రేవంత్ పై బంధం శ్రీనివాసరావు వ్యాఖ్యలు హాస్యాస్పదం
- రైతులకు ఉచిత విద్యుత్ అందించిన చరిత్ర కాంగ్రెస్దే : పైడిపల్లి కిషోర్ కుమార్
- కరెంటు అమ్ముకున్న చరిత్ర బిఆర్ఎస్ ది
- మీది నిజమైన బీఆర్ఎస్ నా? లేక… చంద్రబాబు బీఆర్ఎస్ నా?
- మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గాలి దుర్గారావు ధ్వజం
బోనకల్ , జూలై 21(జనవిజయం):
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చంద్రాబాబు ఏజెంట్ అంటూ మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ బంధం శ్రీనివాసరావు వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా ఉందని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గాలి దుర్గారావు అన్నారు.శుక్రవారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన పీసీసీ సభ్యులు పైడిపల్లి కిషోర్ కుమార్,గాలి దుర్గారావు బంధం శ్రీనివాసరావు మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండించారు.రేవంత్ రెడ్డి చంద్రబాబు ఏజెంట్ అంటూ శ్రీనివాసరావు మాట్లాడటం కంటే ముందు టిఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ గత చరిత్ర ఏంటో తెలుసుకొని మాట్లాడాలని ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వంలో 88 మంది ఎమ్మెల్యేలు ఉంటే అందులో 44 మంది ఎమ్మెల్యే లు కూడా టీడీపి నుంచీ వచ్చిన వారేనని అంతేకాక ప్రస్తుత మంత్రిపదవుల్లో కొనసాగుతున్న కేసిఆర్ తో సహా మొత్తం 18 మంది ఉంటే అందులో 11 మంది మంత్రులు టీడీపి నుంచీ వచ్చిన వారేనని, బీఆర్ఎస్ పార్టీయే టీడీపి బి పార్టీ గా మారిందంటు ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలను నుంచి పెరుగుతున్న జనాదరణ చూసి ఓర్వలేక రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను వక్రీకరిస్తూ బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారాలకు తెరలేపిందని అన్నారు. నిజంగా రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ అందించి ఉంటే టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేసిన సవాలు ఏదైతే ఉందో ఏసబ్ స్టేషన్ పరిధిలో అయినా బీఆర్ఎస్ పార్టీ 24 గంటలు ఉచిత విద్యుత్ అందించినట్లు నిరూపిస్తే ఆ సబ్ స్టేషన్ పరిధిలో తాము ఓట్లు అడగబోమని నిరూపించలేని యెడల బీఆర్ఎస్ పార్టీ ఆ సబ్ స్టేషన్ పరిధిలో అడుగు పెట్టకూడదని సవాలను ఇంతవరకు స్వీకరించలేదని మండల పరిధిలో మీరైనా ఏ సబ్స్టేషన్ లో నైనా ఉచిత కరెంట్ ఇచ్చినట్లు నిరూపిస్తామంటే తాము సిద్ధంగా ఉన్నామంటూ సవాల్ విసిరారు.
బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన రైతు రుణమాఫీ నేటి వరకు కూడా నెరవేర్చలేదని,బ్యాంకులో రుణాలు తీసుకున్న రైతులు వేలకు వేలు వడ్డీలు చెల్లించి అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటివరకు రుణమాఫీపై ప్రకటన చేయకపోవడం దురదృష్టకరమని అన్నారు. రైతులను నిలువునా మోసం చేసిన ఘనత బీఆర్ఎస్ దేనని దుయ్యబట్టారు.దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని గుర్తు చేశారు.రైతును రాజు చేసిన ప్రభుత్వం కూడా కాంగ్రెస్సేనని కీర్తించారు.
సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బోనకల్ మండల కేంద్రంలో పంట నష్టపరిహారం పరిశీలించేందుకు వచ్చి ప్రతి ఎకరాకు పది వేలు నష్టపరిహారం చెల్లిస్తామని ప్రకటించి వెళ్లారని,ఇప్పటివరకు మండలంలో ఎన్ని ఎకరాలకు పంట నష్ట పరిహారం క్రిందా పదివేల రూపాయలు చెల్లించారో చెప్పాలని బంధం శ్రీనివాసరావును మీడియా ముఖంగా ప్రశ్నించారు.టీడీపి లేకపోతే బీఆర్ఎస్ పార్టీకీ నామరూపాలే లేవన్నారు. అలాంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మీరు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ ను పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని విమర్శించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.
ఈ సమావేశంలో కలకోట సొసైటీ చైర్మన్ కర్నాటి రామకోటేశ్వరావు, మండల కిసాన్ సెల్ అధ్యక్షులు నల్లమోతు సత్యనారాయణ, చొప్పకట్లపాలెం,చిరునోముల సర్పంచులు ఎర్రంశెట్టి సుబ్బారావు,ములకారపు రవి,యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు భద్రు నాయక్, వంగాల రామారావు, అచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.