(పల్లా కొండలరావు, ఖమ్మం)
తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయం హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర రాజకీయాలను రానున్న ఎన్నికలలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఖమ్మం జిల్లా కీలకం కానున్నది. త్రిశూల వ్యూహం అమలు చేయడం ద్వారా జిల్లాలో కాంగ్రెస్ బాహుబలిగా నిలవాలని చూస్తోంది. అవమానభారంతో ఉన్న వామపక్ష కార్యకర్తలూ బిఆర్ఎస్ పై కోపంగా ఉండడమూ కాంగ్రెస్ కు కలిసిరావచ్చంటున్నారు. ప్రస్తుత పరిస్థితిలో ఉమ్మడి ఖమ్మం జిల్లాపై రాజకీయ విశ్లేషణ ఇది.
ఇప్పటికే బీఆర్ఎస్ ను వీడిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాలోని పది సీట్లలో ఏ ఒక్క బిఆర్ఎస్ అభ్యర్ధినీ అసెంబ్లీ గేటు తాకనివ్వనని శపథం చేశారు. ఆయన ఒక్కడి వల్లా అది సాధ్యం కాదనీ డబ్బు అహంకారంతో అలా మాట్లాడుతున్నాడనీ అధికార పార్టీ నేతలు విమర్శించారు. పొంగులేటి అనుచరులను బీఆర్ఎస్ లో చేర్చుకునేందుకు ప్రయత్నాలు తీవ్రం చేశారు. కొంతమేరకు సక్సెస్ అయ్యారు కూడా. భద్రాచలంలో పొంగులేటి అనుచరుడు తెల్లం వెంకట్రావును పార్టీ లో చేర్చుకోవడమే గాకుండా టికెట్ ప్రకటించారు. పొంగులేటిని కట్టడి చేద్దామనుకునేలోపే తుమ్మల తిరుగుబాటు హాట్ టాపిక్ గా మారింది. పొంగులేటిది దూకుడు ప్లస్ డబ్బు ప్రభావిత రాజకీయం కాగా తుమ్మలది అభివృద్ధి, అనుభవంతో కూడిన రాజకీయం. సీఎం కేసియార్ కూడా పొంగులేటి ఎదుర్కోవచ్చనుకున్నారు. కానీ తుమ్మల విషయంలో భయపడ్డారు. ఆచితూచి వ్యవహరించారు. తుమ్మల వద్దకు జిల్లా నేతలను, హరీష్ రావును రాయబేరాలకు పంపారు. కాళ్ళవేళ్లా పడ్డారు. బ్రతిమాలాడారు. స్వయాన సీఎం కేసియార్ బిఆర్ఎస్ ఆవిర్భావ సభ సమయంలో తుమ్మలకు ప్రాధాన్యం ఇచ్చారు. సీతారామప్రాజెక్టుకు సంబంధించి ఇరిగేషన్ అధికారులు తుమ్మల ఇంటికి వెళ్లి సమీక్షలు చేశారు. జిల్లాలో మంత్రి ఉండగా ఆయనను కాదని తుమ్మలకు ప్రాధాన్యం ఇవ్వడం ఏమిటన్న విమర్శలు వచ్చాయి. అజెయ్ కంటే తుమ్మలకే సీఎం ప్రాధాన్యం ఇస్తున్నాడన్న వార్తలు, విశ్లేషణలు వినిపించాయి. ఆ తరువాత మీడియా ఇంటర్వ్యూలలో తుమ్మల కూడా తాను బిఆర్ఎస్ లోనే ఉంటామన్నట్లు తెలిపారు. ఓ సందర్భంలో పాలేరుపై పట్టుబట్టనని కూడా చెప్పారు. తుమ్మలకు మంత్రి పదవి లభిస్తుందనుకున్నారు. తుమ్మలకు పాలేరు టికెట్ ఇవ్వడమే గాదు ఉమ్మడి జిల్లాలో ఎన్నికల తంతు మొత్తం తుమ్మల చేతులుమీదుగా జరుగుతుందనే ప్రచారమూ జరిగింది.
కానీ ఇదంతా కేసీయార్ చాణక్యతలో భాగమే. ఆయన తుమ్మలను వదిలించుకోవడానికే డిసైడ్ అయ్యారు. పువ్వాడ అజెయ్ తో ఆయనకు ప్రయోజనం ఉంది. తుమ్మలతో ఇబ్బంది ఉంది. ముఖ్యంగా తుమ్మల ప్రవర్తనతో కేసీయార్ కు సూటిగా చెప్పాలంటే కేటియార్ కు తలనొప్పిగా మారిందంటున్నారు. సీనియారిటీ, అనుభవం రీత్యాను తలవంచని వ్యక్తిత్వం రీత్యాను, అవినీతికి పెద్దగా అవకాశం ఉండని కారణంగా ఆర్ధిక ప్రయోజనాలు జరగాలంటే తుమ్మలతో కంటే పువ్వాడ అజెయ్ తోనే కేటీయార్ కు బాగుంటుందని అందుకే తుమ్మలను కొనసాగించడం కేటీయార్ కు మొదటినుండి ఇష్టం లేదన్న వాదన ఉంది. పైగా మొదట్లో ఉన్న సీను తుమ్మలకు ఇపు డు లేదనేది కేసీయార్ ఆలోచన. ఇపుడంతా కేసీయార్ ఇమేజ్ తోనే తెలంగాణ వ్యాపితంగా ఎన్నికలకు వెళ్లడానికే బీఆర్ఎస్ సిద్ధం అవుతోంది. తుమ్మలను పొంగులేటితో పాటు పోనియకుండా జిల్లాలో ఎక్కువ డ్యామేజి జరుగకుండా చూడడానికి తుమ్మలను జాగ్రత్తగా వాడుకున్నారన్నది ఇపుడు తుమ్మల అనుయాయులు వాపోతున్నమాట.
పాలేరు సీటు వస్తుందన్న ఆశతో ఉన్న తుమ్మలకు చేదు అనుభవం మిగిలింది. 40 ఏండ్ల రాజకీయ జీవితంలో ఖమ్మం జిల్లాలో సంపూర్ణంగా రాష్ట్రంలో చాలా ప్రాంతాలలో తాను చెప్పినవారికి సీట్లు ఇప్పించుకోగలిగిన తుమ్మల ఇపుడు తనసీటుకే ప్రాధేయపడాల్సి రావడం, అయినా ఫలితం లేకపోవడం, దారుణంగా అవమానించబడడం తట్టుకోలేకపోతున్నారు. తుమ్మల కంట తడిపెట్టడం, భావోద్వేగాలకు గురికావడం ఈ విషయం స్పష్టం చేస్తున్నాయి. తుమ్మల పట్ల కేసీయార్ ప్రవర్తన హఠాత్తుగా జిల్లాలో ఆయన పట్ల సానుభూతిని పెంచిందనడంలో సందేహం లేదు. సీఎం కేసీయార్ తుమ్మల వద్దకు పంపిన తాజా రాయబేరం కూడా బెడిసి కొట్టిందనే చెప్పాలి.
మరోవైపు ఈ పరిణామాన్ని కాంగ్రెస్ తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది. తుమ్మల నాగేశ్వరరావును పాలేరు కంటే ఖమ్మంలో మంత్రిపై పోటీ చేయించి గెలిపించాలని కాంగ్రెస్ వ్యూహం పన్నుతోంది. ప్రస్తుత కాంగ్రెస్ సర్వేలో తుమ్మలకు పాలేరు కంటే ఖమ్మంలో గెలవడమే ఈజీగా ఉంటుందన్నది ఆ పార్టీ అంచనా. తుమ్మల మాత్రం పాలేరులోనే పోటీ చేస్తానని ప్రకటించారు. అసలు తుమ్మల కాంగ్రెస్ లోకి వస్తారా? ఖమ్మం నుండి పోటీకి అంగీకరిస్తారా? అన్నది ఈ వారంలో తేలిపోతుందంటున్నారు. ఆయన అభిమానులు మాత్రం కేసీయార్ మాయమాటలు నమ్మొద్దని కాంగ్రెస్ లోకి వెళ్లాలని జిల్లాలో బీఆర్ఎస్ ను గట్టి దెబ్బ కొట్టాలని కోరుతున్నారు. కేసీయార్ ఈ ప్రమాదాన్ని గుర్తించి తుమ్మలకు మంత్రి పదవి ఇవ్వాలని చూసినా పదేపదే మోసపోకూడదనే నిర్ణయానికి తుమ్మల వచ్చినట్లుగా ఆయన అభిమానులు చెబుతున్నారు. వినిపిస్తున్న వార్తలు నిజమై తుమ్మల కాంగ్రెస్ లోకి వస్తే జిల్లాలో ఆయన ప్రభావంతో పదికి పది సీట్లు కాంగ్రెస్ గెలుస్తుందన్నది విశ్లేషకుల అంచనా. గణాంకాలు, గత అనుభవమూ ఇదే చెబుతోంది.
