Saturday, February 24, 2024
Homeరాజకీయంభారతరత్నాలతో పెరిగిన బిజెపి గౌరవం

భారతరత్నాలతో పెరిగిన బిజెపి గౌరవం

ఈయేడు భారతరత్నలు ప్రకటించిన ఐదుగురూ విభిన్న పద్దతుల్లో దేశానికి ఎనలేని సేవలు అందించిన వారే. వారిని గుర్తించకున్నా వారి గౌరవానికి ఎక్కడా లోటు లేదు. అయితే భారతరత్నలు ఇచ్చి గౌరవించుకోవడం ద్వారా వారి సేవలను మననం చేసుకునే అవకాశం వచ్చింది. ఇది ఓ రకంగా మోడీ దూరదృష్టికి నిదర్శనంగా చూడాలి. పివి నరసింహారావు ప్రధానిగా దేశ గమనాన్ని గతిని మార్చారు. ఇవాళ మనం ఆర్థిక సంస్కరణలతో ప్రపంచం ముందు తల ఎత్తుకుని తిరుగుతున్నామంటే అందుకు పివి దక్షతే కారణం. కానీ ఆయనను గుర్తించడంలో సోనియా నయకత్వం అంగీకరించలేదు. పదేళ్లపాటు యూపిఎ పాలన ఉన్నా పివిని ఏనాడూ స్మరించలేదు. పివిని బతికి ఉండగానే అవమానించిన ఘనత సోనియా నాయకత్వంలోని కాంగ్రెస్‌ పార్టీది. ఆయన మరణిస్తే అవమానకరంగా వ్యవహరించిన దుర్మార్గాన్ని ప్రజలు అప్పుడే మరచిపోలేదు. ప్రధానిగా, కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఉన్న పివి చనిపోతే ఎంత దారుణంగా వ్వవహరించి, ఆయన భౌతిక కాయాన్ని కాంగ్రెస్‌ కార్యాలయంలోకి కూడా తీసుకుని రాకుండా చేశారు. హైదరాబాద్‌కు తిప్పిపంపారు. ఇంతటి ఘోరాన్ని చేసిన కాంగ్రెస్‌ ఆ తరవాత అంతకుమించిన ఫలితాలన్ని అనుభవించింది. పుట్టగతులు లేకుండా పోయింది.

ఈ సందర్భంలో ఆలస్యంగా అయినా పివిని గౌరవించిన ఘనత బిజెపికి, ప్రధాని మోడీకి దక్కుతుంది. ఆయన సేవలను స్మరించుకునే అవకాశాన్ని ప్రజలకు ఇచ్చింది. అయితే పివికి భారతరత్న ఇవ్వడం వెనక బిజెపి రాజకీయం ఉందని కొందరు చెప్పవచ్చు. అయినా పివిని గౌరవించడం అంటే భారతదేశాన్ని గౌరవించుకోవడం అన్నది వారు గుర్తించాలి. పివి చేసిన సేవలకు ఎంతటి ఉత్తమ పురస్కారం ఇచ్చినా తక్కువే. అయితే కొందరు చెబుతున్నట్లుగా తెలుగు రాష్టాల్ల్రో రాజకీయంగా బలపడేందుకు బిజెపి చేస్తున్న యత్నాలు ఫలిస్తాయా అన్నది రేపటి ఎన్నికల ఫలితాలను బట్టి తేలనుంది. ఇండియా టుడే సర్వే ప్రకారం తెలంగాణలో బిజెపికి నాలుగు సీట్లలో 3 వస్తాయని పేర్కొంది. ఇక ఎపిలో టిడిపి బలం పుంజుకుంటుందని సర్వే తేల్చింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టిడిపికి 17 ఎంపి సీట్లు వస్తాయని తెలిపింది. అలాగే బిజెపి మరోమారు కేంద్రంలో అధికారంలోకి వస్తుందని కూడా తెలిపింది. ఇదంతా కూడా పివికి భారతరత్న ఇవ్వడానికి ముందే జరిగిన సర్వే. అయితే కాంగ్రెస్‌ మరింతగా బలహీన పడడం, ఇండియా కూటమి లుకలుకలతో ఒక్కొక్కరే జారుకోవడంతో కాంగ్రెస్‌ ఇప్పట్లో కోలుకోవడం కష్టమే. ఈ క్రమంలో తాజాగా ప్రకటించిన భారతరత్న పురస్కారాలు బిజెపికి మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. పివి లాంటి వారిని భారతరత్నతో గౌరవించిన వారికి మేలు జరిగితే తప్పులేదు.

అయోధ్య రామాలయ నిర్మాణం, భారతరత్నలు బిజెపి పట్ల సానుకూలత పెంచే అవకాశం ఉంది. ఏదైనా బిజెపి మాత్రమే చేయగలదన్న భావన ప్రజల్లో ఇప్పుడు బలంగా ఉంది. ప్రధానంగా పివికి భారతరత్న ప్రకటించడంతో తెలుగు రాష్టాల్ర ప్రజల్లో ఆనందాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. పివికి ఇచ్చిన గౌరవంతో ప్రజల్లో బిజెపి పట్ల సానుకూలత వ్యక్తం అవుతోంది. అలాగే స్వామినాథన్‌కు భారతరత్న కూడా మేధావుల్లో అద్భుత స్పందన వస్తోంది. రామాలయం తరవాత తీసుకున్న నిర్ణయాలు ప్రజల్లో బిజెపి పట్ల సానుకూల ధోరణి ప్రదర్శించేలా చేస్తున్నాయి. అద్వానీకి భారతరత్న కూడా చాలామందిలో ఆనందం వ్యక్తం అయ్యింది. చరణ్‌ సింగ్‌కు భారతరత్న ప్రకటించడంతో జాట్లలో కూడా ఆదరణభావం పెరిగింది. ఓ రకంగా చెప్పాలంటే బిజెపి ఏలుబడిలోనే కొంత గౌరవం పెరిగిందని చెప్పాలి. భారతరత్న పౌరపురస్కారాల ప్రారంభం తరువాత, మొట్టమొదటి భారతరత్న గౌరవం 1954లో నోబెల్‌ పొందిన శాస్త్రవేత్త సి.వి. రామన్‌కు దక్కింది. ఆ తరువాత, జాతీయోద్యమ కాలానికి చెందిన అనేకమంది ప్రముఖులకు, వివిధరంగాల మేధావులకు భారతరత్నలు ఇచ్చారు. వాజపేయి ప్రధానిగా ఉన్న కాలంలో సంగీతకళాకారులు పండిట్‌ రవిశంకర్‌, బిస్మిల్లా ఖాన్‌, భీమ్‌ సేన్‌ జోషి, అస్సాం ప్రజానాయకుడు గోపినాథ్‌ బోర్డోలోయి, నోబెల్‌ గ్రహీత అమర్త్య సేన్‌, సంపూర్ణ విప్లవవాది జయప్రకాశ్‌ నారాయణ్‌.. తదితరులకు భారతరత్నలు అందాయి.

నరేంద్రమోదీ తొలి పాలనలో వాజపేయి, మదన్‌మోహన్‌ మాలవీయకు భారతరత్నలు ఇచ్చారు. మాలవీయ జాతీయోద్యమ కాలపు ఉన్నతాశయాలు కలిగిన వ్యక్తి. ప్రణబ్‌ ముఖర్జీ కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎదిగిన వారే. తాజాగా కర్పూరీ ఠాకూర్‌లను కూడా బీజేపీ భారతరత్నలతో సత్కరించింది.ఇక లాల్‌ కృష్ణ ఆద్వానీకి కూడా మొన్ననే భారతరత్నను ప్రకటించారు. రామాలయ ఉద్యమంలో  ఆద్వానీ ముఖ్యపాత్ర వహించారు. మోదీ లేకపోతే రామాలయం సాధ్యమయ్యేది కాదన్న అభిప్రాయాన్ని ఎవరూ కాదనలేరు. నిరాడంబరత, నిజాయితీ, సిద్దాంతనిబద్ధత కలిగిన కర్పూరీ ఠాకూర్‌కు భారతరత్న ఇవ్వడంలో కూడా ఔచిత్యం ఉంది.  దేశ సమాజంలో, ప్రజాజీవితంలో గుర్తింపు పొందినా రత్నాలు రానివారు ఎందరో.  అందులో కొందరికైనా గుర్తింపు దక్కిందంటే అది బిజెపి చలవే.  తమ జీవితాచరణ ద్వారా జనజీవితాన్ని, చైతన్యాన్ని మెరుగు పరచడానికి, మొత్తంగా సమాజగమనాన్ని ముందుకు నడపడానికి తోడ్పడినవారు ఎందరో ఉన్నారు. సమష్టి, సహకార జీవితాన్ని, శాంతి సామరస్యాలను, ఉదాత్తమైన విలువలను స్ఫురింపజేసేవారు స్ఫూర్తిదాతలు. అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ, వ్యక్తిత్వంలో,చిత్తశుద్ధిలో అందరికీ ఆమోదయోగ్యులుగా ఉండేవారు జాతి ఇచ్చే ఉన్నత గౌరవానికి అర్హులు. గౌరవప్రతిష్ఠలకు సంబంధించి భారతరత్నాలను చూసినప్పుడు దేశం గౌరవం పెరుగుతుంది. కొందరికి అప్పనంగా భారతరత్నలు ప్రకటించారు. వారి పేర్లు ప్రకటించి వారిని తక్కువ చేసుకోవడం సరికాదు. కానీ తాజాగా ప్రకటించిన ఐదుగురు భారత రత్నాల్లో నిజమైన రాత్నాలని చెప్పకతప్పదు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments