బిజెపిని గద్దె దించడమే కమ్యూనిస్టుల ప్రధాన ధ్యేయం
- మతోన్మాద, కార్పొరేట్ శక్తుల నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థను రక్షించాలి
- పెట్టుబడిదారి దేశాలలో సంక్షోభం పెరుగుతుంది
- సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు బి.వెంకట్, సిఐటియు నాయకులు రమేష్ కుమార్ మక్కడ్
ఖమ్మం, జూలై 29 (జనవిజయం) :
దేశ సమైక్యత, సమగ్రతకు ముప్పు తెస్తున్న బిజెపిని గద్దె దించడమే కమ్యూనిస్టుల ప్రధాన ధ్యేయమని, నరేంద్ర మోడి ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రాకుండా కమ్యూనిస్టులు ఐక్యంగా పని చేయాలని సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు బి.వెంకట్, సిఐటియు నాయకులు రమేష్ కుమార్ మక్కడ్ అన్నారు. ఖమ్మం సుందరయ్య భవనం నందు జరుగుతున్న సిపిఐ(ఎం) జిల్లా స్థాయి రాజకీయ శిక్షణా తరగతులలో శనివారం మొదటి రోజు వర్తమాన రాజకీయాలు గురించి బి.వెంకట్, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలు గురించి రమేష్ కుమార్ మక్కడ్ బోధించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ మతం, కులం, భాష, సంస్కృతి, ఆహార అలవాట్ల పేరుతో ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చ గొడుతుందని, లౌకిక తత్వానికి ప్రజాస్వామ్యానికి, సమైక్య స్ఫూర్తికి భంగం కల్పిస్తుందని, రాజ్యాంగబద్ధంగా ఏర్పడి స్వతంత్ర సంస్థలు, దర్యాప్తు సంస్థలను కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుని, సిబిఐ, ఈడి లాంటి సంస్థలను, గవర్నర్ల వ్యవస్థను తన రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించి ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను అస్థిర పరుస్తుందని అన్నారు. కార్పొరేట్ కంపెనీలకు కోట్ల రూపాయల రాయితీలు ఇస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా ఆదాని, అంబానీ లాంటి కార్పొరేట్ సంస్థలకు అమ్ముతుందని, భారత ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి మతోన్మాద, కార్పొరేట్ శక్తుల రాజకీయాల నుంచి అత్యంత ప్రమాదం పొంచి ఉందని, నరేంద్ర మోడీ పాలనలో దేశం అనేక రంగాలలో వెనకబడిరదని, ద్రవ్యోల్బణం, పేదరికం, నిరుద్యోగం పెరిగిందని, అందుకే బిజెపి పార్టీని గద్దె దింపడానికి లౌకిక, ప్రజాస్వామ్య, ప్రగతిశీల పార్టీలన్నీ బిజేపికి వ్యతిరేకంగా ఏకమవుతున్నవని అన్నారు. పెట్టుబడిదారి దేశాలలో సంక్షోభం పెరుగుతుందని, అమెరికాకు వ్యతిరేకంగా చైనాకు అనుకూలంగా ప్రపంచ వ్యాప్తంగా కార్మికుల వర్గ పోరాటాలు పెరుగుతన్నవని, ప్రపంచ వ్యాప్తంగా కార్మికులు వర్గ పోరాటాలలో చురుకుగా పాల్గొంటున్నారని, ప్రపంచంలో కమ్యూనిస్టులకు ప్రాధాన్యత పెరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎర్రా శ్రీకాంత్, పొన్నం వెంకటేశ్వరరావు, మాచర్ల భారతి, బుగ్గవీటి సరళ, బండి రమేష్, కళ్యాణం వెంకటేశ్వరరావు, వై. విక్రమ్, బొంతు రాంబాబు, చింతలచెర్వు కోటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
