చెరకు మద్దతు ధర టన్నుకు ఐదు వేల రూపాయలు ప్రకటించాలి
- తెలంగాణ చెరకు రైతు సంఘం ఆధ్వర్యంలో సహాయ కమిషనర్ కు వినతి
- చెరకు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి బొంతు రాంబాబు
ఖమ్మం, జూలై 22 (జనవిజయం):
చెరకు మద్దతు ధర టన్నుకు ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి అని డిమాండ్ చేస్తూ అఖిల భారత షుగర్ కెన్ ఫార్మర్స్ ఆర్గనైజేషన్ పిలుపు మేరకు తెలంగాణ చెరకు రైతు సంఘం ఆధ్వర్యంలో షుగర్ కెన్ సహాయ కమిషనర్ కు శనివారం వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా చెరకు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఈ సీజన్ చెరకు మద్దతు ధర క్వింటాలుకు 10 రూపాయలు మాత్రమే పెంచుతున్నట్లు ప్రకటించింది అని అన్నారు.
నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండవ సారి అధికారం లోకి వచ్చిన తర్వాత టన్ను చెరుకు నుంచి 9.5 రికవరీ 10.5 కు పెంచి చెరకు రైతులకు తీవ్రమైన నష్టం చేసిందన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 8.5 రికవరీ 9.5 పెంచింది అని, కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాలు రైతులు కు వ్యతిరేకంగా చెక్కర పరిశ్రమ లకు లాభం చేసే విధానం అనుసరించడం జరిగింది అని అన్నారు. పెరిగిన ఉత్పత్తి ఖర్చులు పరిగణనలోకి తీసుకుని చెరకు మద్దతు ధర టన్నుకు ఐదు వేల రూపాయలు ప్రకటించాలి అని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మాదినేని రమేష్, ఉపాధ్యక్షులు దుగ్గి కృష్ణ, సహాయ కార్యదర్శలు గొడవర్తి నాగేశ్వరరావు, రావుల రాజాబాబు, మందా సైదులు తదితరులు పాల్గొన్నారు.