ఖమ్మం, జూలై 20 (జనవిజయం) :
బూత్ లెవల్ అధికారులు శిక్షణను సద్వినియోగం చేసుకొని, విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. గురువారం అదనపు కలెక్టర్, అదనపు కలెక్టర్ రెవిన్యూ ఎన్. మధుసూదన్ తో కలిసి, కొణిజర్ల జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో వైరా నియోజకవర్గ బూత్ స్థాయి అధికారులకు చేపట్టిన శిక్షణా కార్యక్రమంలో పాల్గొని సూచనలు ఇచ్చారు.
ఈ సందర్భంగా అభిలాష అభినవ్ మాట్లాడుతూ ఎలక్టోరల్ రోల్ తయారులో బూత్ స్ధాయి అధికారులు కీలక పాత్ర ఉంటుందన్నారు. క్రొత్తగా ఓటరు జాబితాలో చేరే వారికి ఫారం-6, తొలగింపుకు ఫారం-7, తప్పుల సవరణకు ఫారం-8 ఇవ్వడం చేయాలన్నారు. అర్హులందరు ఓటు నమోదు చేసుకునేలా చూడడం, ఓటరు జాబితా ప్రదర్శన, పోలింగ్ కేంద్రాల మార్పుకు సహకరించడం బూత్ స్థాయి అధికారుల బాధ్యత అని తెలిపారు. గరుడ యాప్ నిర్వహణపై పూర్తి అవగాహన ఉండాలన్నారు.
ఈ కార్యక్రమంలో కొనిజర్ల తహశీల్దార్ సైదులు, ఎంపిడివో రమాదేవి, బూత్ లెవల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.