భద్రాచలం, జూలై 17 (జనవిజయం)
గోదావరి వరదల సందర్భంగా భద్రాద్రి అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయనందున సీఎం కెసిఆర్ పై కేసు నమోదు చేయాలని కోరుతూ భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య స్థానిక పోలీస్ స్టేషన్ లో సోమవారం ఫిర్యాదు చేసేరు. గత ఏడాది భద్రాచలం వచ్చిన సీఎం వెయ్యి కోట్లు ప్రకటించినట్లు ఆయన గుర్తు చేసేరు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం భద్రాద్రి కి వొక్క రూపాయి కూడా నిధులు మంజూరు చేయలేదని ఆరోపించారు.
2015 లో భద్రాచలం ప్రాంతం, రామాలయం అభివృద్ధి కొరకు 100 కోట్లు ప్రకటించారు కానీ నేటికీ ఒక్క రూపాయి విడుదల చెయ్యలేదు
గత ఏడాది వరదలు సంభవించి ఈ ప్రాంతం మొత్తం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు దీంతో కేసీఆర్ భద్రాచలాన్ని సందర్శించి గోదావరి నది కి ఇరువైపులా కరకట్టలు నిర్మించి ముంపు ప్రాంతాల ప్రజలకు సురక్షితమైన ప్రాంతాల్లో గృహాలు నిర్మిస్తామని ప్రకటనలు చేశారు .కానీ నేటి వరకు ఆ జాడే లేదు. అంతేకాకుండా ఈ ప్రాంతం పై పూర్తి స్థాయిలో వివక్ష చూపిస్తున్నారు .
అంతేకాకుండా అధికారులు సైతం పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, మే నెలలో జరుపవలసిన వరద సమీక్ష సమావేశం జులై నెలలో నిర్వహించారు. దీన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధి ఎలా ఉందో ప్రజలు గమనించాలి.పారిశుద్ధ కార్మికుల సమస్యలు కూడా పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అని విమర్శించారు.
ఇకనైనా ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి స్థాయిలో నిధులు మంజూరు చేసి వరదల నుంచి ఈ ప్రాంతాన్ని రక్షించే విధంగా పూర్తి స్థాయిలో రక్షణ చర్యలు చేపట్టాలని భద్రాచలం ఎమ్మెల్యే పొదేం వీరయ్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు డాక్టర్ తెల్లం వెంకటరావు, బుడగం శ్రీనివాసరావు, భోగాల శ్రీనివాస్ రెడ్డి , సరేళ్ల నరేష్, అడబాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.