– తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు డిమాండ్
– సి.ఇ.కార్యాలయం వద్ద రైతుల ధర్నా
– పూర్తి స్థాయిలో సాగర్ జలాలు విడుదల చేయాలి
– సరఫరా లో ఆఫ్ ఆన్ (వారబంది)విధానం ఎత్తివేయాలి
ఖమ్మం, ఫిబ్రవరి 25 (జనవిజయం): సాగర్ ఆయకట్టు చివర భూములకు సాగునీరు అందించి ఎండిపోతున్న పంటలను కాపాడాలని డిమాండ్ చేస్తూ ముదిగొండ మండలం వల్లాపురం,గంధసిరి గ్రామ రైతులు శనివారం ఖమ్మం ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ కార్యాలయం వద్ద ఆరు గంటలు పాటు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడుతూ ఖమ్మం జిల్లా లో సాగర్ ఆయకట్టు పరిధిలో మొక్కజొన్న పంట ఎండిపోతున్న అధికారులు స్పందించడం లేదని అన్నారు. సాగర్ ఎడమ కాలువకు 11000 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేయాలని అందులో 7000 క్యూసెక్కుల నీరు ఖమ్మం జిల్లా ఆయకట్టు కు అందించాల్సిన బాధ్యత ఉందని అలా కాకుండా కేవలం రెండున్నర వేల క్యూసెక్కుల నీరు విడుదల చేయడం వల్ల బ్రాంచి కాలువలు తూములకు నీరు అందడం లేదని, అరకొరగా నీరు వచ్చిన జిల్లా అధికారులు ఆన్ ఆఫ్ వారబంది విధానం ద్వారా సాగర్ జలాలు సరఫరా చేయడం వల్ల ఆయకట్టు చివర భూములకు సాగునీరు అందక పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు అని అన్నారు.ఖమ్మం జిల్లా లో సాగర్ ఆయకట్టు కు విడుదల చేయాల్సిన ఏడు వేల క్యూసెక్కుల నీరు విడుదల చేయాలని ఆన్ ఆఫ్ వారబంది విధానం ఎత్తివేసి సాగర్ జలాలు మార్చి చివరి వరకు నిరంతరాయంగా సరఫరా చేయాలి అని డిమాండ్ చేశారు. పాలేరు రిజర్వాయర్ నీటి సామర్థ్యం తక్కువ అవుతున్న ప్రభుత్వం పట్టించుకోకుండా 13.5 అడుగులు కు నీటి సామర్థ్యం తక్కువ అవుతుంది అని సాగునీరు పూర్తి స్థాయిలో నిలుపుదల చేయడం సరికాదని అన్నారు. ఎండలు తీవ్రత ఎక్కువ అవుతున్న సందర్భంలో సాగు నీరు అవసరం పెరుగుతున్నది అని మొక్కజొన్న పంట గింజ పోసుకునే దశలో ఉంది అని, నాలుగు, ఐదు రోజులు నీరు అందకపోతే ఖమ్మం జిల్లాలో లక్ష ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బ తింటుంది అని అన్నారు. చీఫ్ ఇంజనీర్ శంకర్ నాయక్ కార్యాలయం లో అందుబాటులో లేకపోవడం పాలేరు రిజర్వాయర్ వద్ద ఉండటంతో రైతులు ఆరు గంటల పాటు నిరసన కొనసాగించారు. చీఫ్ ఇంజనీర్ శంకర్ నాయక్ కు రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, వల్లాపురం, గంధసిరి రైతులు సమస్యలను ఫోను ద్వారా వివరించారు. సాగునీటి సమస్యలు వెంటనే పరిష్కారం చేస్తామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఖమ్మం జిల్లా సాగర్ ఆయకట్టు సమస్య వివరించామని అదనపు నీరు విడుదలకు ప్రయత్నం చేస్తున్నాం అని చివరి భూములకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వాసిరెడ్డి వరప్రసాద్, రైతులు గోపాల్‌రావు, సురేష్, రమేష్, నాగేశ్వరరావు, శ్రీనివాసరావు సతీష్ వందలాది మంది రైతులు పాల్గొన్నారు.