Thursday, October 5, 2023
Homeమై వాయిస్కామ్రేడ్లతో కాంగ్రెస్ పొత్తు కుదురుతుందా?

కామ్రేడ్లతో కాంగ్రెస్ పొత్తు కుదురుతుందా?

(పల్లా కొండలరావు, ఖమ్మం)

కామ్రేడ్లతో కాంగ్రెస్ దోస్తీ కుదురుతుందా?

ప్రస్తుతం తెలంగాణలో రానున్న ఎన్నికలలో కామ్రేడ్ల వైఖరి ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది. మునుగోడులో తమను వాడుకుని కేసీయార్ మోసం చేశాడని తాజాగా కామ్రేడ్లు వాపోతున్నారు. కేసీయార్ వైఖరి తెలిసి కామ్రేడ్లు ముఖ్యంగా క్యాడర్ కు ఇష్టం లేకపోయినా వామపక్షాల కార్యదర్శులిరువురూ కేసీయార్ తో పొత్తుకోసం వెంపర్లాడారన్నది సర్వత్రా వినిపిస్తున్న ఆరోపణ. మా పార్టీలలో వ్యక్తుల నిర్ణయాలుండవని కమిటీల నిర్ణయాలే ఉంటాయని సహజంగానే పైకి చెపుతున్న వివరణలు నమ్మశక్యంగా లేవంటున్నారు. కమ్యూనిష్టు క్యాడర్ లో కూడా నాయకుల పోకడలపై అనుమానాలున్నాయి. గతమంత ఘనంగా వామపక్షాల వైఖరి లేదన్నది స్పష్టం.

ఎందుకీ పరిస్తితి దాపురించింది? కేవలం తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావులు తమ సీట్ల కోసం పడుతున్న తాపత్రయమే పొత్తులు బెడిసి కొట్టడానికి కారణమన్న విమర్శలు ఘాటుగా వినిపిస్తున్నాయి. ఈ ప్రశ్నలు అడిగినపుడల్లా వారిరువురు జర్నలిస్టులపై విరుచుకుపడడం, అసహనం వ్యక్తం చేయడం చేస్తున్నారు. ఇవన్నీ కమ్యూనిష్టులంటే గిట్టనివారు చేస్తున్న విమర్శలని వారు కొట్టిపారేస్తున్నా వాస్తవం దానికి విరుద్ధంగా ఉంది. కమ్యూనిస్టు సిద్ధాంతంపైనా, బిజెపిని ఓడించాలన్న వాటి వైఖరిపైనా విమర్శకులలో పెద్దగా వ్యతిరేకత విమర్శలు లేవు. సిద్ధాంతపైనా, కమ్యూనిస్టులపైనా అసత్య ఆరోపణలతో విషం చిమ్మేవారికి ఇపుడా అవసరం లేకుండా కామ్రేడ్ల కక్కుర్తే ఆయుధంగా తయారైంది.

పొత్తుల సందర్భంగా నాయకుల కక్కుర్తిని ఈసడించుకుంటున్నారు. సహజంగా కమ్యూనిస్టులకు పదవులపై ఆరాటం ఉండదు. సుందరయ్య నుండి సున్నం రాజయ్య దాకా సాదాసీదాగా గడిపిన తీరు పదవులను గడ్డిపోచగా చూసిన తీరు, ప్రలోభాలను లెక్కచేయని తత్త్వాన్ని ఇదే మీడియా, విమర్శకులు సైతం అభినందించిన, ప్రచారం చేసిన విషయాన్ని వారు కావాలనే మరచిపోతున్నారు. ఇపుడు ఇదే నాయకుల కక్కుర్తి కారణంగా కాంగ్రెస్ తో దోస్తీ కూడా కటీఫ్ కావచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ తో సిపిఐ, సిపిఎం ల చర్చలు ప్రారంభం అయ్యాయి. కామ్రేడ్లు మాత్రం పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. తాము అడుగుతున్న సీట్ల విషయం తేలకుండా పొత్తుల విషయంలో తొందరపడమని చెబుతున్నారు. బీఆర్ఎస్ తో పొత్తు సందర్భంలో చూపిన అత్యుత్సాహం కారణంగా కేసీయార్ వీరిని ఘోరంగా అవమానించిన తీరు కారణంగా కాంగ్రెస్ తో నైనా కరెక్టుగా ఉండాలనే జాగ్రత్తలు తీసుకుంటున్నారనిపిస్తోంది.

సిపిఐ , సిపిఎం లకు చెరో రెండు సీట్లు గెలిచాక చెరొకటి చొప్పున రెండు ఎం.ఎల్.సిలు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించుకుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. స్థానిక నాయకత్వం అసలు కామ్రేడ్లతో పొత్తు వద్దంటున్నా క్షేత్రస్థాయిలో కామ్రేడ్లతో పొత్తు వల్ల ఖమ్మం, నల్గొండ, వరంగల్ వంటి జిల్లాలలో దాదాపు 30 సీట్లలో కాంగ్రెస్ కు ప్రయోజనం ఉంటుందని అధిష్టానం భావిస్తోంది. నేరుగా అధిష్టానమే రంగంలోకి దిగడంతో ఈసారి పొత్తుల విషయం ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల కక్కుర్తి మూలంగా గతంలో సిపిఐ, కోదండరామ్ లాంటి వారు సైతం అవమానానికి గురయ్యారు. ఆ భయం కూడా కామ్రేడ్లను వెంటాడుతోంది. కాంగ్రెస్ లో ఎవరిని నమ్మాలి? ఎవరితో పోల్ మేనేజ్మెంట్ విషయాలను చూడాలన్నది పెద్ద సవాలే. ఇప్పటికీ కాంగ్రెస్ నాయకులకు సోయి రాలేదనే చెప్పాలి. వస్తుందన్న నమ్మకం కూడా లేదు. కేవలం ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేకత కలసి వస్తే తప్ప రాష్ట్ర నేతలను చూసి కాంగ్రెస్ ను ప్రజలు గెలిపించే పరిస్తితి లేదు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ కు ధీటైన పేరు కాంగ్రెస్ లో వినిపించడం లేదు. రేవంత్ రెడ్డి ఉన్నా అధిష్ఠానం ఆయనకు కూడా పూర్తి స్వేచ్ఛనివ్వడం లేదు. కేసీయార్ కోవర్టులు రేవంత్ కంటే బిఆర్ఎస్ తో లోపాయికారీ ఒప్పందానికే వెంపర్లాడుతున్నారు. సీనియర్లమంటూ చెప్పుకుంటున్నవారు అసలు వారి స్థానాలలో గెలుస్తారా అన్నది అనుమానంగా ఉంటే తామే ముఖ్యమంత్రులమంటూ ఆత్రం ప్రదర్శిస్తూ ఆగమాగం అవుతున్నారు. ఆలూ లేదూ…. చూలూ లేదూ…. సీ.ఎం పేరు సీతక్క అంటూ గందరగోళం సృష్టించుకుంటున్నారు. పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే అమ్ముడుపోని వారెందరన్నది మరో ప్రశ్న. అలా నికరంగా ఉండేవారికి సీట్లు కేటాయిస్తారా? కోవర్టులను గుర్తించారా? చర్యలుంటాయా? అన్నది కోటిడాలర్ల ప్రశ్న. కాంగ్రెస్ లో ఏం జరుగుతుందన్నది అయోమయంగా ఉన్నది.

కేసీయార్ పై కంటే ఎం.ఎల్.ఏ లపై తీవ్రంగా వ్యతిరేకత ఉంది. దీనిని సద్వినియోగం చేసుకోవాలని కానీ, వామపక్షాలను, కోదండరామ్ లాంటి నికరమైన శక్తులను కలుపుకోవాలని కానీ రాష్ట్ర నాయకులలో ఏ ఒక్కరికీ లేదనడం లేదా కలుపుకుపోయే శక్తి లేదనడం అతిశయోక్తి కాదు. అందుకే కేసీయార్ వ్యతిరేక శక్తులను కలుపుకుపోవడంలో అధిష్ఠానమే నిర్ణయం తీసుకుంటుందన్న వార్తలు ఊరట కలిగించే అంశం. కాంగ్రెస్ క్యాడర్ కసిగా ఉన్నా మల్లు భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, కోమటిరెడ్డి లాంటి వాళ్ల వైఖరి అంతుబట్టకుండా ఉంది. వీరి తీరు కాంగ్రెస్ కు పెద్దగా ప్రయోజనం కలిగించేలా లేదు. తుమ్మల వంటి వారికి అధిష్ఠానమే తగిన హామీలిస్తున్నట్లు చెబుతున్నారు. తాజా సర్వేలన్నీ కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నా రాష్ట్ర నాయకుల తీరు రోతగా ఉండడంతో చివరినిమిషం దాకా గెలిచేందుకు కేసీయార్ అన్ని ప్రయత్నాలు చేస్తారనడంలో సందేహం లేదు. కాంగ్రెస్ లో కోవర్టులను పెట్టామని బాల్కసుమన్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఇంత గందరగోళంలో కామ్రేడ్లతో పొత్తు ఉన్నా వారికి వీరు సహకరిస్తారా? ఓటు బదిలీ సక్రమంగా జరుగుతుందా? అన్నది సందేహమే. క్యాడర్ స్వతహాగా కసిగా పనిచేస్తే తప్ప కాంగ్రెస్ నాయకులని నమ్మి ఓట్లు పడతాయనుకుంటే గ్రహపాటే అవుతుంది.

