(జనవిజయం, ఖమ్మం)
వై.ఎస్.షర్మిల కాంగ్రెస్ లో చేరబోతున్నారు. తెలంగాణలో రాజన్న రాజ్యం కోసం వైతెపా ను పెట్టి 4వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు షర్మిల. అధికార బిఆర్ఎస్ పై మాటల తూటాలు పేల్చారు. మొదట్లో షర్మిల పార్టీపై రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఆమె వెనుక జగన్, బిజెపి, కేసీయార్ లు ఉండి నడిపిస్తున్నారంటూ విమర్శలు వచ్చాయి. అవేమీ పట్టించుకోకుండా ఆమె ముందడుగే వేశారు. మొండి మనిషిగా షర్మిల గుర్తింపు తెచ్చుకున్నారు. తెలంగాణాలోనూ వైఎస్ఆర్ అభిమానులు గణనీయంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే పార్టీని నడపడం అంత తేలిక కాదని షర్మిలకు అంతుపట్టినట్లు ఆమె తన పార్టీని బేషరతుగా కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం అందుతోంది. ఈమేరకు ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో ఆమె నేరుగా చర్చలు జరుపబోతున్నారని తెలుస్తోంది. కర్నాటక పీసీసీ ఛీఫ్ డీ.కే.శివకుమార్ , వై.ఎస్ కుటుంబ సన్నిహితుడు కేవీపీ రామచంద్రరావుల మంత్రాంగం మేరకు బేషరతుగానే షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లోకి విలీనం చేసేందుకు అంగీకారం కుదిరిందంటున్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నుండి కాంగ్రెస్ తరపున అసెంబ్లీకి పోటీ చేయాలని షర్మిల అధిష్టానాన్ని కోరగా ఆమెను ఖమ్మం లేదా సికింద్రాబాద్ పార్లమెంటు నుండి పోటీ చేస్తే బాగుంటుందని సూచించినట్లు సమాచారం. అయితే ఎప్పటినుండో షర్మిల పాలేరు నుండే పోటీకి దిగాలని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ స్థానంలో ఆమెకు గెలుపుకు అవకాశాలు కూడా ఉన్నట్లు భావిస్తున్నారు. ఇక కాంగ్రెస్ నుండి అయితే ఆమె గెలుపు నల్లేరు మీద నడకగానే చెప్పాలి. ఎప్పటినుండో షర్మిల పార్టీ విలీనం గురించి వార్తలు వినిపిస్తున్నా ఓ నిర్ణయానికి రాలేకపోవడానికి పాలేరుపై క్లారిటీ లేకపోవడంతో పాటు ఆమె చేరికను తెలంగాణలో కొందరు వ్యతిరేకిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. రేవంత్ వర్గం షర్మిల రాకను వ్యతిరేకిస్తున్నట్లుగా చెబుతున్నారు. భట్టి, కోమటిరెడ్డి లాంటి వాళ్లు స్వాగతిస్తున్నట్లుగా ప్రచారం ఉంది. ఇప్పటికే గ్రూపు తగాదాలతో సతమతమవుతున్న తెలంగాణ కాంగ్రెస్ లో షర్మిల రాక కొత్త తగాదాలకు దారి తీయకుండా చూడాలని అధిష్టానం భావించడం కూడా ఆమె చేరిక ఆలస్యం కావడానికి కారణంగా తెలుస్తోంది. షర్మిల చేరికతో తెలంగాణ వ్యాపితంగా కాంగ్రెస్ కు లాభం జరుగుతుందన్న అంచనాకు వచ్చిన అధిష్ఠానం ఆమెను పార్లమెంటుకు పంపాలని చూస్తోంది. షర్మిల మాత్రం అసెంబ్లీకి వెళ్లాలని భావిస్తున్నారు. అన్నీ కొలిక్కి వస్తే ఈవారంలోనే సోనియా సమక్షంలో షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. షర్మిల పోటీ విషయంలో మాత్రం అధిష్ఠానం ఏ హామీ ఇవ్వలేదనీ అంతా మంచే జరుగుతుందనే కేవీపీ, డికెశివకుమార్ ల హామీతో షర్మిల విలీనానికి అంగీకరించినట్లు సమాచారం. చూద్దాం షర్మిల పార్లమెంటుకా? అసెంబ్లీకా? ఎక్కడి నుండి పోటీ చేయనున్నారు? అనేది కొద్దిరోజులలో తేలబోతుందన్నమాట.