మరోవైపు కొత్తగూడెం టికెట్ ఆశించి భంగపడిన జలగం వెంకట్రావును కూడా కాంగ్రెస్ లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడ పొంగులేటిని తప్పించి వెంకట్రావుకు టికెట్ ఇవ్వాలని భావిస్తున్నారు. పొంగులేటిని పాలేరు నుండి రంగంలోకి దింపాలని చూస్తున్నారు. ఇక్కడ రెడ్డి సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉండడం, షర్మిల కూడా కాంగ్రెస్ లోకి వస్తారంటున్న నేపథ్యంలో పొంగులేటి అయితే పాలేరులో గెలుపు తథ్యం అన్నది కాంగ్రెస్ అంచనా. మరి తుమ్మల మొండి పట్టు వీడతారా? ఖమ్మం సీటులో పోటీ చేయడానికి అంగీకరిస్తారా? అన్నదానిపై ఇది ఆధారపడి ఉంటుంది. తుమ్మల ఓ.కే చెపితే కాంగ్రెస్ పన్నే త్రిశూల వ్యూహానికి ఖమ్మం, కొత్తగూడెం, పాలేరు జనరల్ సీట్లలో బీఆర్ఎస్ ను ఓడించడం తేలికే అవుతుంది. ఈ ముగ్గురూ రంగంలోకి దిగితే వారి ప్రభావంతో మిగిలిన ఏడు సీట్లలోనూ అధికార పార్టీ అభ్యర్ధులను ఓడించాలన్నది కాంగ్రెస్ అధిష్టానం వ్యూహంగా ఉంది. అనూహ్యంగా మారుతున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయ పరిణామాలలో ఎపుడేమి జరుగుతుందోనన్న ఆసక్తి పెరుగుతోంది.
ఈ జిల్లాలో తెలుగుదేశం, వామపక్షాల ఓట్లు కూడా కీలకమే. గణనీయమైన ఓటు బ్యాంకి కలిగిన వామపక్షాలనూ కేసీయార్ దారుణంగా మోసం చేశారు. వారితో పొత్తును అవమానకర పద్ధతులలో ముగించారు. అయితే నాయకులలో పశ్చాత్తాపం పెద్దగా కనిపించకపోయినా వామపక్షాల క్యాడరు మాత్రం బీఆర్ఎస్ పోకడలపై కసిగా ఉంది. ఇది కూడా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కు లాభిస్తుందనే అంచనాలున్నాయి. అయితే వామపక్షాల నిర్ణయం ఎలా ఉంటుంది.వామపక్షాల రాష్ట్ర కార్యదర్శులిద్దరూ ఈ జిల్లాకు చెందినవారే కావడం గమనార్హం. సిపిఐ, సిపిఎంలు మాత్రమే కలసి పోటీ చేస్తాయా? కాంగ్రెస్ తో కలుస్తాయా? అన్నది కూడా ఈ వారంలో తేలే అవకాశం ఉంది. సిపిఐ ని పువ్వాడ అజెయ్ ద్వారా, సిపిఎంని తమ్మినేని ద్వారా వ్యక్తిగత అవసరాల రీత్యా పరోక్షంగా ఉపయోగించుకోవాలని కేసీయార్ చూస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నా వాటిని వామపక్షనేతలు కొట్టిపారేస్తున్నారు. తమ పార్టీలలో వ్యక్తులెంత గొప్పవారైనా అంతిమంగా పార్టీ నిర్ణయమే అమలవుతోందంటున్నారు.
తాజాగా తుమ్మలని,వామపక్షాలను ఘోరంగా అవమానించడం ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం కేసీయార్ కోరి తలనెప్పులు తెచ్చుకున్నాడన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. వీటిని ఎదుర్కునేందుకు కేసీయార్ ప్రతి వ్యూహాలేమిటన్నది చర్చనీయాంశంగా మారింది. డబ్బు, అధికారం, ప్రలోభాలు ప్రభావితం చూపుతున్న రోజులలో తుమ్మల, పొంగులేటి, జలగం, వామపక్షాలను ఎదుర్కోవడం పెద్ద సమస్య కాదని కేసీయార్ జిల్లా నేతలకు ధైర్యం చెబుతున్నారు. ముఖ్యంగా తుమ్మలను బయటకు పంపడంతో అధికార పార్టీలో కొందరు నేతలు మాత్రం చాలా హ్యేపీగా ఫీలవుతున్నారు. కానీ తాజాగా తుమ్మల పట్ల హఠాత్తుగా పెరిగిన సానుభూతి, ఆయన అభిమానులలో పెరిగిన పట్టుదల వారి సంతోషానికి సవాల్ గా మారబోతోంది.
ఇప్పటికే రెండు సార్లు కేవలం ఒక్కొక్క స్థానంతో సరిపెట్టుకున్న బీఆర్ఎస్ ఈ సారీ ఆ స్థానం కూడా కోల్పోవడం ఖాయమని కాంగ్రెస్ అభిమానులు గట్టిగా చెబుతున్నమాట. ఇదే జరిగితే కేసీయార్ స్వయంకృతాపరాధమనే చెప్పాలి. భిన్నంగా ఫలితాలు వస్తే కేసీయార్ పాలనకు ప్రజలు జేజేలు పలుకుతున్నారని తేలుతుంది. ఏమైనా రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించడంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా కీలకం కాబోతోంది. ఏం జరుగబోతోంది? నేతల నిర్ణయం ఏమిటన్నది ఈ వారంలో స్పష్టం కాబోతుందనే అంచనాలున్నాయి.