నిజానికి కాంగ్రెస్ రాష్ట్ర నాయకులకు ఈ సోయి ఉంటే కామ్రేడ్లకు ఈ గతి పట్టి ఉండేది కాదు. కాంగ్రెస్ నేతల రోత చేష్టల వల్లనే వామపక్షాల నేతలు కేసీయార్ తో పొత్తుకు వెంపర్లాడడానికి అవకాశం దొరికింది. బిజెపికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఉంటుందన్న వాదన ఉన్నా స్థానికంగా కాంగ్రెస్ నేతల కుమ్ములాటలు, వారు గెలిచినా అమ్ముడుపోతారన్న ఆరోపణలు వామపక్షాలలో కేసీయార్ తో దోస్తీ చేయాలనుకునే నేతలకు అవకాశంగా మారింది. ఈ అంశాన్ని ఆధారం చేసుకునే కేసీయార్ తో పొత్తుకు వారు కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించగలిగారన్న వార్తలు వినిపించాయి. క్రింది స్థాయి క్యాడర్ లో మెజారిటీ బీఆర్ఎస్ తో పొత్తుకు వ్యతిరేకంగా ఉన్నారు. కాంగ్రెస్ తో దోస్తీ కుదిరినా లేకున్నా బీఆర్ఎస్ తో సఖ్యత మాత్రం వారు జీర్ణించుకోలేక పోయారు. కేసీయార్ జిత్తులమారి వైఖరి, నియంతృత్వ వైఖరి, వాడుకుని వదిలేసే తత్త్వం, బిజెపితో లోపాయికారీ ఒప్పందాలుంటాయని తెలిసిన వారెవరూ కేసీయార్ ను నమ్మలేరు. కేవలం వామపక్ష దిగ్గజాలమని తమకు తాము భావిస్తున్న నేతలు మాత్రమే ఈ వాదనలను సమర్థించుకుంటున్నారు. మేమేత్రం పశ్చాత్తాపపడాల్సిన అవసరం లేదంటున్నారు. దేశ ప్రయోజనాలు నిజంగా కాంక్షించేవారెవరైనా కాంగ్రెస్ , వామపక్షాల దోస్తీనే కోరుకుంటున్నారు. కేసీయార్ గతంలోనూ, భవిష్యత్తులోనూ బిజెపికే జై కొడతారు. కవిత అరెస్టు కన్నా కేసీయార్ కు దేశ, రాష్ట్ర ప్రయోజనాలేమీ ముఖ్యం కావు. వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించి, వాటికోసం తాపత్రయపడేవారే చిత్రవిచిత్ర వాదనలు వినిపించి కేసీయార్ తో బంధం విషయాన్ని సమర్ధించుకునే వృధాప్రయత్నం, వాదనలు చేస్తున్నారు. జరగాల్సింది జరిగింది. కేసీయార్ బిజెపితో కలసి పని చేయాలనుకున్నారు. లోపాయికారీ ఒప్పందం కుదిరింది. మజ్లీస్, బిఆర్ఎస్, బిజెపి మూడూ పెవికాల్ బంధంతోనే పనిచేస్తాయి.

