Saturday, February 24, 2024
Homeరాజకీయంమంగళవారం అధికార కాంగ్రెస్‌ నేతల కాళేశ్వరం సందర్శన

మంగళవారం అధికార కాంగ్రెస్‌ నేతల కాళేశ్వరం సందర్శన

  • అక్రమాలను బయటపెట్టడమే లక్ష్యంగా యాత్ర
  • వేలకోట్లు నీటి పాలయ్యాయని నేతల ఆరోపణ

హైదరాబాద్‌,ఫిబ్రవరి12(జనవిజయం):

కాళేశ్వరంప్రాజెక్ట్‌ లోని మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ లోపాలను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు నేరుగా పరిశీలించనున్నారు. దాదాపు 80 మంది ఎమ్మెల్యేలు, మంత్రులతో కలిసి ఆయన  మంగళవారం మేడిగడ్డ బ్యారేజీ వద్దకు రానున్నారు. బ్యారేజీలో నిర్మాణ లోపాలు, కుంగుబాటుకు కారణాలను అధికారులు ఆయనకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించనున్నారు. ముఖ్యమంత్రి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్దఎత్తున రావడంతో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో మరింత అప్రమత్తమయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ లో భాగంగా నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్ట్‌ దెబ్బతిన్న ప్రాంతాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సందర్శించనున్నారు. మంగళ వారం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు కలిసి ఆయన స్వయంగా బ్యారేజీని పరిశీలించనున్నారు. ప్రజల సమక్షంలోనే అధికారులు  బ్యారేజీ దెబ్బతినడానికి  కారణాలను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వెల్లడించనున్నారు.

శాసససభలో నీటిపారుదలశాఖపై  శ్వేతపత్రం విడుదల చేసిన ప్రభుత్వం అందులో మేడిగడ్డ లోపాలను ప్రత్యేకంగా ఎత్తిచూపింది. నీటిపారుదల శాఖలో అవినీతి, అక్రమాలపై చర్చించనుంది. సభలో తాము చెప్పినవన్నీ నిజాలే అని నిరూపించేందుకే ఎమ్మెల్యేల బృందంతో  సీఎం రేవంత్‌ రెడ్డి మేడిగడ్డ సందర్శించనున్నారు. కేవలం పేపర్‌ పై మాటలు చెప్పడం కాదని తాము చేసిన ఆరోపణలను రుజువులతో సహా నిరూపిస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి గత సమావేశాల్లోనే సవాల్‌ విసిరారు. నీటిపారుదలశాఖపై జరిగే చర్చలో ప్రతిపక్షనేత కేసీఆర్‌ సైతం పాల్గొనాలని రేవంత్‌ రెడ్డి కోరారు. మేడిగడ్డ సందర్శనకు  కేసీఆర్‌ తోపాటు  బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అంతా రావాలని రేవంత్‌ పిలుపునిచ్చారు.

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు కాంగ్రెస్‌ ముఖ్య నాయకులంతా  మేడిగడ్డ సందర్శనకు రానుండటంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. సరిహద్దు ప్రాంతం చత్తీస్‌ ఘడ్‌ లో మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉండటంతో మూడు అంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చే మార్గంలో కల్వర్లులు, రహదారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. సీఎం హోదాలో తొలిసారి రేవంత్‌ రెడ్డి భూపాలపల్లి జిల్లాలో పర్యటిస్తుండటంతో  పెద్దఎత్తున అభిమానులు తరలివచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు అదనపు బలగాలను  మోహరించారు. స్పెషల్‌ పోలీసులు అటవీప్రాంతంలోని గ్రామాలను జల్లెడపడుతున్నారు.

మేడిగడ్డ సందర్శన అనంతరం సీఎం రేవంత్‌ రెడ్డి ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రజాపాలన పేరిట సీఎం రేవంత్‌ రెడ్డి వారితో నేరుగా ముఖాముఖి నిర్వహించనున్నారు. కేసీఆర్‌ హయాంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పై ఇప్పటికే విమర్శలు వచ్చాయి. అదంతా మేడిపండు చందంగా మారిందని తేలింది. కవిూషన్ల కోసం నిర్మించారని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది.  కోట్లు ఖర్చుచేసి నిర్మించిన ప్రాజెక్ట్‌ లో భారీ లోపాలు బయటపడ్డాయి.

అయితే వాటిని భూతద్దంలో చూపి ప్రజలను భయపెడుతున్నారని బిఆర్‌ఎస్‌  పార్టీ నేతలు మండిపడ్డారు. కనీసం ఇప్పటి వరకు టెక్నికల్‌ ఎంక్వైరీ కమిటీ ఎందుకు వేయలేదని వారు ప్రశ్నించారు. కేవలం ప్రాథమిక విచారణ ఆధారంగానే ప్రాజెక్టుపై రాజకీయం చేస్తూ దీన్ని పక్కన పెట్టే కుట్రలకు ప్రభుత్వం తెరలేపిందని ఆరోపించారు. కృష్ణానదిపై నిర్మించిన ప్రాజెక్టులు కేఆర్‌ఎంబీకి ఇవ్వడాన్ని నిరసిస్తూ ఈనెల 13న నల్గొండలో బీఆర్‌ ఎస్‌ బహిరంగ సభ ఏర్పాటు చేసిన రోజే కావాలని సీఎం రేవంత్‌ రెడ్డి మేడిగడ్డపై దండయాత్రకు వెళ్తున్నారని వారు ఆరోపించారు.

ఇదిలావుంటే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజాభవన్‌లో ఆదివారం ప్రత్యేక సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. అసెంబ్లీలో ఇరిగేషన్‌పై శ్వేతపత్రం విడుదల నేపథ్యంలో ప్రజా ప్రతినిధుల సమావేశం ప్రత్యేకత సంతరించుకుంది. కృష్ణా జలాలపై మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ దాదాపు గంటకుపైగా జరిగింది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలు, కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజెంటేషన్‌ ద్వారా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మంత్రి ఉత్తమ్‌ వివరించారు.

ఉమ్మడి రాష్టాన్రికి  కృష్ణ జలాల్లో వాటా శాతం ఎంత? రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ వాటా శాతం ఎంత ఉంది? గూగుల్‌ మ్యాప్‌ ద్వారా కృష్ణ పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టుల వివరాలను అధికారులు, మంత్రి ఉత్తమ్‌ వివరించారు. తెలంగాణలో కృష్ణ పరివాహక ప్రాంతం 68 శాతం ఉన్నా, రాష్ట్ర విభజన తర్వాత కేవలం 33 శాతం నీటి వాటాకు గత కేసీఆర్‌ ప్రభుత్వం ఎలా ఒప్పందం చేసుకుంది. శ్రీశైలం నుంచి గత పదేళ్లలో ఏపీ ప్రభుత్వం అనుమతులు లేకుండా చేపట్టిన ప్రాజెక్టులను గూగుల్‌ మ్యాప్‌ ద్వారా మంత్రి ఉత్తమ్‌ వివరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments