మణిపూర్ మంటల్లో అవ‘మానభంగం’ పర్వం
ప్రతి భారత సతిమానం
చంద్రమతి మాంగల్యం
మర్మస్థానం కాదది
మీ జన్మస్థానం…
శిశువులుగా మీరు పుట్టి
పశువులుగా మారితే…
దశాబ్ధాల క్రితం రాసిన పాట
సినీ కవి వేటూరి పేల్చిన తూట
ఇప్పుడు కళ్లకు కట్టినట్టు ఉంది..
ఒరేయ్…
మీరు ఊరేగించింది…
ఒక మగువ మర్మస్థానాన్ని కాదు,
ఈ దేశ సభ్యత సంస్కారాల గర్భగుడిని…
మీరు చిదిమింది ఓ నెత్తురు గుడ్డును కాదు,
ఈ మట్టి పొరల్లో దాగిన సహన శక్తిని…
ఈ నేలలో రాలింది ఆమె నెత్తురు కాదు,
ఈ భారతావని కళ్లళ్లో రుధిర భాష్పాలు…
ఎవడిచ్చారురా మీకీ స్వేఛ్చ..?
చనుబాల పై విషం చిమ్మే కక్ష…
కన్నులుండి కబోధులైన ధృతరాష్ట్రుల పాలనలో…
పాలిచ్చే తల్లుల వేదన పట్టని పాలించే తండ్రులన్న దేశంలో…
ఎంత గుండె కోతను అనుభవించారో కదరా…
నెత్తుటి ముద్దల పై మీ మగతనం కత్తులు దూస్తుంటే…
ఎంత క్షోభ అనుభవించారో కదరా…
ఇంకిన కన్నీళ్లు ఆవిర్లు కమ్మిన లావాలా పొంగుతుంటే…
ఇంకా అనుభవించండి రా..
ఈ దేశ సమాధుల నిండా దాగిన సభ్యతను..
శిథిలాల నడుమ దాగిన సహనాల గోడలను బద్దలుకొట్టి…
వెల్లువలై ఎగిసే రుధిర జ్వాలల బడబానలాలను పుక్కిలి బట్టి…
మహంకాళులై మీ రొమ్ము చీల్చక ముందే…
అనుభవిచండిరా…
ఈ దేశ చరిత్ర మిమ్మల్ని క్షమించదు…
ఏ మతమైతే ఏందిరా.. తాగేది అమ్మపాలే కదరా..
ఏ కులమైతే ఏందిరా… అరిచేది అమ్మా అనే కదరా…
ఈ నెత్తుటి రాతల రుధిర భారతం.. ఆరని జ్వాలల కొత్త జాతకం..
–అయితగాని జనార్ధన్
అడ్వకేట్, కవి, జర్నలిస్ట్.