జరిగిందేమైనా ఇపుడైతే నాయకులకు ఇష్టం ఉన్నా లేకపోయినా బిజెపితో కేసీయార్ అంటకాగడానికి రెడీ అవుతున్నారని వామపక్షాలు ప్రకటించక తప్పడంలేదు. ఎందుకుంటే వాస్తవ పరిస్తితి అది. సైద్ధాంతికంగా బిజెపి వ్యతిరేకత పేరుతోనైనా బీఆర్ఎస్ ను ఓడించాలన్న పిలుపు ఇవ్వక తప్పదు. అయితే ఇది సీట్ల ఒప్పందం కుదిరాకనే జరుగుతుందనడంలో సందేహం లేదు. ముఖ్యంగా సిపిఐ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శులను సంతృప్తిపరచకుండా పొత్తు కుదిరేలా కనిపించడం లేదంటున్నారు. వారిని సంతృప్తిపరచే స్థితి కాంగ్రెస్ లో లేదు. కొత్తగూడెంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పాలేరులో తుమ్మల నాగేశ్వరరావు, షర్మిలలో ఒకరికి సర్దుబాటు చేయాలి. కొత్తగూడెం పరిస్తితి ఎలా ఉన్నా పాలేరులో సిపిఎం కు డిపాజిట్ దక్కే పరిస్తితి కూడా లేదు. కాంగ్రెస్ కు ఇది కంచుకోటే అయినా సిపిఎం కు ఓట్లు బదిలీ కావు. పరిస్తితి తెలిసి ప్రస్తుత క్లిష్ట సమయంలో ఓ సీటును పోగొట్టుకోవడం కష్టమే. మొత్తంగా సిపిఐ కి వైరాతో పాటు మరో సీటు, సిపిఎం కు మిర్యాలగూడెంతో పాటు మరోసీటు ఇవ్వాలని కాంగ్రెస్ చూస్తోంది. వామపక్ష కార్యదర్శులిరువురికీ ఎంఎల్సీలతో సరిపుచ్చాలని చూస్తోంది. కానీ వారిరువురూ దీనికి అంగీకరించకపోవచ్చు.

ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో సిపిఎం కు ఒక్క సీటైనా కేటాయించకుండా పొత్తు పొడవడం కష్టమేనని చెప్పాలి. ఖమ్మం జిల్లాలో సిపిఎం భద్రాచలం, మధిరలలో మాత్రమే బలంగా ఉంది. ఆ రెండు చొట్లా కాంగ్రెస్ సిట్టింగ్ లు ఉన్నారు. పైగా వారిరువురు బిఆర్ఎస్ లోకి జంప్ కాకుండా కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు. పాలేరు విషయం తేలాలంటే షర్మిల, తుమ్మల ల సంగతి తేలాలి. రాష్ట్ర వ్యాపితంగా కామ్రేడ్లతో ప్రయోజనం కావాలంటే కాంగ్రెస్ పాలేరు, కొత్తగూడెంలను త్యాగం చేయాలి. అలా చేస్తే చిటికెలో పొత్తు పొడుస్తుందనే వాదనలున్నాయి. కానీ ఆచరణలో అదంత సులువుగా జరిగేపని కాదు. నామినేషన్లు ముగిసేదాకా కాంగ్రెస్, కామ్రేడ్ల పొత్తు లొల్లి కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి సిపిఐ, సిపిఎంలు కలసి పనిచేస్తాయి. వరుస జాబితాల ప్రకటన మొదలవుతుంది. నామినేషన్ల అనంతరం బీఆర్ఎస్ ను ఓడించాలనే కర్తవ్యం గుర్తుకొచ్చి కాంగీయులు, కామ్రేడ్లు అభ్యర్ధుల ఉపసంహరణలతో పొత్తు కుదరొచ్చేమో. అదీ ఇద్దరు కార్యదర్శులను కాంగ్రెస్ అధిష్ఠానం ఏదో ఓ రీతిన సంతృప్తి పరచగలిగితేనే సాధ్యం. కాంగ్రెస్, వామపక్షాలలో కొందరి నేతల స్వార్ధం, కక్కుర్తి, కేసీయార్ తో లోపాయికారీ ఒప్పందాల కారణంగానే బిజెపిపై నికరంగా పోరాటం చేయడంలో లేదా కాంగ్రెస్, కామ్రేడ్ల దోస్తీ కుదరకపోవడానికి కారణం అవుతోందన్నది నమ్మాల్సిన నిజం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments