ఖమ్మం, ఆగస్టు 16 (జనవిజయం): స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న మహనీయుల జీవిత చరిత్ర, స్వాతంత్ర్య ఉద్యమాలపై నేటి తరం విద్యార్థులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ రాష్ట ప్రభుత్వం విద్యార్థులకు గాంధీ సినిమాను ఉచితంగా చూపించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా నేటి నుండి ఈ నెల 24 వరకు జిల్లాలోని అన్ని సినిమా థియేటర్లలో ఉదయం 10 గంటల నుండి ఒంటి గంట వరకు గాంధీ సినిమాను విద్యార్థులకు ఉచితంగా చూపించనున్నట్లు తెలిపారు. మంగళవారం ఉదయం కలెక్టర్, పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్ తో కలిసి నగరంలోని ఏషియన్ సాయిరాం, తిరుమల 70ఎంఎం థియేటర్లలో గాంధీ సినిమాను తిలకించారు. ఈ సందర్బంగా కలెక్టర్ విద్యార్థులకు కల్పించిన రవాణా సౌకర్యం, తదితరములను పరిశీలించారు.
జిల్లాలోని మొత్తం 17 థియేటర్లలో ఉదయం 10 గంటల నుండి గాంధీ సినిమా ఒక షో ను విద్యార్థులకు చూపించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఖమ్మం నగరంలో 6, సత్తుపల్లి లో 2, మధిర లో 2, బోనకల్, ఏన్కూరు, తల్లాడ, వైరా, కల్లూరు, నేలకొండపల్లి, సింగరేణి లలో ఒక్కో థియేటర్లు ఉన్నట్లు ఆయన తెలిపారు. మనం ఎన్ని పాఠాలు చదివినా, పరీక్షలు రాసిన స్వాతంత్ర ఉద్యమంలో జరిగిన సంఘటనలు, సన్నివేశాలు గాంధీ లాంటి సినిమా చూడటం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. జిల్లాలోని విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ గాంధీ సినిమా చూడాలని కలెక్టర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి సోమశేఖరశర్మ, ఖమ్మం ఆర్డీవో గుంటుపల్లి గణేష్, ఎసిపిలు పివి. గణేష్, ప్రసన్న కుమార్, విద్యాశాఖ సీఎంఓ రాజశేఖర్, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ శైలజ, అధికారులు తదితరులు ఉన్నారు.