భారీ వర్షాల దృష్ట్యా అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
– జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్
ఖమ్మం, జూలై 20 (జనవిజయం):
ఖమ్మం జిల్లాలో భారీ వర్షాల దృష్ట్యా అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ అన్నారు. జిల్లాలో మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం వున్నట్లు వాతావరణ శాఖ తెలిపినందున అధికారులంతా అప్రమత్తతో, అందుబాటులో వుండాలని ఆయన ఆదేశించారు. జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు ప్రజలు సహాయానికి ఫోన్ నెం. 9063211298, టోల్‌ఫ్రీ నెం.1077కు కాల్ చేయాలని ఫోన్ నెం.కు వాట్సాప్ కూడా చేయవచ్చని తెలిపారు.
మున్సిపల్ పరిధిలో అధికశాతం పురాతన, శిథిల భవనాల గోడలు కూలే పరిస్థితులు ఉంటే వాటిని గుర్తించి నివాసితులను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు.చెరువులు, వాగుల్లోకి ప్రజలు వెళ్ళకుండా అధికారులు అప్రమత్తం చేయాలన్నారు. జిల్లాలో ఉన్న చెరువులు, రిజర్వాయర్లు, కాల్వల నీటి నిల్వలు ఎప్పటికప్పుడు పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు. చెరువులు, లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆయన సూచించారు. జిల్లాలోని చెరువులు, కుంటలు, వాగులు, వంకల వద్ద మత్తడి పొంగిపొర్లే ప్రాంతాలను గుర్తించి 24 గంటలు పర్యవేక్షించాలని ఆయన అన్నారు.
జిల్లా అధికారులు తహశీల్దారులు, ఎంపిడిఓ, ఎంపివోలు బారీ వర్షాల నేపథ్యంలో హెడ్‌క్వార్టర్‌లో ఉండి సమన్వయంతో పనులు చేయాలన్నారు. జిల్లాలో విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని, విద్యుత్ పునరుద్దరణ చర్యలు వేగవంతంగా చేపట్టాలని ఆయన అన్నారు. పరిస్థితులు మెరుగుపడే వరకు చెరువులు, వాగుల వద్ద చేపలు పట్టడానికి అనుమతించవద్దని ఆయన అన్నారు. కల్వర్టులు, రోడ్లపై ప్రవాహాలు వున్నచోట రహదారిని మూసివేయాలని, ప్రజలు దాటకుండా భద్రతా చర్యలు చేపట్టాలని ఆయన తెలిపారు. ఎలాంటి ప్రాణ, ఆస్థి, జంతు నష్టం వాటిల్లకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. కీటక జనిత వ్యాధులు ప్రభలకుండా ప్రతి మంగళ, శుక్రవారాలు డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు.