస్థితుల్లోనే సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టి ఆక్సిజన్‌ సరఫరాకు ప్రత్యేకంగా ఒక టాస్క్‌ఫోర్స్‌ కూడా నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ దశలో న్యాయవ్యవస్థ జోక్యాన్ని ప్రశ్నిస్తూ మోడీ సర్కార్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది. వాస్తవానికి కార్యనిర్వాహక వ్యవస్థలో న్యాయ వ్యవస్థ జోక్యం ఎప్పుడూ చర్చనీయాంశమే. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలోని పాలనాయంత్రాంగం మొత్తం పడకేసింది. ఈ క్రమంలో ప్రజలు ఎవరికి వారు తమ స్వీయరక్షణ చర్యలు తీసుకుంటున్నారు. ఇల్లుగుల్ల చేసుకుని, ఆస్తులు అమ్ముకుని అస్పత్రుకు వెళుతున్న ఎందరో శవాలుగా తిరిగి వస్తున్నారు. దిక్కులేని శవాల్లాగా కాటికి పంపిస్తున్నారు. దేశంలో కోవిడ్‌ కేసులు గత వారంతో పోలిస్తే తగ్గుముఖం పట్టడం అత్యంత సంతోష కరమైన పరిణామం. ఏప్రిల్‌ 21 తర్వాత మొట్ట మొదటిసారిగా దేశంలో రోజువారీ కొవిడ్‌ కేసులు మూడు లక్షలలోపు పడిపోయాయి. దేశంలో కరోనాకేసుల విషయంలో మొదటి అయిదు రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు అక్కడ వైద్య వసతులు లేక ప్రక్కనున్న తెలంగాణ రాష్ట్రానికి పరుగు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ తెలంగాణ ప్రభుత్వం వీరిని అడ్డుకుని హైకోర్టు మందలింపుతో, హెచ్చరికలతో మిన్నకుండిపోయింది.

ఇంతటి దారుణ పరిస్థితుల్లో ఇరు తెలుగు రాష్ట్రాల సిఎంలు రాజకీయాలతో కాలం గడుపుతున్నారు. తమను వ్యతిరేకించే వారిని పీక పిసికేసే పనిలో పడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి తన రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యల్లో తలమునకలై ఉన్నారు. సంగం డైరీని స్వాధీన పరుచు కోవాలనుకోవడం, తన పార్టీ ఎంపి రఘురామకృష్ణంరాజును సిఐడి పోలీసులతో అరెస్టు చేసి థర్డ్‌ డిగ్రీ ప్రయోగించేందుకు ప్రేరేపించడం జగన్‌ రెడ్డి మనస్తత్వాన్ని తెలియజేస్తోంది. తెలంగాణలో బాగా పని చేస్తున్న ఆరోగ్యశాఖ మంత్రి ఈటెలను తప్పించే పనిలో పడ్డ కెసిఆర్‌ ఇదే అదనుగా ఆయనను తప్పించారు. ఒక వైపు ప్రజలు కరోనాతో అల్లాడుతూ హాహాకారాలు చేస్తుంటే, సరిహద్దుల్లో అంబులెన్సుల్లో రోగులు హాహాకారాలు చేస్తుంటే ఇద్దరికీ పట్టనట్లు వ్యవహరించారు. అంబులెన్స్‌ల విషయంలో కలసి మాట్లాడాలన్న ఆలోచన కూడా సిఎంలకు రాలేకపోయింది.

తమ వైఫల్యానుంచి ప్రజల దృష్టి మళ్లించేం దుకు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న ఇద్దరు కూడా వ్యక్తిగత ఎజెండాకే ప్రాధాన్యం ఇస్తున్నారు. తెలంగాణలో సరైన సమయంలో వైద్య సౌకర్యాలు లభించక ఒక గర్భిణీ మరణించడాన్ని హైకోర్టు తీవ్రంగా పరగిణించడమే కాక రాష్ట్రంలో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితులను తప్పుపట్టింది. ముఖ్యమంత్రి కేసిఆర్‌కు కూడా కరోనా కంటే రాజకీయ ప్రాధాన్యతలే ముఖ్యం అన్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కరోనా సెకండ్‌ వేవ్‌లోనూ మౌనంగా ఉన్నారు. బెంగాల్లోనూ రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కరోనా కట్టడికన్నా ప్రత్యర్థులను వేధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. పాలకులు బాధ్యతారాహిత్యంగా ఉన్నందున ప్రజలు మాత్రం ఎవరి జాగ్రత్తలో వారు ఉండాలి. ఎవరికి వారు స్వీయరక్షణతో ఉండాలి. లేకుంటే ప్రాణాలు పోతాయి. అయినవారిని కోల్పోతాం. ఆస్తులు కోల్పోతాం. ఇది గుర్తెరిగి ప్రజలు వీధుల్లోకి రాకుండా ఇంటికే పరిమితం కావాలి. అంతా సద్దు మణిగాక అప్పుడు సంపాదన గురించి ఆలోచించాలి.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి