-కుక్కల నగరం – ఆటవిక తెలంగాణ
-18 కోట్లు నిధులు ఏ కుక్కలు తిన్నాయి?
-నాయకుల కోతలు – గ్రామగ్రామానా కోతులు
-మనిషి ముఖ్యమా? జంతువులు ముఖ్యమా?
-రాక్షస రాజకీయానికి పేదోడి ప్రాణాలంటే లెక్కలేదా?
పల్లా కొండలరావు,ఖమ్మం
విశ్వనగరంగా చెప్పుకునే హైదరాబాద్ కుక్కల నగరంగా మారింది. పేదోళ్ల బిడ్డల్ని కుక్కలు చంపేస్తున్నాయి. పెద్దోళ్ల నిధులు కాజేసి కుక్కలకు మాంసం వేయకపోవడంతో అవి పేదోళ్ల పిల్లల్ని పీక్కుతింటున్నాయి.బంగారు తెలంగాణ మాట దేవుడెరుగు? ఆటవిక తెలంగాణగా మారింది. విశ్వనగరం, బంగారు తెలంగాణ, దేశానికి పాలనలో తెలంగాణ మోడల్ అంటూ కేసీయార్,కేటీయార్,హరీష్ ఇతర అనుంగు మందీమార్బలం ఓవైపు కోతలు కోస్తుండగా మరోవైపు గ్రామగ్రామాన కుక్కలు,కోతులు మనుషుల్ని బ్రతకనీయడం లేదు. ఇంత జరుగుతున్నా పాలకులకు గానీ, రాజకీయ నాయకులకు గానీ…. ఇంకా చెప్పాలంటే బాధితులైన ప్రజలకు గానీ పెద్దగా బాధ కలుగుతున్నట్లనిపించడం లేదు. రాష్ట్ర రాజధానిలో పేదోడి పిల్లగాడ్ని కుక్కలు చంపేస్తే బాధ్యతా రాహిత్యంగా మాట్లాడిన పాలకులను గానీ, రాజకీయ నాయకులని గానీ విమర్శించడంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రమే మానవత్వం, ధైర్యం ప్రదర్శించారనిపిస్తోంది. ఆయనకు జనవిజయం అభినందనలు తెలియజేస్తోంది. మరోవైపు హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేసింది. కళ్ళు లేని న్యాయదేవత కళ్లు ఉన్న ప్రజలను, పాలకులను అప్రమత్తం చేసింది. అందుకు ధన్యవాదాలు.మీకు కొంచెం కూడా బాధనిపిస్తలేదా? అంటూ హైకోర్టు సీరియస్ అయింది. బాధిత కుటుంబానికి పరిహారం అందజేశారా? అని ప్రశ్నించింది.సీ.ఎస్ సహా పలువురికి నోటీసులు అందజేసింది.ఈ నెల 16కు విచారణ వాయిదా వేసింది. రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ మేయర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఐదువేల కుక్కల్ని మేయర్ ఇంటికి పంపితే ఆమె వాటికి మాంసం అందించి ప్రేమ చూపాలంటూ ప్రశ్నించారు. ఆడవాళ్లంటే తనకు గౌరవముంది కనుక ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేకపోతున్నానని మీరంటే మాత్రం తనకు గౌరవం లేదంటూ మేయర్ స్పందన పట్ల రాము ఘూటుగా స్పందించారు.ఔను పోయింది పేదోడి కొడుకు ప్రాణమేగా అన్నట్లు రాజకీయనాయకుల, ప్రజల స్పందన ఉందనిపిస్తోంది. తమ పాలన గురించి తెగ కోతలు కోసే కేటీరామారావు బాధపడుతున్నట్లు నటించారు. కేసీయార్ ప్రగతి భవన్ కు తన కుటుంబాన్ని పిలిపించుకుని రాచకార్యాలు ఆరుగంటలు మాట్లాడారు తప్ప ఈ సంఘటనపై స్పందించినట్లనిపించలేదు. రేవంత్ రెడ్డి లాంటి వాళ్లు ఈ ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఘటనను ఉపయోగించుకుంటున్నారు తప్ప తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పలేకపోతున్నారు. కేవలం జీహెచ్ఎంసీ కి మాత్రమే బాధ్యత లేదు, మాంసం వేయకనే పిల్లాడిని కుక్కలు తిన్నాయనీ, తాను డాగ్ లవర్ నని పొంతన లేని, బాధ్యతలేని పిచ్చ సమాధానాలు చెప్పిన మేయర్ ఓ ప్రశ్నకు సమాధానం చెప్పాలనే డిమాండ్ వినిపిస్తోంది. వీధి కుక్కల సంరక్షణకు గత ఐదేండ్లుగా 18కోట్లు ఖర్చు చేసినట్లు లెక్కలు చెపుతున్నాయి. కుక్కల సంరక్షణకు ఖర్చు చేయాల్సిన ఈ నిధులను మరి ఏ కుక్కలు తిన్నాయి? 18కోట్లతో కుక్కలకు మాంసం చాలడం లేదా? మరిన్ని నిధులు కావాలా? స్టెరిలైజేషన్ సరిగా జరిగితే వీధి వీధికి వందల సంఖ్యలో కుక్కలెందుకుంటాయన్నది ప్రశ్నగా ఉంది. హైకోర్టు కూడా ఈ లెక్కలు చెప్పాలంటోంది. కేసీయార్, కేటీయార్ తమ పాలన దేశానికే మోడల్ అంటూ అందుకే భారాసా అంటూ కోతలు కోస్తున్నారు. కనీసం గ్రామాలలో కోతులను కంట్రోల్ చేయలేని ఈ కోతలు దేశానికి రోల్ మోడల్ ఎలా అవుతుందో ఆ భగవంతునికే ఎరుక! ప్రతి గ్రామంలో కోతుల బెడద కూడా తీవ్రంగా ఉంది. పంటలు నాశనం చేస్తున్నాయి. ఇళ్లలో విధ్వంసం సృష్టిస్తున్నాయి. మనుషులను కరస్తూ గాయపరుస్తున్నాయి. హైదరాబాద్ ఘటన అనంతరం విలేఖరులు కాస్త కళ్ళు తెరిచారనిపిస్తోంది. వీధి కుక్కల దాడులు, కోతుల దాడులపై వార్తలు ఇపుడు కనిపిస్తున్నాయి. వినిపిస్తున్నాయి. వెలుగులోకి రాని ఇంకెన్నో సమస్యలు, పోయిన ప్రాణాలు గ్రామాలలో ఉంటున్నాయి. కోతలు, కుక్కల దాడులపై, అవి సృష్టిస్తున్న విధ్వంసంపై నిత్యం వార్తలు ప్రచారం కావాలి. అయితే ఇది మూణ్ణాళ్ల ముచ్చటగా మిగలకుండా నిరంతరం సమస్య తీవ్రతను ప్ర(సా)చారం చేయాలి. పాలకులు సమస్యను పరిష్కరించేదాకా ప్రజలు పోరాడాలి. మరో విషయమేమిటంటే జంతుప్రేమ, డాగ్ లవర్స్ అంటూ ఓ వింత వికృత వాదన వినిపిస్తోంది. మనిషి తన శ్రమకు రక్షణగా అనాదిగా కుక్కలను పెంచుకుంటున్నారు. ఈ నవ నాగరికులు డాగ్ లవర్స్ అంటూ కొత్తగా మనకు జంతుప్రేమను గురించి చెప్పాల్సిన పనిలేదు. అదీ మనుషులు ప్రాణాలు పోతున్న సమయంలో మానవత్వానికి అర్ధం తెలిసిన ఏ మనిషీ అసలు మాట్లాడకూడని రీతిలో పాలకుల స్పందన ఉండడం దురదృష్టకరం. అటువంటి వారిని నోటుకు ఓటుని అమ్ముకుంటు ఎన్నుకుంటున్న ప్రజల దుర్గతి మరీ అన్యాయం. రాజకీయం రాక్షసంగా మారి, పాలన ఆటవికంగా మారిన నేపథ్యంలో కోర్టులు, మేధావులు మాత్రమే స్పందిస్తే సరిపోదు. ఈ పాలన పోయి మరో పాలన రావడం మాత్రమే కాదు కావలసింది. సమస్య పరిష్కారం దిశగా ఆలోచించాలి. ప్రజలు, ప్రకృతి, జంతు సంరక్షణ కోసం ఉన్న చట్టాలు అమలు ఏమిటి? వాటికోసం ఖర్చు చేస్తున్న నిధులలో అవినీతి ఏమిటన్నది నిగ్గుదేల్చాలి. మరిన్ని పేద ప్రాణాలు హరీ అనకుండా ఉండాలంటే మొత్తం సమాజం ఈ అంశంపై బాధ్యతాయుతంగా స్పందించాల్సిన అవసరం ఉంది. పోరాడితే పోయేదేమీ లేదు కుక్కలు, కోతుల బెడద తప్ప!